కొత్తఓటర్లకు ఎలక్షన్ కమీషన్ గుడ్ న్యూస్..!
దేశంలో కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే పౌరులకు ఇబ్బందిగా మారిన అదనపు నిబంధనలను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తన అధికారిక పోర్టల్‌లో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఆన్లైన్లో ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేసే సమయంలో, దరఖాస్తుదారుల తల్లిదండ్రులు లేదా పూర్వీకుల వివరాలను మునుపటి ఎస్ఐఆర్ (SIR) ఓటర్ల జాబితాలతో మ్యాపింగ్ చేస్తూ అదనపు డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చేది. ఈ అదనపు ఆంక్షల వల్ల ప్రక్రియ క్లిష్టంగా మారిందన్న ఉద్దేశంతో, ఈ నిబంధనను తక్షణమే ఉపసంహరిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.
చట్టబద్ధమైన నిబంధనల పరిధిని దాటి ఈ అదనపు ఫీల్డ్స్ ఆన్లైన్ పోర్టల్‌లోకి రావడంపై అంతర్గతంగా చర్చ నడిచింది. అయితే, కేవలం ఐటీ విభాగం చేసిన సాంకేతిక మార్పుల వల్లే ఈ అదనపు వివరాలు దరఖాస్తుదారులకు కనిపించాయని అధికారులు స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా స్పందించిన ఈసీ, వెంటనే ఆ వివాదాస్పద డిక్లరేషన్ ఫీల్డ్స్‌ను పోర్టల్ నుండి శాశ్వతంగా తొలగించింది. ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ ముగిసిన అన్ని రాష్ట్రాల్లో ఈ సడలింపు వర్తిస్తుంది.
ఇవి కూడా చదవండి
ఈ నిర్ణయం తర్వాత నూతన దరఖాస్తుదారులు ఇకపై ఎలాంటి పాత రికార్డుల లింకేజ్ లేదా అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండానే సాధారణ ఫారమ్-6 ద్వారా నేరుగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతం ఇంకా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రం ఈ నిబంధన తాత్కాలికంగా కొనసాగుతుందని ఈసీ వెల్లడించింది. ఈ కీలక మార్పుతో దేశవ్యాప్తంగా నూతన ఓటర్ల నమోదు ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.








