92% పడిపోయిన H-1B వీసాలు! ఇండియన్ ITకి బిగ్ షాక్.. ‘అమెరికా డ్రీమ్’ క్లోజ్?
అమెరికా కలలు కనే భారతీయ టెక్కీలకు, అలాగే ఐటీ దిగ్గజాలకు ఈ వార్తని కలలో కూడా ఊహించి ఉండరు. ఇన్నాళ్లూ హుషారుగా విమానం ఎక్కి యూఎస్ వెళ్లి అక్కడే ప్రాజెక్టులు చేసే వీసా ముచ్చటకు ఇప్పుడు దాదాపు తెరపడినట్లే కనిపిస్తోంది. FY27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనదేశంలోని టాప్-6 ఐటీ కంపెనీలు దరఖాస్తు చేసిన H-1B వీసాల సంఖ్య దారుణంగా పడిపోయింది. గతంలో ఏకంగా 21,919 రిజిస్ట్రేషన్లు చేస్తే, ఈసారి ఆ సంఖ్య కేవలం 1,763కి పరిమితమైంది. అంటే ఒక్కసారిగా 92 శాతం పతనం నమోదైంది. కంటిముందు కనిపిస్తున్న ఈ నంబర్లు కేవలం వీసాల తగ్గింపు మాత్రమే కాదు, దశాబ్దాలుగా నడుస్తున్న భారత ఐటీ కంపెనీల బిజినెస్ మోడల్లోనే వస్తున్న ఒక పెద్ద తుఫానుకు సంకేతం.
అసలు ఖర్చుల లెక్కలు ఎందుకు తలకిందులయ్యాయి?
TCS, Infosys, Wipro, HCLTech, LTIMindtree, Tech Mahindra వంటి దిగ్గజాలు ఇన్నాళ్లూ H-1B వీసాల ఆధారంగానే వేలాది మంది ఇంజనీర్లను అమెరికాకు పంపి క్లయింట్ ఆఫీసుల్లోనే కూర్చోబెట్టి పనిచేయించేవి. కానీ ఇప్పుడు ఆ సీన్ మారడానికి ప్రధాన కారణం డాలర్ల భారం పెరిగిపోవడమే. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ ప్రకారం ఒక్కో H-1B పిటిషన్ దాఖలు చేయాలంటే కంపెనీలు $103,265 (దాదాపు కోటి రూపాయలు) దాకా ఫీజు రూపంలో చెల్లించాల్సి వస్తోంది.
దీనికి తోడు ‘ఎవరికి ఎక్కువ జీతం ఉంటే వాళ్లకే వీసా’ అనే కొత్త లాటరీ నిబంధన తీసుకొచ్చారు. దీనివల్ల మధ్యస్థాయి జీతాలు పొందే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వీసాలు రావడం దాదాపు అసాధ్యంగా మారింది. దాంతో అంత భారీ మొత్తంలో డబ్బులు పోసి, లాటరీ వస్తుందో లేదో తెలియని పరిస్థితిలో ఐటీ కంపెనీలు వెనక్కి తగ్గాయి.
కంపెనీల ప్లాన్ బి: విమానం ఎక్కించడం కాదు, పనిని ఇక్కడికే తెప్పించడం!
అమెరికాకు డెస్టినేషన్ టికెట్ కట్ అవ్వగానే మన కంపెనీలు కూడా తమ రూట్ మార్చేశాయి. ఇకపై “మనుషులను అమెరికాకు పంపడం కాదు… పనినే భారత్‌కు తెప్పించుకోవడం” అనే కొత్త ఫార్ములాను గట్టిగా పట్టుకుంటున్నాయి. గత ఐదేళ్లలోనే మన ఐటీ సంస్థలు అమెరికాలో స్థానికంగా ఉన్న టాలెంట్‌ను నియమించుకోవడానికి, అక్కడ ఆఫీసులు పెట్టడానికి సుమారు $1.1 బిలియన్ల పెట్టుబడులు పెట్టాయి. ఆ ముందస్తు జాగ్రత్తే ఇప్పుడు మన కంపెనీలకు ఆసరాగా నిలుస్తోంది. అక్కడ కచ్చితంగా ఉండాల్సిన పనులకు స్థానిక అమెరికన్లను లేదా అక్కడే ఉన్నవారిని వాడుకుంటూ, మిగతా మెజారిటీ కోడింగ్, డెవలప్మెంట్ పనంతా ఇండియాలోని తమ ఆఫీసుల నుంచే రిమోట్‌గా పూర్తి చేస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ గేమ్‌ను ఎలా మార్చేస్తోంది?
ఈ వీసా సంక్షోభానికి తోడు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రాక కూడా తోడైంది. ఒకప్పుడు యూఎస్‌లో ఉండే ఒక క్లయింట్ ప్రాజెక్ట్ కోసం 10 మందిని అక్కడికి పంపాల్సి వస్తే, ఇప్పుడు ఆ పనిని AI, ఆటోమేషన్ టూల్స్ సాయంతో భారత్‌లో ఉండే ఒక ఇద్దరు ముగ్గురు డెవలపర్లు చాలా వేగంగా పూర్తి చేసేస్తున్నారు. అందుకే కంపెనీలకు కూడా ఖర్చుతో కూడుకున్న వీసా ప్రాసెస్ కంటే ఇండియా నుంచి AI సాయంతో పనిచేయించడమే అత్యంత లాభదాయకంగా అనిపిస్తోంది.
ముగింపుకు చేరిన పాత రోజులు!
ఈ ఆంక్షలు సెప్టెంబర్ 2027 వరకు కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే, కేవలం చౌకగా దొరికే మనవాళ్లను అమెరికాకు పంపి కోట్లు సంపాదించే పాత ఐటీ శకం ముగిసిపోయిందని స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో ఏ కంపెనీ దగ్గరైతే అధునాతన AI సాంకేతికత, భారత్‌లో బలమైన డెలివరీ టీమ్‌లు ఉంటాయో ఆ కంపెనీలే గ్లోబల్ మార్కెట్లో నిలబడతాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఈ H-1B షాక్ వల్ల మన ఐటీ రంగానికి అమెరికా బాట కాస్త కష్టమైనప్పటికీ, ఇండియాలోనే ఉండి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను శాసించే కొత్త శకానికి ఇది పునాది వేస్తోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








