సీఎం చంద్రబాబుకు దుర్గగుడి అధికారుల ఆహ్వానం..!
విజయవాడ ఇంద్రకీలాద్రిపై(Vijayawada Temple) కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగే ‘దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు'(dussera Navaratri) హాజరుకావాల్సిందిగా ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అధికారికంగా ఆహ్వానించారు. అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రతినిధి బృందం.. ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ సందర్భంగా ఆలయ వైదిక కమిటీ అర్చకులు సీఎం చంద్రబాబుకు కనకదుర్గమ్మ అమ్మవారి శేషవస్త్రాన్ని, ప్రసాదాలను అందించి, వేద మంత్రాలతో ఘనంగా వేదాశీర్వచనం పలికారు.
ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ పది రోజుల్లో అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమివ్వనుండగా, చివరి రోజు విజయదశమి సాయంత్రం కృష్ణానదిలో జరిగే హంసవాహన తెప్పోత్సవంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి ఆరా తీశారు. దేశం నలుమూలల నుండి తరలివచ్చే లక్షలాది మంది సామాన్య భక్తులకు దర్శనాల కల్పనలో గానీ, ఘాట్ రోడ్ క్యూలైన్ల నిర్వహణలో గానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి దసరా మహోత్సవాలకు ఆహ్వానించిన వారిలో దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈఓ శీనా నాయక్ మరియు పాలక మండలి సభ్యులు ఉన్నారు. ఈసారి దసరా వేడుకలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. దేశంలోని మరో ఆరుగురు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించేందుకు దేవాదాయ మరియు ఆరోగ్య శాఖలు ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేశాయి.








