తెలుగు రాష్ట్రాల ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్..!
ప్రకృతి ప్రేమికులకు, వన్యప్రాణుల సందర్శనను ఇష్టపడే పర్యాటకులకు అటవీ శాఖ సరికొత్త తీపి కబురు అందించింది. వన్యప్రాణులు మరియు పులుల సంతానోత్పత్తి కాలం ముగియడంతో.. దాదాపు మూడు నెలల పాటు తాత్కాలికంగా నిలిచిపోయిన నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రసిద్ధ ‘జంగిల్ సఫారీ’ (Jungle Safari) సేవలు గురువారం నుండి అధికారికంగా పునఃప్రారంభమయ్యాయి. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (NTCA) నిబంధనల ప్రకారం ప్రతీ ఏటా జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు కోర్ ఏరియా పరిధిలో పర్యాటకాన్ని పూర్తిగా నిషేధిస్తారు.
ఈ సీజన్ గడువు నిన్నటితో ముగియడంతో తిరిగి పర్యాటకులకు అడవిలోకి అనుమతులు లభించాయి. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) పరిధిలోని ఆత్మకూరు డివిజన్ బైర్లూటి ఎకో టూరిజం కేంద్రం, శిరివెళ్ల సమీపంలోని పచ్చర్ల జంగిల్ క్యాంప్లతో పాటు తుమ్మలబయలు, రోళ్లపాడు సఫారీ కేంద్రాలను నేటి నుండి యథావిధిగా రన్ చేయనున్నారు. సఫారీ రైడ్లతో పాటు నల్లమల అటవీ అంతర్భాగంలో దట్టమైన కొండల మధ్య కొలువైన ఇష్టకామేశ్వరి దేవి ఆలయం, రుద్రకోడూరు, గుండ్ల బ్రహ్మేశ్వరం వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు కూడా భక్తులకు, పర్యాటకులకు అటవీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నల్లమల టైగర్ సఫారీలో పర్యాటకుల కోసం అటవీ శాఖ ప్రత్యేక జిప్సీ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఉదయం 6:00 గంటల నుండి 10:00 గంటల వరకు, మరియు తిరిగి సాయంత్రం 3:00 గంటల నుండి 6:00 గంటల వరకు సఫారీ రైడ్స్ అందుబాటులో ఉంటాయి. అడవిలో ప్లాస్టిక్ వాడకం, ధూమపానం, మద్యపానాన్ని అటవీ శాఖ కఠినంగా నిషేధించింది. దట్టమైన అడవిలో చెంచు గిరిజనుల ఆతిథ్యం, వన్యప్రాణుల సందర్శన, వాచ్ టవర్ల నుండి ప్రకృతి అందాలను వీక్షించాలనుకునే వారు ఆన్లైన్ లేదా ఎకో టూరిజం కేంద్రాల వద్ద నేరుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.








