ప్రత్యక్ష రాజకీయాలపై మాజీ మావోయిస్టుల మధ్య విభేదాలు!?
మాజీ మావోయిస్టుల అడుగులు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు తుపాకి నీడలో, అడవి బాటలో పోరాటం చేసిన నాయకులు ఇప్పుడు ప్రజాస్వామ్య రాజకీయాలలోకి వస్తుండటం కీలక పరిణామం. అయితే, రాజకీయాల్లో భాగస్వామ్యం కావాలనే విషయంలో వారి మధ్యే ఏకాభిప్రాయం లేనట్టు అర్థమవుతోంది. భావజాల పరంగా, సంస్థాగత వ్యూహాల పరంగా వారు వేర్వేరు మార్గాలను ఎంచుకోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
మాజీ మావోయిస్ట్ నేత లంక పాపి రెడ్డి ఇటీవల ‘జన తెలంగాణ పార్టీ’ని స్థాపించారు. సెప్టెంబర్ 19న ఆయన పార్టీ ముసాయిదా విడుదల చేశారు. ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితం లొంగిపోయిన పాపి రెడ్డి, ప్రస్తుతం లాసెట్ ఉత్తీర్ణులై ఎల్ఎల్బీ కోర్సు అభ్యసిస్తూనే ఈ రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడిచినా.. ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదని.. అందుకే తాము కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని తెస్తున్నామని ఆయన చెప్తున్నారు. ఈ పార్టీకి గురజాల రవీందర్ రావు, అజయ్, మల్లా రెడ్డి వంటి మాజీ మావోయిస్టులు మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమావేశాలు నిర్వహించిన ఈ వేదిక, రాబోయే రోజుల్లో విస్తరణకు సిద్ధమవుతోంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు.. మాజీ మావోయిస్టులైన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న మాత్రం పాపి రెడ్డి పార్టీతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 26న విడుదల చేసిన ప్రకటనలో ఈ ముగ్గురు నేతలు ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. అయితే.. వీరు ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటూనే.. ఒక విశాలమైన సామాజిక, రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. లెఫ్ట్, మార్క్సిస్ట్-లెనినిస్ట్ పార్టీలు, ప్రజా సంఘాలు, దళిత, ఆదివాసీ, బహుజన, మైనారిటీ సమూహాలను కలుపుతూ ఒక ఐక్య వేదికను నిర్మించాలని వీరు భావిస్తున్నారు. సామ్రాజ్యవాద, బూర్జువా, పెట్టుబడిదారి శక్తులు, ఫాసిస్టు పోకడలకు వ్యతిరేకంగా చట్టబద్ధంగా పోరాడాలని ఈ వేదిక లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల హైదరాబాద్లో లొంగిపోయిన దేవ్జీ, ప్రజల హక్కుల పరిరక్షణ కోసమే తాను ప్రజా జీవితంలోకి వస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ పరిణామాలు గమనిస్తే.. మాజీ మావోయిస్టుల పునరావాసం కేవలం వ్యక్తిగత జీవన మార్పుకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాలపై ఒక సైద్ధాంతిక ప్రభావాన్ని చూపే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఒకరు రాజకీయ పార్టీ రూపంలో చట్టసభల ప్రవేశానికి ప్రయత్నిస్తుంటే, మరికొందరు ప్రజా ఉద్యమాల ద్వారా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఈ భిన్న మార్గాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.








