మీరు Amazon Prime వాడుతున్నారా? మీ అకౌంట్లోకి $200 రిఫండ్!
అమెజాన్ ప్రైమ్ వాడుతున్నారా? అయితే ఇది నిజంగానే సూపర్ న్యూస్! 2019 నుంచి 2025 మధ్యలో మీ అనుమతి లేకోకుండానే ప్రైమ్ మెంబర్షిప్ పైసలు కట్ అయిపోయినా, లేదా మెంబర్షిప్ వద్దురా బాబోయ్ అని క్యాన్సిల్ చేద్దామంటే తిప్పలు పెట్టినా సరే.. ఇప్పుడు ఏకంగా $200 (మన భారతీయ కరెన్సీలో దాదాపు ₹17,000) వరకు తిరిగి మీ అకౌంట్లో పడబోతున్నాయి. అది కూడా మీరేం ప్రత్యేకంగా ఫారాలు నింపి దరఖాస్తు చేయాల్సిన పని లేకుండానే నేరుగా రిఫండ్ వచ్చేస్తుంది.
అసలేం జరిగింది? అమెజాన్ ఎందుకు అన్ని కోట్లు కడుతోంది?
అమెరికాకు చెందిన ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) అమెజాన్ చేసిన ఒక చిన్న ట్రిక్‌ను పట్టుకుంది. ఆన్లైన్ చెక్అవుట్ చేసేటప్పుడు కస్టమర్ల అనుమతి లేకుండానే వాళ్లను పెయిడ్ ప్రైమ్ మెంబర్షిప్లలోకి నెట్టేసిందని, తీరా వద్దు అని క్యాన్సిల్ చేసుకుందామంటే ఆ ప్రాసెస్‌ను బాగా గందరగోళంగా మార్చేసిందని కోర్టులో కేసు వేసింది. దీంతో అమెజాన్ ఏకంగా $2.5 బిలియన్లు (అందులో $1 బిలియన్ జరిమానా, $1.5 బిలియన్లు బాధితులకు రిఫండ్ల కోసం) చెల్లించడానికి ఒప్పుకుంది.
అక్టోబర్ 1 నుంచి ఎవరికి ఈ రిఫండ్ దక్కుతుంది?
అమెరికాలో ఉంటూ, 2019 జూన్ 23 నుంచి 2025 జూన్ 23 మధ్యకాలంలో తెలియకుండా ప్రైమ్‌లో చేరిన వారికి లేదా క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించి విఫలమైన వారికి ఈ డబ్బులు వస్తాయి. ఇంతకుముందు కేవలం ప్రైమ్ ప్రయోజనాలు దాదాపు వాడని వారికే ఈ ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి రూల్స్ సడలించారు. ప్రైమ్ మెంబర్‌షిప్‌లో ఉంటూ ఏడాదికి 11 నుంచి 20 ప్రైమ్ ప్రయోజనాలు (అంటే ప్రైమ్ వీడియో చూడటం, ప్రైమ్ మ్యూజిక్ వినడం వంటివి) వాడిన వాళ్లకు కూడా ఈ రిఫండ్ వస్తుంది.
మీ ఖాతాలోకి ఎంత డబ్బు, ఎలా వస్తుంది?
ఇంతకుముందు గరిష్టంగా ఒక్కొక్కరికి $51 మాత్రమే ఇచ్చేవారు. కానీ ఇటీవల ఫెడరల్ కోర్టు ఆదేశాలతో ఈ పరిమితిని ఏకంగా $200కు పెంచారు. గతంలో మొదటి విడతలో $51 అందుకున్న వారికి కూడా ఇప్పుడు మిగిలిన $149 వరకు ఆటోమేటిక్‌గా జమ అవుతాయి. ఈ డబ్బు మీ అమెజాన్ ఖాతాకు లింకైన PayPal, Venmo వాలెట్లకు కానీ, లేదంటే నేరుగా మీ ఇంటి అడ్రస్‌కు పేపర్ చెక్ రూపంలో కానీ వస్తుంది. అయితే ఈ చెక్ లేదా ఆన్లైన్ డబ్బును 60 రోజుల్లోగా క్లెయిమ్ చేసుకోవాలి, లేదంటే ఆ డబ్బు మళ్లీ వెనక్కి వెళ్ళిపోతుంది.
రిఫండ్ పేరుతో వచ్చే ఫేక్ మెసేజ్‌లతో జాగ్రత్త!
ఇంతటి భారీ రిఫండ్ వార్త బయటకు రాగానే సైబర్ కేటుగాళ్లు కూడా రంగంలోకి దిగుతారు. అమెజాన్ గానీ, FTC గానీ మీ రిఫండ్ పంపడానికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు, ఓటీపీలు లేదా బ్యాంకింగ్ వివరాలు అస్సలు అడగవు. కాబట్టి “మీ అమెజాన్ రిఫండ్ రెడీగా ఉంది, కింద ఉన్న లింక్ నొక్కండి లేదా కొద్దిగా ఫీజు కట్టండి” అని ఎవరైనా ఫోన్లు, మెసేజ్‌లు చేస్తే అస్సలు నమ్మకండి. అది పక్కా స్కామ్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








