43 వేల చొప్పున! 10 లక్షల మందికి ట్రంప్ చెక్కులు.. అసలు కారణం ఇదే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకున్న ఓ కొత్త నిర్ణయం ఇప్పుడు అక్కడ పెద్ద చర్చకి దారితీసింది. అమెరికాలోని దాదాపు 10 లక్షల మంది ఇళ్లకు త్వరలోనే 500 డాలర్ల చెక్కులు రాబోతున్నాయి. మన భారతీయ కరెన్సీలో చూసుకుంటే ఇది సుమారు రూ.43 వేల మాట! వినడానికి ఇది ఏదో కొత్తగా ప్రకటించిన ప్రభుత్వ ఉచిత పథకంలా అనిపిస్తున్నా, అసలు విషయం మాత్రం అది కాదు. మరేంటి..అసలు విషయం ఏమిటి..ఎందుకు ట్రంప్ ప్రభుత్వం ఈ డబ్బులు ఇస్తోంది?
అసలు ఈ 43 వేల కథేంటి?
ట్రంప్ ప్రభుత్వం పంపుతున్న ఈ ఒక్కో చెక్ విలువ 500 డాలర్లు. దాదాపు 9.5 లక్షల మందికి పైగా ఉన్న Affordable Care Act (ACA) లబ్ధిదారులకు ఈ సొమ్ము చేరనుంది. అంటే మొత్తంగా చూస్తే వందల కోట్ల డాలర్లు మళ్లీ ప్రజల చేతుల్లోకి వెళ్తున్నాయన్నమాట. విచిత్రమేంటంటే, ఈ చెక్కుతో పాటు స్వయంగా డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ఒక ప్రత్యేక లేఖ కూడా ప్రజల ఇళ్లకు చేరుతోంది.
ఇక ఈ డబ్బు ఎందుకు తిరిగిస్తున్నారనే దానికి ప్రభుత్వం చెప్తున్న కారణం చాలా ఆసక్తికరంగా ఉంది. అమెరికా హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్‌లోని ‘HealthCare.gov’ పోర్టల్ నిర్వహణ కోసం ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ప్రభుత్వం కొన్ని ఫీజులు వసూలు చేసింది. ఆ కంపెనీలు ఊరికే ఉంటాయా? ఆ భారమంతా తిప్పి తిప్పి వినియోగదారుల ప్రీమియంలపైనే వేసేశాయి. అయితే, పోర్టల్ నిర్వహణకు కావలసినదాని కంటే ఎక్కువ మొత్తంలోనే ఫీజులు వసూలయ్యాయని, ఆ అదనపు సొమ్మును ఇప్పుడు అర్హులైన అమెరికన్లకే తిరిగి ఇచ్చేస్తున్నామని వైట్ హౌస్ చెప్తోంది. మీ నుంచి అదనంగా తీసుకున్న డబ్బును మీకే గౌరవంగా వాపస్ ఇస్తున్నామంటూ ట్రంప్ తన లేఖలో ప్రాసలు కూడా జోడించారు!
ప్రజలందరికీ ఎందుకు రావడం లేదు?
ఈ డబ్బులు అమెరికాలోని ప్రజలందరికీ రావడం లేదు! కేవలం కొన్ని నిర్దిష్ట రాష్ట్రాల్లో ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్ దక్కుతోంది. కేవలం 30 రాష్ట్రాల ప్రజలకు మాత్రమే ఈ 500 డాలర్లు దక్కుతాయి. దానికి కారణం.. ఈ 30 రాష్ట్రాలు తమ సొంత హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్ఛేంజ్లను నడపకుండా, ఫెడరల్ ప్రభుత్వం నిర్వహించే వ్యవస్థపైనే ఆధారపడుతున్నాయి. అందుకే అక్కడ వసూలైన ఫీజులను ఆ రాష్ట్రాల ప్రజలకే రీఫండ్ చేస్తున్నారు. అలబామా, అలాస్కా, అరిజోనా, అర్కాన్సాస్, డెలావేర్, ఫ్లోరిడా, హవాయి, ఇండియానా, అయోవా, కాన్సాస్, లూసియానా, మిషిగన్, మిసిసిప్పి, మిస్సోరి, మోంటానా, నెబ్రాస్కా, న్యూ హాంప్‌షైర్, నార్త్ కరోలినా, నార్త్ డకోటా, ఒహాయో, ఓక్లహోమా, ఒరెగాన్, సౌత్ కరోలినా, సౌత్ డకోటా, టెన్నెస్సీ, టెక్సాస్, ఉటా, వెస్ట్ వర్జీనియా, విస్కాన్సిన్, వైయోమింగ్ రాష్ట్రాల ప్రజలకు మాత్రమే ఈ అవకాశం ఉంది.
మిగిలిన 20 రాష్ట్రాల ప్రజలకు మాత్రం ఖాళీ హ్యాండే! ఎందుకంటే ఆ రాష్ట్రాలు తమ సొంత హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టళ్లను వాళ్లే నడుపుకుంటున్నాయి. అక్కడ ఫెడరల్ ప్రభుత్వం ఎలాంటి యూజర్ ఫీజులు వసూలు చేయలేదు కాబట్టి, వాళ్లకు ఎలాంటి రీఫండ్లూ రావడం లేదు.
ఎవరికి వస్తుంది.. టైమింగ్ వెనుక మతలబేంటి?
ఈ డబ్బులు అందరి జేబుల్లోకి వెళ్లవు. ఫెడరల్ పేదరిక రేఖకు 400 శాతం లోపు రాబడి ఉన్న మధ్యతరగతి, అల్పఆదాయ వర్గాలకే ఇది అందుతుంది. అంటే వ్యక్తిగతంగా చూస్తే ఏడాదికి సుమారు 64,000 డాలర్లు, లేదా నలుగురు ఉన్న కుటుంబానికైతే 1,32,000 డాలర్ల లోపు ఆదాయం ఉన్నవారికే ఈ చెక్కులు అందుతాయి.
అయితే, ఈ చెక్కులు బయలుదేరిన టైమింగే ఇప్పుడు అమెరికా రాజకీయంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికలకు సరిగ్గా ఐదు వారాల ముందు ఈ డబ్బులు పంపడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలు, భారీగా మారిన మెడికల్ ఖర్చులతో ఇబ్బందిపడుతున్న ఓటర్లను బుజ్జగించేందుకే ట్రంప్ సర్కార్ ఈ మాస్టర్ ప్లాన్ వేసిందనే విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు, 2025 చివర్లో ముగిసిన ఇన్సూరెన్స్ సబ్సిడీలను పెంచకపోవడంతో, 2026 ప్రారంభం నుంచి అమెరికన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఒకవైపు ప్రీమియం భారం పెంచేసి, మరోవైపు ఇలా పాత డబ్బులో కొంత రీఫండ్ ఇస్తూ ట్రంప్ లేఖలు పంపడం రాజకీయ స్టంట్ తప్ప మరొకటి కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి ఇది ఉచిత బోనస్ ఏమీ కాదు, గతంలో మీ దగ్గర నుంచి పిండేసిన డబ్బులో కొంత తిరిగిస్తూ, ఎన్నికల వేళ పంపించిన ఒక ‘చెక్ పాఠం’ మాత్రమే అక్కడ మీడియా అంటోంది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








