సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
భవిష్యత్ అవసరాలకై సమగ్ర నీటి ప్రణాళిక
పక్కాగా ఇరిగేషన్ క్యాలెండర్ అమలు
విశాఖ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలు
-సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, సెప్టెంబర్ 30 :- వివిధ రంగాలకు నీటి భద్రతే లక్ష్యంగా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయంలో బుధవారం జలవనరుల శాఖపై సీఎం సమీక్షించారు. రాష్ట్రానికి అవసరమైన సమగ్ర నీటి ప్రణాళికను రూపొందించాలంటూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… అన్ని రంగాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికను రూపొందించాలన్నారు. తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సమగ్ర ప్రణాళిక ఉండాలన్నారు. ఈ ప్రణాళికలో భాగంగా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలుకుని… పంట కాల్వల వరకూ పూర్తి స్థాయి ప్లాన్ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇదే సందర్భంలో ఎత్తిపోతల పథకాలు, మైక్రో ఇరిగేషన్, హైడల్ విద్యుత్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. విశాఖ నగర వాసుల తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా తాగునీటి సరఫరా కెనాల్ మీదుగా కణితి బాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు నీటిని నిరంతరాయంగా పంపే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అలాగే జలశయాల నుంచి విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని ప్రాంతాలకు క్రమం తప్పకుండా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
పోలవరానికి పర్యాటక హంగులు
ఇరిగేషన్ క్యాలెండర్లో పొందుపరిచిన ప్రాధాన్యతా ప్రాజెక్టుల కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. క్యాలెండరులో నిర్దేశించుకున్న విధంగా ప్రాజెక్టు పనులను చేపట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ఆర్ అండ్ ఆర్, భూసేకరణ పురోగతిపై సీఎం ఆరా తీస్తూ.. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రాజెక్ట్ పనులన్నీ పూర్తి కావాలని, ఎక్కడా ఆర్థికపరమైన లేదా ఇతర ఇబ్బందులు రాకూడదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. పోలవరం ప్రాజెక్టును పర్యాటకంగానూ అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. పోలవరం ఎడమ కాల్వ ద్వారా వచ్చే నీటితో వీలైనంత మేరకు అనకాపల్లి జిల్లాలోని రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపాలన్నారు. జల సంరక్షణనూ ప్రజా ఉద్యమంగా మలచాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం… వాటి వల్ల కలిగే ప్రయోజనాలు… నీటి ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సామాజిక మాద్యమాలను వినియోగించుకోవాలని సూచించారు. జలధార-జలహారతి వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, భూగర్భ జలాల పెంపుతో కలిగే లాభాలను వివరించి ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, ఆర్థిక శాఖ, జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








