రేవంత్‌పై కేటీఆర్ ఎదురుదాడి!
తెలంగాణలో మాటల యుద్ధం వేడెక్కింది. సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఘాటుగా విరుచుకుపడ్డారు. సీఎం వ్యాఖ్యలను తిప్పికొడుతూనే.. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలు, రైతు సమస్యలు, చేనేత కార్మికుల సంక్షోభం, పెండింగ్ విచారణలను తెరపైకి తెచ్చి రాజకీయంగా కార్నర్ చేసే ప్రయత్నం చేశారు.
“మోసపోకండి.. మోసపోతే గోస పడతాం” అని కేసీఆర్ ఆనాడే ప్రజలను హెచ్చరించారని, అయితే ఆ మాటలను వినకపోవడం వల్లే రాష్ట్రాన్ని గోస పెట్టిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి కూర్చుందని కేటీఆర్ విమర్శించారు. “పాత రాజ్యాన్ని మళ్లీ తీసుకువస్తా” అని చెప్పిన రేవంత్ రెడ్డి, చెప్పినట్లే పాత అరాచక పాలనను తెచ్చారని, అందుకే ఆయనను ‘నిజాయితీ గల మోసగాడు’ అనక తప్పదని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల పర్యటన సందర్భంగా సీఎం వ్యవహరించిన తీరును కేటీఆర్ తూర్పారబట్టారు. “శత్రు దేశం మీద దాడికి పోయినట్లుగా నాలుగు వేల మంది పోలీసులతో సిరిసిల్లకు దండయాత్రలా వెళ్లారు. సీఎం వెళ్తున్నప్పుడు ముందు ప్రజలెవరూ లేకపోయినా చేతులు ఊపుకుంటూ వెళ్లడం హాస్యాస్పదం” అని చురకలంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిరిసిల్లలో 35 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుని చనిపోతే, కనీసం వారి గురించి సీఎం ఒక్క మాటా మాట్లాడకపోవడం దారుణమన్నారు. బాధిత కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలిందని మండిపడ్డారు.
తనపై రేవంత్ రెడ్డి చేసిన హోటల్ వ్యాపార ఆరోపణలను కేటీఆర్ కొట్టిపారేశారు. “నేను ఆల్తూ ఫాల్తూ గాన్ని కాదు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాను. మా నాన్న కేసీఆర్ 1983లో ఎన్టీఆర్ ఆశీర్వాదంతో పోటీ చేసి, 1985లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. నేను 2006లోనే హోటల్ వ్యాపారం ప్రారంభించాను. ఇప్పుడు అది మూడు హోటళ్లు అయింది. ఈ వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్లోనే స్పష్టంగా వెల్లడించాను. చట్టబద్ధంగా వ్యాపారం చేసుకోవడం తప్పా? రాజకీయాలు పక్కన పెట్టి పూర్తిస్థాయిలో వ్యాపారం చేసి ఉంటే కనీసం పది హోటళ్లు పెట్టేవాడిని. రేవంత్ రెడ్డి అనవసరంగా మాట్లాడి నా హోటళ్లకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు” అని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో రేవంత్ రెడ్డి కుటుంబంపై ఎదురుదాడి చేస్తూ, తొమ్మిదో తరగతి ఫెయిల్ అయిన తమ్ముడు ఏరోస్పేస్ కంపెనీ ఎలా పెట్టాడని ప్రశ్నించారు. “అమెరికాలో ఎవరి పనులు వారే చేసుకుంటారు, ఎవరి చిప్పలు వారే కడుగుతారు.. మరి అమెరికాలో ఉన్న మీ తమ్ముడు కూడా చిప్పలు కడుగుతున్నాడా?” అని నిలదీశారు. తన తాతల కాలం నుంచి ఇప్పటివరకు ఉన్న ఆస్తులపై విచారణకు తాను సిద్ధమని, సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాసి సీఎం రేవంత్ ఆస్తులతో పాటు తన ఆస్తులపైనా విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. తప్పు జరిగినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని భవనాలన్నీ కేటీఆర్‌వేనని, ఫార్ములా-ఈ రేసింగ్ కేసు, ఫోన్ ట్యాపింగ్, సినీ నటుల ఫోన్లు ట్యాప్ చేశారని మూడేళ్లుగా ఆరోపణలు గుప్పిస్తున్న ప్రభుత్వం.. ఇప్పటివరకు ఏం తేల్చిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. “ప్రభుత్వంలో ఉండి మూడేళ్లు కావస్తున్నా ఆరోపణలు నిరూపించలేకపోయారు. ప్రజల తరఫున నిలదీస్తున్నందుకే రేవంత్‌కు కోపం వస్తోంది. నువ్వు నన్ను గోకినా గోకకపోయినా, నేను ప్రజల పక్షాన నిన్ను గోకుతూనే ఉంటా” అని హెచ్చరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితులు దారుణంగా ఉన్నందునే రాహుల్ గాంధీ తెలంగాణ వైపు చూసే ధైర్యం చేయట్లేదని, ఇక్కడికి వస్తే ప్రజలు నిలదీస్తారని అన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ ఖతమవుతుందని, గతంలో టీడీపీని తెలంగాణలో లేకుండా చేసినట్లే, ఇప్పుడు కాంగ్రెస్‌ను కూడా మరో పాతికేళ్లపాటు కోలుకోకుండా తుడిచిపెట్టేస్తారని కేటీఆర్ రాజకీయ జోస్యం చెప్పారు. మొత్తంగా సిరిసిల్ల సభ ద్వారా సీఎం రేవంత్ విసిరిన బాణాలను, అదే తీవ్రతతో ఎదురుతిప్పి కాంగ్రెస్ వైఫల్యాలపై దాడి చేయడంలో కేటీఆర్ దూకుడు ప్రదర్శించారు.








