బీఆర్ఎస్తో పొత్తు.., సీఎం దేవుళ్ల వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్!
రాష్ట్రంలో నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు, బీజేపీతో పొత్త ఉండదన్న కేటీఆర్ కామెంట్స్ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డి, కేటీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికపైన కూడా కిషన్ రెడ్డి స్పందించారు.
రాముడు వేరు, శివుడు వేరు అంటూ ఓ కాంక్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది బాధ్యతారాహిత్యమేనన్నారు. సనాతన ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ అలవాటేనని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం, రాహుల్ గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి దేవుళ్ల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. హిందువుల్లో సహనం ఎక్కువ కాబట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఇతర మతాల దేవుళ్లపై మాట్లాడే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని ఆయన నిలదీశారు.
ఇవి కూడా చదవండి
ఇక.. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందంటూ వస్తున్న ఊహాగానాలపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ తో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోబోదని స్పష్టం చేశారు. పొత్తు ఉంటుందని తాము ఎప్పుడైనా చెప్పామా అని ప్రశ్నించిన ఆయన, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. బుధవారం కొచ్చిలో జరిగిన ఓ కాంక్లేవ్ లో బీజేపీతో పొత్త ఉండబోదని కేటీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. పైగా.. బీఆర్ఎస్, బీజేపీల మధ్య తెరవెనుక అవగాహన ఉందనే ప్రచారానికి కిషన్ రెడ్డి పూర్తిస్థాయిలో చెక్ పెట్టినట్లయింది.
ఇక.. పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును కిషన్ రెడ్డి స్వాగతించారు. ఈ తీర్పు ఫిరాయింపుదారులందరికీ చెంపపెట్టు లాంటిదని అభివర్ణించారు. కేసీఆర్, వైఎస్సార్, రేవంత్ రెడ్డి లాంటి నాయకులు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేశారని, దానం నాగేందర్ కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారని గుర్తుచేశారు. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం పూర్తిగా బీజేపీదేనని, త్వరలో జరగబోయే ఉపఎన్నికలో ప్రజలంతా బీజేపీ వైపే నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మొత్తానికి.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అస్త్రంగా మలుచుకుని హిందూత్వ అజెండాను ముందుకు తీసుకువెళ్తూనే, పొత్తులపై వస్తున్న వదంతులకు తెరదించడం ద్వారా బీజేపీ తన రాజకీయ వైఖరిని మరింత స్పష్టం చేసింది.








