చిన్న జ్ఞాపకం వెనుక పెద్ద మిస్టరీ!: ‘Forgotten Island’ రివ్యూ
రేటింగ్: 2.5.5/5
ఈ కథ 1990ల నాటి ఫిలిప్పీన్స్‌లో మొదలవుతుంది. జో, రైస్సా అనే ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. జో చాలా ఊహాశక్తి ఉన్న అమ్మాయి, తన అమ్మమ్మ లోలా ఫాతిమా చెప్పే ఫిలిప్పీన్స్ జానపద కథలను ఎంతో ఆసక్తిగా వింటూ, వాటిని స్కూల్లో మిగతా పిల్లలకు చెబుతుంటుంది. అలా చెప్పే కథల్లోనే ‘నకాలి’ అనే ఒక మాయా ద్వీపం గురించి, అక్కడ తిరిగే ‘మకాలి’ అనే భయంకరమైన రాక్షసి గురించి ప్రస్తావిస్తుంది. అయితే క్లాస్‌లోని మిగతా పిల్లలు జో కథలను ఎగతాళి చేస్తుంటే, రైస్సా మాత్రం ఆమెకు తోడుగా నిలుస్తుంది. రైస్సా స్వభావం జోకు పూర్తిగా విరుద్ధం. ఆమె సైన్స్, చదువు, భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రాక్టికల్ అమ్మాయి. ఇలా వేర్వేరు మనస్తత్వాలు ఉన్నప్పటికీ, అదే వారి బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతూ తమ జీవితంలో జరిగిన ప్రతి ముఖ్యమైన ఘట్టానికి గుర్తుగా ఒకే రకమైన చార్మ్ బ్రేస్లెట్లను ధరిస్తారు.
కానీ కాలేజీ రోజులు వచ్చేసరికి పరిస్థితి మారుతుంది. రైస్సాకు అమెరికాలోని ప్రతిష్టాత్మక కాల్టెక్ (Caltech) కాలేజీలో సీటు రావడంతో ఆమె విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ దూరమైపోతుందేమోనన్న భయం జోను వెంటాడుతుంటే, జీవితంలో ముందుకు వెళ్లడం సహజమే కదా అని రైస్సా భావిస్తుంది. అలా రైస్సా వెళ్లిపోయే చివరి రాత్రి, ఇద్దరూ కలిసి బీచ్‌లో సమయం గడుపుతుండగా ఒక విచిత్రమైన ‘శాండ్ డాలర్’ దొరుకుతుంది. అది సాధారణ వస్తువు కాదు. అమ్మమ్మ చెప్పిన కథల్లోని మాయా ద్వీపానికి మార్గం సుగమం చేసే పోర్టల్! దెబ్బకు ఇద్దరూ ఆ ‘నకాలి’ ద్వీపంలోకి కొట్టుకుపోతారు.
కానీ తీరా అక్కడికి వెళ్లాక అసలు చిక్కు వచ్చిపడుతుంది. వాళ్లకు గత జ్ఞాపకాలేవీ గుర్తుండవు! తమ పేరు ఏంటి, అక్కడికి ఎలా వచ్చారో కూడా మరచిపోతారు. అంతేకాదు, రైస్సా తలలో సగం జుట్టు మాయమై భుజాల నుంచి రెక్కలు వస్తే, జో ఒంటిపై వింత గుర్తులు కనిపిస్తాయి. అసలు తమ జ్ఞాపకాలను ఎవరు దొంగిలించారు? తిరిగి సొంత ఇంటికి వెళ్లాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ఆ ద్వీపంలో వాళ్ల సాహస యాత్ర మొదలవుతుంది.చివరకు ఆ ఎడ్వెంచర్ ఎలా ముగిసింది.చివరకు ఏమైంది అనేది మిగతా సినిమా.
ఎనాలిసిస్…
సాధారణంగా యానిమేషన్ సినిమాలంటే మనకి వెంటనే ఏం గుర్తొస్తాయి? పిల్లల కోసం వేసే రంగురంగుల బొమ్మలు, నవ్వించే కామెడీ పాత్రలు, ఓ చిన్న సరదా సాహసం! కానీ డ్రీమ్‌వర్క్స్ నుంచి వచ్చిన ‘Forgotten Island’ మాత్రం ఆ పాత ఫార్ములాను దాటుకుని కాస్త పెద్ద కథ చెప్పే ప్రయత్నం చేసింది. చిన్నప్పటి స్నేహం, వయసొచ్చే కొద్దీ మారే అనుబంధాలు, ఒకరికొకరు దూరం కావడం, మన జీవితంలో జ్ఞాపకాల విలువ.. వీటన్నింటినీ ఫిలిప్పీన్స్ జానపద కథలతోనూ, ఫాంటసీ అడ్వెంచర్తోనూ ముడిపెట్టి చాలా కొత్తగా ఆవిష్కరించారు. గతంలో ‘Puss in Boots: The Last Wish’ లాంటి సూపర్‌హిట్ చిత్రంతో మెప్పించిన జోయెల్ క్రాఫోర్డ్, జాన్యుయెల్ మెర్కాడోలు కలిసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈసారి కూడా విజువల్స్‌లో రకరకాల ప్రయోగాలు చేస్తూనే, ఒక బలమైన ఎమోషనల్ కథను మనముందుకు తెచ్చారు. అయితే విజువల్స్ పరంగా సినిమా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో, కొన్ని చోట్ల ఒకేసారి చాలా విషయాలు చూపించేయడం వల్ల కాస్త హడావుడిగా కూడా అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
విజువల్స్ అద్భుతం.. కానీ కాస్త హడావుడి ఎక్కువైందా?
సాంకేతికంగా ఈ సినిమా ఒక అద్భుతమైన విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. 3D యానిమేషన్‌తో పాటు జపాన్ అనిమే (Anime) శైలి, 2D ఎక్స్ప్రెషన్లు, కలర్‌ఫుల్ టెక్స్చర్లను కలిపి మిక్స్డ్ మీడియా ఆర్ట్‌లా చాలా క్రియేటివ్‌గా తీర్చిదిద్దారు. స్టుడియో గిబ్లి, డిస్నీ ఫాంటసియా వంటి దిగ్గజాల ప్రభావం ప్రతి ఫ్రేమ్‌లోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే, ఈ విజువల్ వెరైటీనే కొన్నిసార్లు సినిమాకు చిన్న మైనస్‌గా కూడా మారుతుంది.
దర్శకులు ఒకేసారి చాలా ఎక్కువ ఆలోచనలు, బోలెడన్ని పాత్రలు, వేగవంతమైన సన్నివేశాలను స్క్రీన్ మీదకు తోసేయడంతో, మొదటి సగంలో కథలోని ఎమోషన్‌ను సరిగ్గా ఆస్వాదించే వ్యవధి పాఠకుడికి లేదా ప్రేక్షకుడికి దొరకదు. ఎనర్జీ డ్రింక్స్ వరుసగా తాగితే ఎలాంటి కిక్ వస్తుందో, ఆ స్పీడ్ వల్ల కాస్త అలసట కూడా అంతే స్థాయిలో వస్తుంది. అయితే సెకండాఫ్‌కి వచ్చేసరికి మాత్రం కథ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చి, క్లైమాక్స్ లో ఎమోషనల్‌గా గట్టిగా తాకుతుంది. నకాలి ప్రపంచం.. చిత్రవిచిత్రమైన రాక్షసులు!
మరీ ముఖ్యంగా..
నకాలి ద్వీపంలోకి అడుగుపెట్టాక సినిమా మనల్ని ఒక వింతైన ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. హాలీవుడ్ సినిమాల్లో సాధారణంగా కనిపించే యూరోపియన్ దెయ్యాలు, గ్రీకు పురాణ పాత్రలకు భిన్నంగా, ఇందులో పూర్తిగా ఫిలిప్పీన్స్ జానపద సంస్కృతికి చెందిన జీవులు కనిపిస్తాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘రా’ అనే విచిత్రమైన వెర్డాగ్ (Weredog) పాత్ర గురించి! మనిషిగా, కుక్కగా తన రూపాన్ని మార్చుకుంటూ ఉండే ఈ పాత్ర సినిమాకు మంచి కామెడీ ఎనర్జీని ఇస్తుంది.
దీంతో పాటు ఇతరుల జ్ఞాపకాలతో ముడిపడిన వస్తువులను పోగుచేసే ‘బతిబా’, తన తల్లిని విడిచి బయటకు రాలేని ‘బుంగి’ అనే భారీ బేబీ డెమన్, తమ సొంత బాధలతో బతుకుతున్న రకరకాల జీవులు ఇక్కడ పరిచయమవుతాయి. ఇక ఈ కథలోని ప్రధాన ప్రతి నాయకి ‘మకాలి’ (Manananggal) – నడుము పైభాగం విడిపోయి ఎగిరే భయంకరమైన రాక్షసి. అయితే ఆమె కూడా కేవలం విలన్లా మాత్రమే కాకుండా, ఆమె వెనుక కూడా ఒక విషాదకరమైన గతం ఉందనేలా చూపించడం కథలోని డెప్త్ ను పెంచుతుంది. ఫైనల్ గా…పిల్లల అడ్వెంచర్ డ్రామాగా మాత్రమే కాకుండా, పెద్దల మనసులను కూడా పిండేసే ఒక ఎమోషనల్ రైడ్‌గా మారుతుంది.
చివరిగా చెప్పేదేంటంటే..
‘Forgotten Island’ అనేది ఒక పర్ఫెక్ట్ సినిమా కాకపోవచ్చు కానీ, దానికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది కేవలం పిల్లలను అలరించే మామూలు కార్టూన్ సినిమా కాదు; మనం పెద్దవాళ్లమయ్యే క్రమంలో మనకు తెలియకుండానే కోల్పోయే బాల్యాన్ని, ఆ బాల్యంలో మనతో నడిచిన మనుషులను గుర్తుచేసే ఒక చక్కని ప్రయాణం.
వయసుతో పాటు పరిస్థితులు మారి స్నేహితులు దూరమైనా, మన మనసుల్లో వాళ్లు మిగిల్చిన ఆ బంధం ఎప్పటికీ చెరిగిపోదనే నిజాన్ని ఈ ఫాంటసీ కథ ద్వారా చాలా అందంగా చెప్పారు.
కొన్ని చోట్ల సీన్లు కాస్త హడావుడిగా అనిపించినా, విజువల్స్ అద్భుతంగా ఉన్నందున కుటుంబంతో కలిసి చూడటానికి ఇది ఒక మంచి ఆప్షన్. ఈ సినిమా చూశాక మీకు కూడా మీ చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్ ఒకసారి గుర్తుకొస్తే.. అదే ఈ చిత్రం సాధించిన అసలైన విజయం!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








