ఖైరతాబాద్ ఉపఎన్నిక జరపొద్దు.. కోర్టులో పిటిషన్లు
ఖైరతాబాద్ ఉపఎన్నిక అనూహ్యమైన మలుపు తిరిగింది. ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరపొద్దంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. అనర్హత వేటుకు గురైన దానం నాగేందర్, గత ఎన్నికల్లో పోటీ చేసిన విజయా రెడ్డి ఈ పిటిషన్లను దాఖలు చేసారు. దీంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుందా.. జరగదా.. అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఖైరతాబాద్ ఉపఎన్నికను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన అనర్హత పిటిషన్‌కు సంబంధించిన కొన్ని అంశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, హడావుడిగా ఎన్నికలు నిర్వహించడం సరికాదని ఆయన తన పిటిషన్లో వాదించారు.
ఇవి కూడా చదవండి
మరోవైపు, గతంలో తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉండగానే ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక ఎలా నిర్వహిస్తారంటూ పీజేఆర్ కూతురు పి. విజయారెడ్డి కూడా హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఎలక్షన్ కమిషన్‌తో పాటు దానం నాగేందర్‌ను ఈ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. గత ఎన్నికల్లో తన ఓటమికి దారితీసిన అంశాలపై దాఖలైన పిటిషన్ తేలకుండా, మళ్లీ అదే స్థానానికి ఉపఎన్నిక నిర్వహిస్తూ ఉండడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒకవైపు ఉపఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని, ప్రత్యర్థులకు మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేసిన దానం నాగేందర్, ఇప్పుడు ఎన్నికలను ఆపాలని కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నిక జరిగితే.. ఓటర్ల నాడి తమకు అనుకూలంగా లేదనే భయమే దానం నాగేందర్ లంచ్ మోషన్ పిటిషన్ కు కారణమై ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇవాళే ఈ లంచ్ మోషన్లపై హైకోర్టు విచారణ జరపనుంది. హైకోర్టు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.








