కేసీఆర్ ఫాంహౌస్ భూ సర్వే పూర్తి.. నివేదికపై ఉత్కంఠ!
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ భూముల అంశం కేంద్రబిందువుగా మారింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, వెలికట్ట గ్రామాల పరిధిలో కేసీఆర్ ఫాంహౌస్ను ఆనుకుని ఉన్న భూముల సర్వే ప్రక్రియ పూర్తికావడం చర్చనీయాంశమైంది. రెవెన్యూ, సర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సమగ్ర సర్వే నివేదిక సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతికి చేరింది. దీంతో.. ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
కేసీఆర్ ఫాంహౌస్ లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయని.. వాటిపై 30 రోజుల్లోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆదేశించారు. మర్కూక్ మండల పరిధిలోని భూముల లెక్కలు తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపధ్యంలో రెవెన్యూ యంత్రాంగం కదిలింది. ఎర్రవల్లి సర్వే నంబర్ 325 పరిధిలోని సుమారు 388 ఎకరాలు, వెలికట్ట సర్వే నంబర్ 271 భూములపై అధికారులు సర్వే నిర్వహించారు. శాటిలైట్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సర్వే వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి హద్దులను నిర్ధారించారు. ఈ సర్వేలో భాగంగా ఎర్రవల్లిలో 244 మందికి, వెలికట్టలో 118 మందికి పైగా నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
ఈ సర్వే రాజకీయంగానే కాకుండా స్థానికంగానూ అనేక మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా శివారు వెంకటాపూర్ గ్రామస్థులు అధికారుల ముందుకొచ్చారు. తమ గ్రామానికి చెందిన సుమారు 180 ఎకరాల భూములు ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో కలిసిపోయాయని, పాత రికార్డుల ఆధారంగా న్యాయం చేయాలని వారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు, దశాబ్దాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్న చిన్న సన్నకారు రైతులు తమ పట్టా పాస్బుక్కులు చూపించినప్పటికీ, ప్రభుత్వ తాజా నిర్ణయాలు తమను ఏ విధంగా ప్రభావితం చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
పదేళ్లపాటు సీఎంగా ఉన్న కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ ఉన్న భూముల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూములు అన్యక్రాంతమయ్యాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒకవేళ ఈ సర్వే నివేదికలో భూ ఆక్రమణలు జరిగినట్లు లేదా నిబంధనలకు విరుద్ధంగా భూ బదలాయింపులు జరిగినట్లు తేలితే, అది కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ను ఇరుకున పెట్టే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ దీనిని రాజకీయ అస్త్రంగా మలుచుకుంటుంది. అయితే రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ సర్వే చేపట్టారని గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి.
కలెక్టర్ అందజేయనున్న ఈ తుది నివేదికను ప్రభుత్వం పరిశీలించి ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మరో మలుపు తిరిగే అవకాశముంది.








