హైదరాబాద్‌లో అమెరికా సంస్థ డోర్ డాష్ ప్రారంభం
అమెరికాకు చెందిన డోర్ డాష్ (DoorDash) సంస్థ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ హైదరాబాద్‌లో కొత్తగా గ్లోబల్ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించింది. ఈ కొత్త కేంద్రం ద్వారా వచ్చే రెండేళ్లలో భారతదేశంలో సుమారు 3,000 ఉద్యోగాలను సృష్టించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో హైదరాబాద్ (Hyderabad)లో టెక్నాలజీ, కస్టమర్ సపోర్ట్, డేటా, అనలిటిక్స్ వంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
కొత్తగా ప్రారంభించిన టెక్నాలజీ హబ్‌లో తొలిదశలో కస్టమర్ సపోర్ట్‌తో పాటు జనరల్, అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాలకు సంబంధించిన బృందాలు పనిచేయనున్నాయి. కంపెనీ కార్యకలాపాలు విస్తరించే కొద్దీ మరిన్ని విభాగాలను కూడా ఈ కేంద్రంలోకి తీసుకురావచ్చని తెలుస్తోంది. అంటే కేవలం సాంకేతిక ఉద్యోగాలకే పరిమితం కాకుండా, వివిధ విభాగాల్లో నిపుణులకు అవకాశాలు లభించే అవకాశం ఉంది. పూణే (Pune) తర్వాత భారత్‌లో డోర్డాష్కు ఇది రెండో టెక్ ఆఫీస్ కేంద్రంగా నిలవనుంది.
2021లో డోర్‌డాష్ రోబోటిక్స్ స్టార్టప్ చౌబోటిక్స్ను కొనుగోలు చేసింది. ఆ ఒప్పందం ద్వారా సాఫ్ట్వేర్, డేటా, అనలిటిక్స్ కార్యకలాపాలకు సంబంధించిన సామర్థ్యాలను కంపెనీ పొందింది. ఈ విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలను కూడా భారతదేశంలోని తన టెక్ ఆపరేషన్స్‌లో ఉపయోగించుకుంటోంది.
హైటెక్ సిటీలో సంస్థ కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Sridhar Babu) ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 500 జీసీసీలున్నాయి. మరో 100 దాకా ఏర్పాటు చేసి, లక్షకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 3 లక్షలకు పైగా పరోక్ష ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డోర్ డాష్ సీఎఫ్‌వో రవి ఇనుకొండ (Ravi Inukonda), వర్క్‌ఫోర్స్ స్ట్రాటజీ అండ్ టాలెంట్ ఎక్విజిషన్ ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ జెన్నా కోహ్నె కె. ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ పాల్గొన్నారు.








