అమెరికాలో 2.5 లక్షలకు పైగా వీసాలు రద్దు.. టార్గెట్ ఎవరు?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
అమెరికా వీసా ఉంటే ఇక ధీమాగా ఉండొచ్చనుకుంటే పప్పులో కాలేసినట్లే! డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ దేశ ఇమ్మిగ్రేషన్ విభాగం సంచలన నిర్ణయాలతో విరుచుకుపడుతోంది. నిబంధనలు అతిక్రమించినా, తప్పుడు వివరాలు ఇచ్చినా ఏమాత్రం ఉపేక్షించకుండా ఏకంగా 2.5 లక్షలకు పైగా వీసాలను రద్దు చేసి షాక్ ఇచ్చింది. వీసా ఇచ్చేశాం కదా అని వదిలేయకుండా, విదేశీయుల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించే ‘కంటిన్యూయస్ వెట్టింగ్’ విధానాన్ని అమలు చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
బర్త్ టూరిజంపై ఉక్కుపాదం
రద్దైన మొత్తం వీసాల్లో దాదాపు 2,300 వీసాలు ‘బర్త్ టూరిజం’కు సంబంధించినవే కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అమెరికాకు వెళ్లి అక్కడ బిడ్డకు జన్మనిస్తే, పుట్టుకతోనే ఆ పాపాయికి అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది. సరిగ్గా ఈ పాయింట్‌ను ఆసరాగా చేసుకుని చాలామంది టూరిస్ట్ వీసాలపై అమెరికా వెళ్లి ప్రసవాలు చేయించుకుంటున్నారు. ఈ అడ్డదోవకు చెక్ పెట్టేందుకు 2026 ఆగస్టులో అమెరికా విదేశాంగ శాఖ ప్రత్యేకంగా ‘టాస్క్ ఫోర్స్ టు ఎండ్ బర్త్ టూరిజం’ను రంగంలోకి దింపింది. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీతో కలిపి పనిచేస్తున్న ఈ టాస్క్‌ఫోర్స్, విజిటర్ వీసా దరఖాస్తుదారుల అసలు ఉద్దేశం ప్రసవమే అని తేలితే వెంటనే దరఖాస్తును తిరస్కరిస్తోంది.
క్రిమినల్ చర్యలు, ఇమ్మిగ్రేషన్ దుర్వినియోగంపై పోటు
కేవలం బర్త్ టూరిజం మాత్రమే కాకుండా వీసా నిబంధనలు ఉల్లంఘించడం, నేర కార్యకలాపాల్లో పాల్గొనడం, తప్పుడు పత్రాలు సమర్పించడం, జాతీయ భద్రతకు భంగం కలిగించడం వంటి తీవ్రమైన కారణాలతో లతో లక్షలాది మంది వీసాలను రద్దు చేశారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ తనిఖీలు ఏ ఒక్క దేశానికో లేదా ఒకే రకం వీసాకో పరిమితం కాకుండా అందరికీ వర్తిస్తున్నాయి. అంటే వీసా చేతికి వచ్చినా, ప్రవర్తన బాగుంటేనే అమెరికాలో నిలబడగలరనే స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది ట్రంప్ సర్కార్.
ఆశ్రయం కోరేవారిపై త్వరలోనే మరో విరుచుకుపాటు
ఇది ఇక్కడితోనే ఆగడం లేదు. బిజినెస్ లేదా టూరిస్ట్ వీసాల (B1, B2) మీద అమెరికాలో అడుగుపెట్టి, ఆ తర్వాత అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి ‘ఆశ్రయం’ (Asylum) కోసం దరఖాస్తు చేసుకునే వారిపైనా ప్రభుత్వం నిఘా పెట్టింది. ఈ కేటగిరీలో దాదాపు రెండు లక్షల మంది వరకు ఉన్నట్లు సమాచారం అందుతుండగా, వారిపై కూడా త్వరలోనే ఊహించని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మారిన నిబంధనలతో ప్రయాణికులకు హెచ్చరిక
మొత్తానికి అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానం ‘ఒక్కసారి వీసా వస్తే జీవితాంతం సేఫ్’ అనే పాత పద్ధతి నుంచి ‘ఎల్లవేళలా పరిశీలన’ వైపు వేగంగా మారిపోయింది. టూరిస్ట్, బిజినెస్ లేదా ఇతర నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికా ప్రయాణమయ్యే వారు తమ ప్రయాణ ఉద్దేశాన్ని స్పష్టంగా ఉంచుకోవడమే కాకుండా, నిబంధనలను కచ్చితంగా పాటించడం ఇప్పుడు అత్యంత ఆవశ్యకంగా మారింది.








