రివ్యూ: తమిళ్ నాడు CM విజయ్ తనయుడి తొలి చిత్రం ‘సిగ్మా’ ఎలా వుందంటే..
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2/5
నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్
నటీనటులు: సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్ రాజ్,
మఘలక్ష్మీ సుదర్శనన్, శివ్ పండిట్, శీలా రాజ్‌కుమార్ తదితరులు
సంగీతం : ఎస్ థమన్, సినిమాటోగ్రఫి: కృష్ణన్ వసంత్, ఎఢిటర్: కేఎల్ ప్రవీణ్,
ప్రొడక్షన్ డిజైన్: బెంజమిన్ మిలన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: సంజీవ్ కుమార్ శివ
సహ నిర్మాత: జీకేఎం తమిళ్ కుమారన్
నిర్మాత: ఏ సుభాస్కరన్, దర్శకత్వం: జేసన్ సంజయ్
విడుదల తేది :02.10.2026
నిడివి : 2 ఘంటల 25నిముషాలు
సందీప్ కిషన్(Sandeep Kishan) హీరోగా తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్(Jhason Sanjay)) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్,అడ్వెంచర్, థ్రిల్లర్ సినిమా ‘సిగ్మా’ (SIGMA). లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాను మైత్రి మేకర్స్, ఎన్వీఆర్ సంస్థలు తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ రోజు అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి డైరెక్టర్‌గా తొలి సినిమాతో జాసన్ ఎలా మెప్పించాడు? సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? కథ, కథనాల మాట ఏంటి? ఈ సినిమాని ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం..
కథ :
గురు (సందీప్ కిషన్) తన తండ్రి చేసిన అప్పుల ఊబిలో కూరుకుపోయి, తన తల్లి జ్ఞాపకార్థం ఉన్న లైబ్రరీని కాపాడుకునేందుకు కష్టపడుతుంటాడు. ఆ లైబ్రరీ నుంచే ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న క్రమంలో, వాయిస్ ఓవర్ కోసం ఆర్జే సామ్ (ఫరియా) పరిచయం ఏర్పడుతుంది. ఆపై, అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగి లైబ్రరీని కోల్పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలనే ఆశతో విన్సెంట్ (శివ్ పండిట్) నడిపే గ్యాంబ్లింగ్ అడ్డాకు వెళ్లి గురు తన డబ్బునంతా పోగొట్టుకుంటాడు. ఆర్జే సామ్ తన స్నేహితులతో కలిసి 500 కోట్ల రూపాయలు కొల్లగొట్టాలని ప్లాన్ వేస్తారు. ఈ క్రమంలో వీరయ్య రెడ్డి(సంపత్ రాజ్), విన్సెంట్ అరాచకాలు గురు దృష్టికి రావడమే కాకుండా ఒక కీలకమైన పెన్ డ్రైవ్, కీ దొరుకుతాయి. ఆ కీ కోసం వీరయ్య రెడ్డి. వై (యోగ్ జపీ) వెతుకుతూ ఉంటారు. అసలు పెన్ డ్రైవ్, కీ లో ఏముంది? ఈ మాఫియా నుంచి గురు ఎలా బయటపడ్డాడు? తన లైబ్రరీని తిరిగి ఎలా దక్కించుకున్నాడు? అన్నదే ఈ సిగ్మా సినిమా కథ.
నటీనటుల హావభావాలు :
ఈ సినిమా కథలో ఏముంది అని సందీప్ కిషన్ఒప్పుకొన్నాడు అనేది అంతుపట్టని ప్రశ్న. ఇలాంటి సినిమా కంటే బెటర్ మూవీస్‌తో సందీప్ ఆలరించాడనే విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా సందీప్ కొత్తగా చూపించింది ఏమీ లేదు, అతను చేసింది ఏమిలేదు. అత్యంత నాసిరకమైన పాత్రలో రొటీన్ రెగ్యులర్ క్యారెక్టర్‌తో నిరాశపరిచాడు. ఇక ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం పాత్రలు అంతంత మాత్రమే ఉంటాయి. వీరయ్య రెడ్డి, విన్సెంట్ పాత్రల్లో ఎక్కడా విలనిజం కనిపించకపోగా కామెడీగా అనిపిస్తాయి. ఈ సినిమాలో ఒక్క ఆర్టిస్టు బాగా నటించారని చెప్పడానికి అవకాశం లేకుండా సినిమా వుంటుంది.
సాంకేతిక వర్గం పనితీరు :
విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా సిగ్మా సినిమాతో వస్తున్నాడు. ఆ సినిమాను లైకా ప్రొడ్యూస్ చేస్తున్నారనే విషయాలు ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు పెంచాయి. ఈ అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన చూస్తే భారీ నిరాశే ఎదురైందని చెప్పొచ్చు. జేసన్ సంజయ్ ఎంచుకొన్న కథ, ఆ కథను చెప్పడానికి అనుసరించిన కథనం చాలా పేలవంగా, నాసిరకంగా ఉన్నాయి. లైకా ప్రొడక్షన్ ప్రమాణాలకు ఏ మాత్రం సరిపోని విధంగా ఉండే కథతో చాలా రిస్క్ చేశారనే విషయం సినిమా ఆరంభంలోనే క్లారిటీ వచ్చేసింది. మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రతీ నిమిషం సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. పొంతనలేని స్క్రీన్ ప్లే, క్లారిటీ లేని సన్నివేశాలు, కంటెంట్ లేకుండా సినిమా సాగడంతో ఓ దశలో ఓపిక నశించేలా చేస్తుంది.
విశ్లేషణ:
విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తొలి సినిమా కావడంతో నేరేషన్ పరంగా తడబడ్డాడు. తాను చెప్పాలనుకున్న పాయింట్ అయితే బాగానే ప్రెజెంట్ చేశాడు.కాని, ఉపయోగం లేకుండా పోయింది. మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ పై దృష్టి పెట్టాడు కానీ స్క్రిప్ట్, లాజిక్స్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే సినిమా రేంజ్ మారిపోయేది. ఫస్టాఫ్ అంతా హీరో కష్టాలు, హీరోయిన్ పరిచయం లాంటి సన్నివేశాలతో నెమ్మదిగా సాగుతుంది. పెన్ డ్రైవ్ చుట్టూ తిరిగే ఇంటర్వెల్ బ్యాంగ్ కాస్త ఆసక్తిని రేకెత్తించగా, సెకండాఫ్ లోనే అసలు కథ రివీల్ అవుతుంది. థ్రిల్లర్ కు అవసరమైన సీరియస్ నెస్, వావ్ అనిపించే ట్విస్టులు ఎక్కడా కనిపించవు, క్లైమాక్స్ సీన్స్ ఇంకాస్త పదునుపెట్టి రాసుకొని ఉంటే బాగుండేది.ఇక సినిమా సాగుతున్న కొద్ది ఈ టార్చర్ ఎప్పుడు ముగుస్తుందా? అనే ఫీలింగ్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. స్లైలిష్ యాక్షన్ డ్రామా, మనీ హీస్ట్ పేరుతో రెండున్నర గంటలపాటు చెప్పలేని బాధను అనుభవించాలా? అనే అభిప్రాయం కలుగుతుంది. ఈ సినిమాను రూపొందించడంలో దర్శకుడిగా జేసన్ సంజయ్, నిర్మాతలుగా లైకా పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది ఈ సినిమా.








