విడాకుల్లో కొత్త ట్రెండ్: భారత్‌లో ‘గ్రే డివోర్స్’ పెరుగుతున్నాయా?
ఒక సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అందులో హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకుంటారు. పిల్లలు పుడతారు. వాళ్లను పెంచి పెద్ద చేస్తారు. పిల్లలకు పెళ్లిళ్లు చేసి తమ బాధ్యతలు పూర్తి చేసుకుంటారు. అంతా సుఖాంతమే అనుకుంటున్న సమయంలో కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఇన్నేళ్లూ కలిసి జీవించిన భార్యాభర్తలు విడిపోవాలని నిర్ణయించుకుంటారు!
ఇది కేవలం సినిమా కథ కాదు. ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తున్న ఒక సామాజిక మార్పు. పెళ్లయి పాతికేళ్లు దాటిన తర్వాత, పిల్లలు జీవితాల్లో స్థిరపడిన తర్వాత, కొందరు దంపతులు తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నారు. ఒకప్పుడు విడాకులు అంటే పెళ్లయిన కొత్తలో గొడవలు, మనస్పర్థలు అనే అభిప్రాయం ఉండేది. ఇప్పుడు దశాబ్దాల పాటు కలిసి జీవించిన జంటలు కూడా విడాకుల దిశగా అడుగులు వేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఈ పరిణామానికే ‘గ్రే డివోర్స్’ (Gray Divorce) అని పేరు పెట్టారు. మరి ఇన్నేళ్ల బంధాన్ని తెంచుకోవడానికి కారణమేంటి? ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్ ఎందుకు చర్చనీయాంశమవుతోంది? భారత్‌లోనూ ఇలాంటి మార్పు కనిపిస్తోందా?
గ్రే డివోర్స్ అంటే ఏంటి?
సాధారణంగా 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న దంపతులు విడాకులు తీసుకోవడాన్ని ‘గ్రే డివోర్స్’ అంటారు. అలాగే 20 నుంచి 30 ఏళ్ల పాటు వైవాహిక జీవితం గడిపిన తర్వాత విడిపోవడాన్ని కూడా ఈ పదంతో వివరిస్తారు. వయసు పైబడినప్పుడు జుట్టు నెరిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పేరు వచ్చింది.
ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ జంటలు నిన్నో, మొన్నో పెళ్లి చేసుకున్నవారు కాదు. చాలా సందర్భాల్లో కలిసి పిల్లలను పెంచారు. కుటుంబ బాధ్యతలు పంచుకున్నారు. కష్టసుఖాల్లో తోడుగా ఉన్నారు. కానీ జీవితంలో ఒక దశకు వచ్చేసరికి ఇక కలిసి జీవించలేమని నిర్ణయించుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ట్రెండ్ ఊపందుకుని ఆశ్చర్యపరుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది?
అమెరికాలో గ్రే డివోర్స్‌పై చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 1970 నుంచి 1990 మధ్య 50 ఏళ్లు దాటినవారిలో విడాకుల రేటు కొద్దిగా పెరిగింది. ఆ తర్వాత 2010 నాటికి దాదాపు రెండింతలైంది. 2019 గణాంకాల ప్రకారం, అమెరికాలో విడాకులు తీసుకున్నవారిలో 36 శాతం మంది 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్నవారే.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. అమెరికాలో మొత్తం విడాకుల రేటు తగ్గుతున్నప్పటికీ, 65 ఏళ్లు దాటినవారిలో విడాకుల ధోరణి మాత్రం ప్రత్యేకంగా పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది. అంటే యువతలో విడాకులు తగ్గడం, వృద్ధుల్లో విడాకులు పెరగడం ఒకేసారి జరగవచ్చు.
జపాన్, దక్షిణ కొరియా: పిల్లలు సెటిల్ అయ్యాక విడిపోతున్న జంటలు
జపాన్‌లో 2025లో నమోదైన మొత్తం విడాకుల్లో, 20 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం కలిసి జీవించిన జంటల వాటా 24.2 శాతానికి చేరింది. ఇది అక్కడ రికార్డు స్థాయి. మొత్తం విడాకుల సంఖ్య తగ్గినా, దీర్ఘకాల వైవాహిక బంధాలు ముగిసే వాటా పెరిగింది.
దక్షిణ కొరియాలోనూ ఇదే తరహా పరిణామం కనిపిస్తోంది. 2025లో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న దంపతుల విడాకులు 13,743గా నమోదయ్యాయి.
ఈ దేశాల్లో మహిళలు విడాకుల కోసం ముందుకు రావడం కూడా చర్చనీయాంశమైంది. జపాన్‌లో 2024లో దశాబ్దాల వివాహ జీవితం తర్వాత విడిపోతున్న జంటల్లో భర్తల కంటే దాదాపు రెండింతలు ఎక్కువగా భార్యలు విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి.
యూరప్, చైనా, తైవాన్లోనూ చర్చ
ఫ్రాన్స్‌లోనూ 50 ఏళ్లు దాటినవారిలో విడాకులపై అధ్యయనాలు జరిగాయి. ఫ్రాన్స్ జాతీయ జనాభా అధ్యయన సంస్థ INED ప్రచురించిన పరిశోధన ప్రకారం, 50 ఏళ్లు దాటిన పురుషులకు సంబంధించిన విడిపోవడాల రేటు గణనీయంగా పెరిగింది. చైనా, తైవాన్, హాంకాంగ్‌లలోనూ దీర్ఘకాల వైవాహిక బంధాలు ముగిసే సందర్భాలు చర్చకు వస్తున్నాయి.
మరి భారత్‌లో పరిస్థితి ఏంటి?
భారత్‌లోనూ గ్రే డివోర్స్‌పై చర్చ పెరుగుతోంది. 50 ఏళ్లు దాటిన దంపతులు విడాకుల కోసం నిపుణులను, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయని లెక్కలు చెప్తున్నాయి. పిల్లలు స్థిరపడటం, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు తగ్గడం వంటి అంశాల తర్వాత కొందరు తమ వివాహ బంధాన్ని పునఃపరిశీలిస్తున్నారు. చాలా మంది…అఫీషియల్ గా విడాకులు తీసుకోకపోయినా ఓ వయస్సు వచ్చాక కలిసి ఉండటానికి ఇష్టపడక విడివిడిగా ఉండేవారు పెరుగుతున్నారని కొన్ని లెక్కలు చెప్తున్నాయి.
ఏదైమైనా భారత్‌లోనూ ఈ ట్రెండ్ మెల్లిగా మొదలైంది. ఇది ప్రపంచవ్యాప్త మార్పులో భాగంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. అలాగని గ్రే డైవర్స్ తీసుకునేవారి సంఖ్య దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతోందని లేదా రికార్డు స్థాయికి చేరిందని చెప్పడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు.
అసలు ఈ ట్రెండ్ ఎందుకు మొదలైంది?
1. జీవితకాలం పెరిగింది:
ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన తర్వాత జీవితంలో ఎక్కువ భాగం గడిచిపోయిందనే భావన ఉండేది. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు, ఆయుర్దాయం మెరుగుపడటంతో చాలామంది మరో 20–30 ఏళ్ల జీవితాన్ని ఊహించుకుంటున్నారు. ఆ జీవితాన్ని ఎలా గడపాలనే ఆలోచన కూడా మారుతోంది.
2. పిల్లల బాధ్యతలు తగ్గుతున్నాయి:
పిల్లలు చదువులు పూర్తి చేసి ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత, తల్లిదండ్రులపై ఉండే రోజువారీ బాధ్యతలు తగ్గవచ్చు. అప్పటివరకు పిల్లల కోసం కొనసాగించిన వివాహ బంధాన్ని కొందరు మళ్లీ అంచనా వేసుకుంటారు.
3. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం పెరుగుతోంది:
విద్య, ఉద్యోగాలు, సొంత ఆదాయం వల్ల కొందరు మహిళలు అసంతృప్తికరమైన వివాహంలో కొనసాగాల్సిందే అనే భావన నుంచి బయటపడుతున్నారు. అయితే ఆర్థికంగా స్వతంత్రంగా లేని మహిళలకు విడాకులు ఇప్పటికీ పెద్ద సవాలే.
4. సమాజం చూసే దృష్టి మారుతోంది:
గతంలో విడాకులు తీసుకుంటే కుటుంబ పరువు పోతుందని, సమాజం తప్పుగా చూస్తుందని చాలామంది భయపడేవారు. ఇప్పుడు కొన్ని సమాజాల్లో ఆ ఒత్తిడి తగ్గుతోంది. విడాకులను జీవిత వైఫల్యంగా కాకుండా, కొన్నిసార్లు కొత్త జీవితానికి ప్రారంభంగా చూసే దృక్పథం కనిపిస్తోంది.
5. ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు:
భావోద్వేగ దూరం, నిరంతర గొడవలు, హింస, ఆర్థిక సమస్యలు, పరస్పర గౌరవం లేకపోవడం వంటి అంశాలు కొందరి బంధాల్లో దీర్ఘకాలంగా కొనసాగవచ్చు. పిల్లలు పెద్దయ్యాక లేదా కుటుంబ బాధ్యతలు తగ్గిన తర్వాత వాటిని ఇక భరించలేమని కొందరు నిర్ణయించుకోవచ్చు.
అయితే ప్రతి విడాకుల వెనుక ఇవే కారణాలని అనుకోకూడదు. ఏ జంటకా ఆ జంట పరిస్థితి వేరు.
భారతీయ కుటుంబాల్లో మార్పు ఎలా కనిపిస్తోంది?
మన దగ్గర పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల సంబంధం మాత్రమే కాదు. రెండు కుటుంబాల అనుబంధం, పిల్లల భవిష్యత్తు, ఆర్థిక బాధ్యతలు, బంధువుల అభిప్రాయాలు కూడా ముడిపడి ఉంటాయి. అందుకే సమస్యలు ఉన్నా చాలామంది వివాహ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు.
కానీ పట్టణ జీవనం, మహిళల విద్య, ఉద్యోగ అవకాశాలు, వ్యక్తిగత స్వేచ్ఛపై పెరుగుతున్న అవగాహన వంటి అంశాలు కొందరి నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా పిల్లలు స్వతంత్రంగా జీవించడం మొదలుపెట్టిన తర్వాత భార్యాభర్తలు తమ భవిష్యత్తు గురించి కొత్తగా ఆలోచించే అవకాశం ఉంటుంది.
ఇక్కడ మరో కోణం కూడా ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత ఆర్థిక భద్రత, ఆస్తుల విభజన, పెన్షన్, ఆరోగ్య సంరక్షణ, ఒంటరితనం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. భారత్‌లో కుటుంబ మద్దతు అందుబాటులో ఉండటం కొందరికి బలంగా మారవచ్చు. అదే సమయంలో కుటుంబ ఒత్తిడి కారణంగా ఇష్టం లేని బంధంలో కొనసాగాల్సిన పరిస్థితి మరికొందరికి ఎదురవవచ్చు.
చివరికి.. ఇది పెళ్లిళ్లకు ఎండ్ కార్డేనా? లేక కొత్త జీవితానికి ప్రారంభమా?
ప్రపంచవ్యాప్తంగా గ్రే డివోర్స్‌పై జరుగుతున్న చర్చ ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. వివాహ బంధం, కుటుంబ బాధ్యతలు, వృద్ధాప్యం గురించి ప్రజల ఆలోచనలు మారుతున్నాయి. కొందరు జీవితాంతం కలిసి ఉండటానికే ప్రాధాన్యం ఇస్తుంటే, మరికొందరు తమ జీవితంలో మిగిలిన కాలాన్ని ప్రశాంతంగా గడపాలనే నిర్ణయం తీసుకుంటున్నారు.
ఒకప్పుడు పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రుల కథ ముగిసిపోయినట్లుగా భావించేవారు. ఇప్పుడు కొందరు దంపతులు అదే దశలో తమ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని కోరుకుంటున్నారు.
పెళ్లయిన 30 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడం అంటే ఇన్నేళ్ల బంధం ఓడిపోయినట్టేనా? లేక ఇన్నేళ్ల తర్వాతైనా తమ జీవితంపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను ఎంచుకున్నట్టా?
గ్రే డివోర్స్ వెనుక ఉన్న అసలు ఆలోచన ఇదే.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








