‘పరిందా’ నుంచి ‘Broken Horses’ వరకు.. నానా పటేకర్ పాత్రకు హాలీవుడ్ టచ్!
బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై హాలీవుడ్ సినిమాలను కాపీ చేశాయనే విమర్శలు తరచూ వినిపిస్తుంటుంది.అయితే దీనికి పూర్తి భిన్నంగా.. ఒక బాలీవుడ్ క్లాసిక్ సినిమాను హాలీవుడ్ అధికారికంగా రీమేక్ చేసిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి అరుదైన సినిమాల్లో ఒకటి నానా పటేకర్ నటించింది కావటం విశేషం. ఆ సినిమా ఏమిటి… దాని హాలీవుడ్ రిజల్ట్ ఏమిటి..ఆ విశేషాలు చూద్దాం.
నానా పటేకర్ కెరీర్‌ను మార్చిన సినిమా
1989లో విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పరిందా’ . ఈ హిందీ సినిమాల్లో గ్యాంగ్స్టర్లను, అండర్‌వరల్డ్‌ను మరింత వాస్తవికంగా చూపించటంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ సోదరులుగా నటించగా.. మాధురీ దీక్షిత్ హీరోయిన్గా కనిపించారు. నానా పటేకర్ మాత్రం భయంకరమైన డాన్ ‘అన్నా’ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ‘తుమ్సే మిల్కే’ వంటి పాటలు అప్పట్లో చార్ట్బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాకు రెండు నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. అంతేకాదు, 1990 అకాడమీ అవార్డ్స్‌కు భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా కూడా ‘పరిందా’ ఎంపికైంది. నానా పటేకర్‌కు ఈ సినిమాతోనే తొలి నేషనల్ అవార్డు లభించింది.
దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇదే కథను విధు వినోద్ చోప్రా అమెరికన్ ప్రేక్షకుల కోసం ‘Broken Horses’ పేరుతో ఇంగ్లిష్‌లో తెరకెక్కించారు. కానీ ముంబై అండర్‌వరల్డ్‌ను అమెరికా-మెక్సికో సరిహద్దు ప్రపంచంగా మార్చిన ఈ ప్రయోగం మాత్రం ‘పరిందా’ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.
అసలు ‘పరిందా’ కథ ఏంటి?
కథ ఇద్దరు అన్నదమ్ములు కిషన్, కరణ్ చుట్టూ తిరుగుతుంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఈ ఇద్దరూ ముంబై వీధుల్లో పెరుగుతారు. తమ్ముడు కరణ్‌కు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో అన్న కిషన్ నేర ప్రపంచంలోకి అడుగుపెడతాడు.
కిషన్‌కు నేర ప్రపంచానికి తలుపులు తెరిచేది అన్నా. బయటకు చూస్తే అతను వ్యాపారి. కానీ లోపల మాత్రం ముంబై అండర్‌వరల్డ్‌ను నడిపించే ప్రమాదకరమైన డాన్. కిషన్ అతని మనిషిగా మారిపోతాడు. తమ్ముడు మాత్రం అన్న ఏం చేస్తున్నాడో పూర్తిగా తెలియకుండా చదువు కోసం అమెరికా వెళ్తాడు.
ఏళ్ల తర్వాత కరణ్ ముంబైకి తిరిగి వస్తాడు. తన చిన్ననాటి ప్రేమ పారోను కలుసుకుంటాడు. పారో సోదరుడు ఇన్స్పెక్టర్ ప్రకాశ్. అన్నా నేర సామ్రాజ్యాన్ని బయటపెట్టాలని ప్రయత్నిస్తున్న పోలీస్ అధికారి. కానీ అన్నాకు ఈ విషయం తెలిసిపోతుంది.
అక్కడి నుంచే కథ అసలు విషాదంగా మారుతుంది.
కరణ్, ప్రకాశ్ కలవాల్సిన సమయంలో ప్రకాశ్ హత్యకు గురవుతాడు. కరణ్ కళ్లముందే తన స్నేహితుడు చనిపోవడం అతని జీవితాన్ని మార్చేస్తుంది. మొదట ఈ హత్య వెనుక ఎవరు ఉన్నారో అతనికి తెలియదు. కానీ క్రమంగా నిజం బయటపడుతుంది.
తనను కాపాడటానికి నేర ప్రపంచంలోకి వెళ్లిన అన్న కిషన్.. చివరకు అదే నేర ప్రపంచం కారణంగా తన తమ్ముడి జీవితాన్ని నాశనం చేస్తున్నాడని అతనికి అర్థమవుతుంది.
కరణ్ అన్నా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడాలని నిర్ణయించుకుంటాడు. కానీ అప్పటికే అన్నదమ్ముల బంధం, ప్రేమ, నేర ప్రపంచం అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి.
అసలు ‘పరిందా’లో విలన్ ఎవరు?
ఇక్కడే నానా పటేకర్ చేసిన ‘అన్నా’ పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది.
సాధారణంగా 1980ల హిందీ సినిమాల్లో విలన్ అంటే సూట్ వేసుకుని, పెద్ద కుర్చీలో కూర్చుని, గట్టిగా నవ్వుతూ తన దుర్మార్గాన్ని ప్రకటించే వ్యక్తి. కానీ విధు వినోద్ చోప్రా ఆ మూసను బద్దలు కొట్టారు. ఆయనకు కావాల్సింది సాధారణంగా కనిపించే ప్రమాదకరమైన మనిషి.
అందుకే ‘అన్నా’ పాత్రను నానా పటేకర్‌కు ఇచ్చారు. విధు వినోద్ చోప్రా కూడా తర్వాత మాట్లాడుతూ, అప్పటి సినిమాల్లో కనిపించే సంప్రదాయ విలన్లకు భిన్నంగా ‘అన్నా’ను రూపొందించాలనుకున్నట్లు చెప్పారు.
నానా పటేకర్ ‘అన్నా’గా అంత భయంకరంగా ఎందుకు కనిపించాడు?
‘అన్నా’ పాత్రలో నానా పటేకర్ గొప్పతనం ఆయన అప్పటి రెగ్యులర్ అరుపులకు దూరంగా ఉండటం. సాధారణంగా ఒక విలన్ కోపంగా ఉన్నాడని ప్రేక్షకుడికి అతని డైలాగులు, బాడీ లాంగ్వేజ్ చెబుతాయి. కానీ ‘అన్నా’ విషయంలో చిన్న చూపు, మాట మధ్యలో వచ్చే విరామం, ముఖంలో ఒక్కసారిగా మారే భావం.. ఇవే డేంజర్ ని తెలియజేసాయి. దాంతో ఆ నిశ్శబ్దంలోంచే భయం పుట్టించి, థియేటర్స్ ని వణికించింది.
ఈ సినిమాలో నానా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు హింసకు దిగుతాడో ప్రేక్షకుడికి అర్థం కాదు. ఒక్క క్షణంలో ప్రశాంతంగా ఉండే వ్యక్తి మరో క్షణంలో అత్యంత క్రూరంగా మారిపోతాడు. ఈ అనిశ్చితి ‘అన్నా’ పాత్రను మరింత భయంకరంగా చేసింది. Filmfare కూడా నానా పటేకర్ నటనలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, అతని పాత్ర సాధారణంగా మాట్లాడగలిగినప్పటికీ ఒక్కసారిగా హింసాత్మకంగా మారే స్వభావమే భయాన్ని కలిగించిందని పేర్కొంది.
అందుకే ‘అన్నా’ ఒక సినిమా విలన్లా కాకుండా నిజ జీవితంలో ఎప్పుడైనా ఎదురుపడే ప్రమాదకరమైన వ్యక్తిలా అనిపిస్తాడు. ఈ పాత్రకు నానా పటేకర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు – బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. ‘పరిందా’ ఆయన కెరీర్లో ఒక కీలక మలుపుగా నిలిచింది.
నానా పటేకర్ పాత్రలో మరో షాకింగ్ విషయం ‘అన్నా’ కేవలం క్రూరమైన డాన్ కాదు. అతనిలో ఒక విచిత్రమైన భయం కూడా ఉంటుంది. నిప్పు అంటే అతనికి భయం. అతని క్రూరత్వానికి, అతని అంతర్గత బలహీనతకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసమే పాత్రను మరింత ఇంట్రస్టింగ్ గా చేస్తుంది. అంటే బయట ప్రపంచాన్ని భయపెట్టే వ్యక్తి లోపల మాత్రం ఒక భయంతో జీవిస్తున్నాడు. ఇదే ‘అన్నా’ పాత్రను సాధారణ గ్యాంగ్‌స్టర్ పాత్ర కంటే చాలా సంక్లిష్టంగా మార్చింది.
మరి ‘పరిందా’ను హాలీవుడ్లో ఎలా మార్చారు?
2015లో వచ్చిన ‘Broken Horses’ లో విధు వినోద్ చోప్రా అదే ప్రాథమిక కథను అమెరికన్ ప్రేక్షకులకు సరిపోయేలా మార్చారు. ముంబై కనిపించదు. అండర్‌వరల్డ్ కనిపించదు. దాని స్థానంలో అమెరికా-మెక్సికో సరిహద్దు ప్రాంతం వస్తుంది. ముంబై వీధుల స్థానంలో పొడి ఎడారి ప్రాంతాలు, రాంచ్లు, తుపాకులు, గుర్రాలు, కౌబాయ్‌ల వాతావరణం కనిపిస్తుంది.
‘పరిందా’లో కిషన్, కరణ్ అన్నదమ్ములు. ‘Broken Horses’లో వారి సమాన పాత్రలు Buddy, Jacob.
కిషన్ పాత్రకు సమానమైన Buddy నేర ప్రపంచంలో చిక్కుకుంటాడు. Jacob మాత్రం సంగీత ప్రపంచంలోకి వెళ్లి వయొలిన్ ప్లేయర్‌గా ఎదగాలని చూస్తాడు. తర్వాత అతను తిరిగి ఇంటికి రావడంతో అన్నయ్య నేర ప్రపంచంలోకి లాగబడతాడు.
నానా పటేకర్ పాత్రను ఎవరు చేశారు?
ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం. ‘పరిందా’లో నానా పటేకర్ చేసిన ‘అన్నా’ పాత్రకు హాలీవుడ్ వెర్షన్లో విన్సెంట్ డి’ఒనోఫ్రియో చేసిన Julius Hench పాత్ర సమానంగా ఉంటుంది. తర్వాత మార్వెల్ ప్రపంచంలో ‘Daredevil’లో Kingpinగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడే డి’ఒనోఫ్రియో.
ఇవి కూడా చదవండి
అయితే ఇద్దరి నటనలో తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది
నానా పటేకర్ ‘అన్నా’లో చూపించిన ఆ అంతర్గత భయం, ఒక్కసారిగా ఎదుటివారిపై బ్లాస్ట్ అయ్యే హింస, ముంబై అండర్వరల్డ్కు చెందిన సహజమైన క్రూరత్వం.. ‘Broken Horses’లో అదే స్థాయిలో రిపీట్ కాలేదని అప్పటి రివ్యూలు పేర్కొన్నాయి. Filmfare అయితే నానా పటేకర్ ‘అన్నా’లోని మానసిక తీవ్రతకు బదులుగా డి’ఒనోఫ్రియో పాత్ర మరింత నాటకీయంగా అనిపించిందని విమర్శించింది.
కథలో చేసిన మరో పెద్ద మార్పు
‘పరిందా’లో ముంబై నగరం కథలో ఒక పాత్రలా ఉంటుంది. అక్కడి వీధులు, నేర ప్రపంచం, గ్యాంగ్స్టర్ల జీవితం.. కథకు సహజమైన నేపథ్యం. కానీ ‘Broken Horses’లో ఆ ప్రపంచాన్ని అమెరికన్ వెస్ట్రన్ వాతావరణంతో మార్చారు. Mexico border ప్రాంతం, ఎడారి, రాంచ్లు, గుర్రాలు కథకు కొత్త రూపాన్ని ఇచ్చాయి.
మరో ముఖ్యమైన మార్పు
‘పరిందా’లో కిషన్ ఒక నేరస్థుడే అయినా తమ్ముడిని కాపాడాలనే తపన ఉన్న అన్న. ‘Broken Horses’లో Buddy పాత్రకు మరింత అమాయకత్వం, మానసిక పరిమితి వంటి లక్షణాలు జోడించారు. అతను తుపాకీ వాడటంలో మాత్రం ప్రమాదకరమైన వ్యక్తిగా చూపించారు. అంటే కేవలం పేర్లు, ప్రదేశాలు మార్చలేదు. పాత్రల మానసిక నిర్మాణాన్ని కూడా కొంత మార్చారు.
అలాగే ‘పరిందా’లో క్రైమ్ కంటే ముందు కుటుంబం ఉంది. అన్నదమ్ముల బంధం ఉంది. ప్రేమ ఉంది. నమ్మకం ఉంది. ఆ నమ్మకం పగిలినప్పుడు వచ్చే బాధ ఉంది. అన్నిటి మధ్యలో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి పేరు అన్నా.
ఆ పాత్రకు నానా పటేకర్ ఇచ్చిన నటన అంత బలంగా ఉండటంతో.. హాలీవుడ్లో అదే పాత్రకు మరో గొప్ప నటుడు వచ్చినా, ప్రేక్షకుల జ్ఞాపకాల్లో మాత్రం ‘అన్నా అంటే నానా పటేకర్’ అనే ముద్ర చెరిగిపోలేదు.
‘పరిందా’ స్థాయి మాత్రం తగ్గలేదు
‘Broken Horses’ విఫలమైనా.. దాని మూలమైన ‘పరిందా’కు ఉన్న స్థానం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. భారతీయ సినిమాల్లో అత్యుత్తమ చిత్రాల జాబితాల్లో ఈ సినిమా పదేపదే చోటు సంపాదించింది.
అనురాగ్ కశ్యప్, నిఖిల్ అద్వానీ, దిబాకర్ బెనర్జీ వంటి దర్శకులు కూడా తమ సినీ ప్రయాణంపై ‘పరిందా’ ప్రభావం చూపిందని చెప్పిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా నానా పటేకర్ పోషించిన ‘అన్నా’ పాత్ర హిందీ మెయిన్‌స్ట్రీమ్ సినిమాలో హింసాత్మక విలన్‌ను మరింత వాస్తవికంగా చూపించిన పాత్రల్లో ఒకటిగా ఇప్పటికీ గుర్తుండిపోయింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








