రేవంత్, కేటీఆర్ పరస్పర ఆరోపణల విచారణ.. FGG డిమాండ్!
తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరస్పరం విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, ఇరునేతల పరస్పర ఆరోపణలపై సమగ్రమైన, నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరుతూ ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ సంస్థ డిమాండ్ చేస్తోంది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు నిత్యకృత్యమయ్యాయి. అసెంబ్లీలోనూ, బయట బహిరంగ సభల్లోనూ నేతలు అనేక విమర్శలు చేసుకుంటున్నారు. భూకబ్జాలు, అవినీతి, అక్రమాలపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు సుమారు లక్ష కోట్ల విలువైన భూములను కూడగట్టారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోవైపు.. గచ్చిబౌలి ప్రాంతంలో కేటీఆర్‌కు అనేక హోటళ్లు ఉన్నాయని.. సింగపూర్, అమెరికాలలో అక్రమ సంపాదనను పెట్టుబడులుగా పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత సిరిసిల్లలో కూడా ఇవే ఆరోపణలు సంధించడంతో తనకు హోటళ్లు ఉన్నట్టు కేటీఆర్ ఒప్పుకున్నారు. మరోవైపు.. రేవంత్ రెడ్డి ఆరోపణలపై కేటీఆర్ కూడా ధీటుగా స్పందించారు. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ లో జరుగుతున్న భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అక్రమంగా తన కుటుంబసభ్యులకు చెందిన సంస్థలకు భూములు కట్టబెట్టారని ఆరోపించారు. అంతేకాక, కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి బంధువులకు కాంట్రాక్టులు కట్టబెట్టడంలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి
అధికార, ప్రతిపక్ష అగ్రనేతలు ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం పట్ల మేధావులు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభ రెడ్డి గవర్నర్‌కు రాసిన లేఖలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న నాయకులు నిరాధారమైన ఆరోపణలతో కాలయాపన చేయడం సరికాదన్నారు. నిజంగానే అవినీతి జరిగి ఉంటే దానిని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ పారదర్శకత లోపించడం వల్ల ప్రజల్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం సడలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన పాలకులు, ప్రతిపక్షాలు ఈ రకమైన రాజకీయ కక్షసాధింపులు, ఆరోపణల చుట్టూనే తిరగడం వల్ల అసలు సమస్యలు పక్కదారి పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాలనా వైఫల్యాలు, అవినీతి ఆరోపణలపై కేవలం మాటల యుద్ధంతో సరిపెట్టకుండా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్ బలపడుతోంది.
ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని, గవర్నర్ వెంటనే స్పందించి స్వతంత్ర ఏజెన్సీ ద్వారా ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలపై నిష్పాక్షికమైన విచారణకు ఆదేశించాలని FGG కోరింది. చట్టపరమైన విచారణ జరిగితేనే అసలు నిజాలు ఏమిటో ప్రజల ముందుకు వస్తాయని, రాజకీయ నాయకులపై ఉన్న అనుమానాలు తొలగిపోయి పరిపాలనా వ్యవస్థపై విశ్వాసం బలపడుతుందని ఆ సంస్థ స్పష్టం చేసింది.








