భారీ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్
తెలంగాణలో పారిశ్రామిక విప్లవానికి, భారీ పెట్టుబడుల ఆకర్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ 7 నుండి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకం కానుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కల్పిస్తున్న ప్రోత్సాహం.. ఇప్పుడు రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతోంది.
2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 240 అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు హైదరాబాద్‌కు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా, యువతకు అత్యధిక వేతనాలు లభించే ఉద్యోగాలను సృష్టించే ప్రధాన సాధనంగా చూస్తోంది. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్.., దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జీసీసీ మార్కెట్లలో అగ్రగామిగా నిలుస్తోంది. అనరాక్ ఫిక్కీ, జ్ఫెనో, యునార్త్ ఐక్యూ వంటి ప్రముఖ సంస్థల నివేదికల ప్రకారం.. దేశంలో ఏర్పాటవుతున్న మొత్తం జీసీసీలలో సుమారు 40 శాతానికి పైగా వాటా హైదరాబాద్‌కే దక్కుతుండటం విశేషం. కెనడియన్ బ్యాంకింగ్ దిగ్గజం సీఐబీసీతో పాటు డోర్‌డాష్, బిల్ట్రస్ట్, మెర్క్ షార్ప్ & డోమ్, రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ వంటి దిగ్గజ కంపెనీలు నగరంలో తమ కేంద్రాలను ప్రారంభించడం ఇందుకు నిదర్శనం.
రాజకీయంగా విపక్షాల విమర్శలను తిప్పకొట్టడంలోనూ, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలోనూ ఈ గ్లోబల్ సమ్మిట్ అధికార పార్టీకి అత్యంత కీలకం కానుంది. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ కొనసాగింపుగా వస్తున్న ఈ సమ్మిట్ ద్వారా 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే బృహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని విధానాలు, ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు పారిశ్రామిక వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆధ్వర్యంలో జరిగిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గవర్నింగ్ కౌన్సిల్’ తొలి సమావేశం ఈ సమ్మిట్ విజయవంతంపై స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. పెట్టుబడిదారులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం, మౌలిక వసతులను మెరుగుపరచడం, అంతర్-విభాగ సమన్వయాన్ని పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జపాన్, పశ్చిమ ఆసియా దేశాలకు చెందిన పలు కంపెనీలు తమ భారతీయ కార్యకలాపాల విస్తరణ కోసం హైదరాబాద్ వైపు చూస్తుండటం, బలమైన బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా వ్యవస్థ నగరానికి అదనపు బలంగా మారుతుండటం శుభపరిణామం.
మొత్తంగా, ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ కేవలం వ్యాపార సదస్సు మాత్రమే కాకుండా… తెలంగాణ రాజకీయ, ఆర్థిక పటాన్ని మార్చేసే చారిత్రక వేదికగా నిలవనుందడంలో ఎలాంటి సందేహం లేదు. పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలతో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ, రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలపడానికి ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నిస్తోంది.








