సర్కార్ పనితీరుపై ఇంటెలిజెన్స్ నజర్..!
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న తరుణంలో.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆత్మపరిశీలనకు సిద్ధమైంది. ప్రభుత్వ పాలనపై, ముఖ్యంగా నేతల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు అత్యంత రహస్యంగా పావులు కదుపుతోంది. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ సహా పలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇంటెలిజెన్స్ ద్వారా క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రజా నాడిని ముందుగానే పట్టుకుని, లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చాక తమ పథకాలు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి.. తమ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు.. అనే అంశాలపై ఎప్పటికప్పుడు థర్డ్ పార్టీల ద్వారా నిఘా పెడుతుంటాయి. అయితే.. రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఏకంగా ఇంటెలిజెన్స్ యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయిలో లోతుగా ఆరా తీస్తోంది. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్ల వారీగా ఈ సర్వేను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సర్వేలో కేవలం ప్రభుత్వం, ముఖ్యమంత్రి పనితీరు మాత్రమే కాకుండా, స్థానిక ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల పాలనా శైలిపై కూడా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు.. ఏ ఏ పథకాలపై సానుకూలంగా ఉన్నారు… వేటిపైన అసంతృప్తితో ఉన్నారు.. లాంటి అంశాలను గుర్తించి.. సరిదిద్దుకేవడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
గత ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల లబ్ధి అర్హులందరికీ అందుతున్నాయా లేదా అనే అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సర్కార్ భావిస్తోంది. ఈ సర్వేలో ప్రజలను ప్రధానంగా అయిదు నుంచి ఏడు రకాల కీలక అంశాలపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేల పనితీరుతో పాటు, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఒకవేళ కాంగ్రెస్కు ఓటు వేయకపోతే దానికి గల కారణాలు ఏమిటి? అనే ప్రశ్నలను సంధించడం ద్వారా ప్రతిపక్షాల వైపు ప్రజల మొగ్గు ఎలా ఉందో అంచనా వేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా పనితీరు, ఉచిత పథకాలు, విద్యుత్ కోతలు, నిరుద్యోగ సమస్య, ఉద్యోగుల పెండింగ్ డిమాండ్లు వంటి సమస్యాత్మక అంశాలపై ప్రజల స్పందనను ఇంటెలిజెన్స్ వర్గాలు కూలంకషంగా సేకరిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలు ఎంతవరకు జనాల్లోకి వెళ్లాయనే కోణంలోనూ ఈ సర్వే వివరాలు రాబడుతోంది. అదే సమయంలో, కొన్ని వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకత, ఉచితాలకు వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాలు, సంక్షేమ పథకాల అమలులో ఉన్న లోపాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి ఈ డేటా ప్రభుత్వానికి అత్యంత కీలకం కానుంది. ఎన్నికల సమయానికి ముందే ప్రజా వ్యతిరేకతను తగ్గించి, పాలనను గాడిలో పెట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఇంటెలిజెన్స్ సర్వేను ఒక అస్త్రంగా మలుచుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.








