యునైటెడ్ ఎయిర్‌లైన్స్ డైరెక్టర్ ఆఫ్ సర్టిఫికేషన్‌గా తెలుగు తేజం…
అమెరికాలోని ప్రముఖ విమానయాన సంస్థ అయిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్(United Airlines)లో డైరెక్టర్ ఆఫ్ సర్టిఫికేషన్‌గా ప్రవాస తెలుగు వ్యక్తి గన్నిరాజు తుమరాడ పదోన్నతి పొందారు. ఈ మేరకు యునైటెడ్ టెక్ ఆప్స్ వైస్ ప్రెసిడెంట్ మారా పాలిస్కో ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలోని జార్జియా రాష్ట్రం సవన్నాలో నివసిస్తున్న రాజు తుమరాడ.. తన కొత్త బాధ్యతలలో భాగంగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాల సర్టిఫికేషన్, నియంత్రణ వ్యవహారాలు, విడిభాగాల తయారీ, ఇంజినీరింగ్ డేటా, సాంకేతిక నాయకత్వం అలాగే భద్రతా ప్రమాణాల బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. అంతేకాకుండా, అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌కు(FAA), యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు మధ్య ఆయన ఒక కీలక వారధిలా ఉంటూ సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తారు.
ఉద్యోగ ప్రస్థానం…
గన్నిరాజు తుమరాడ 2019లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో చేరారు. అప్పట్లో ఆయన లీడ్ అడ్మినిస్ట్రేటర్‌గా, ఆ తర్వాత సీనియర్ మేనేజర్‌గా పలు బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు. విమానాల్లో చేపట్టే వివిధ మార్పులు, క్యాబిన్ల తీరుతెన్నులు, ఇన్‌ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ తదితర విభాగాలకు సంబంధించిన సర్టిఫికేషన్ కార్యక్రమాలలో ఆయన ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. ముఖ్యంగా, అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిజిగ్నేటెడ్ ఇంజినీరింగ్ రిప్రజెంటేటివ్(DER)గా నియమితులైన తొలి భారతీయ-తెలుగు సంతతి వ్యక్తిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో చేరడానికి ముందు ఆయన సుమారు 20 సంవత్సరాల పాటు అమెరికావ్యాప్తంగా వివిధ ప్రముఖ విమానయాన సంస్థలలో పనిచేసి విస్తృతమైన అనుభవాన్ని గడించారు.
విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం
గన్నిరాజు తుమరాడ కుటుంబం ఏలూరుకు చెందినది కాగా, ఆయన హైదరాబాద్‌లో జన్మించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత 1999లో గుల్బర్గా యూనివర్సిటీ పరిధిలోని ఎస్ఎల్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఆయన, 2003లో విచిటా స్టేట్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ (MS) పట్టాను పొందారు. తెలుగు వ్యక్తి అంతర్జాతీయ విమానయాన రంగంలో ఈ స్థాయి అత్యున్నత పదవిని అధిరోహించడం పట్ల తెలుగువారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








