జిమ్ లేదు.. డైటింగ్ లేదు.. జపనీస్ ట్రిక్‌తో 40 కేజీలు తగ్గిన ఖుష్బూ!
ఒకప్పుడు 98 కిలోలు.. ఇప్పుడు చూస్తే గుర్తుపట్టడం కూడా కష్టమే! 56 ఏళ్ల వయసులో నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్‌లో కనిపిస్తున్న ఈ మార్పు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు వెండితెరపై బొద్దుగా, ముద్దుగా కనిపించిన ఖుష్బూ.. ఇప్పుడు చాలా స్లిమ్‌గా కనిపిస్తున్నారు. అయితే ఆమె వెయిట్ లాస్ జర్నీలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్స్ చేయలేదు. కఠినమైన డైట్ కూడా ఫాలో కాలేదు. మరి ఇంతకీ 40 కిలోలు ఎలా తగ్గారు? సీక్రెట్ వింటే.. “ఇంతేనా?” అని అనిపించొచ్చు. కానీ అదే చిన్న మార్పును క్రమం తప్పకుండా పాటించడం ఆమె జీవితాన్ని మార్చేసింది. అదేంటో చూద్దాం.
ఆ ఆలోచన ఎక్కడ మొదలైంది?
రజనీకాంత్ ‘పెద్దన్న’ సినిమా చూస్తున్నప్పుడు తెరపై తనను తాను చూసుకున్న ఖుష్బూకి, తన బరువు గురించి మొదటిసారి తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చింది. అప్పటికే ఆమె బరువు దాదాపు 98 కిలోలకు చేరుకోవడమే కాకుండా, అధిక బరువు వల్ల మోకాళ్ల నొప్పులు కూడా మొదలయ్యాయి. ఇక ఎలాగైనా బరువు తగ్గాల్సిందేనని బలంగా నిర్ణయించుకున్నారు. అయితే చాలామందిలాగా వెంటనే కఠినమైన పత్యాలు మొదలుపెట్టకుండా, చాలా నిదానంగా, సులువైన పద్ధతిని ఎంచుకున్నారు.
జపనీస్ సీక్రెట్.. చిన్న ప్లేట్ మ్యాజిక్
ఖుష్బూ తన ఆహారపు అలవాట్లలో జపనీస్ సంస్కృతి నుంచి ప్రేరణ పొందిన ఒక చిన్న మార్పును తీసుకొచ్చారు. సాధారణంగా మనం టైమ్ అయిందనో, లేక ప్లేట్ నిండా ఉందనో ఆకలి లేకపోయినా తింటుంటాం. కానీ ఆమె మాత్రం శరీరానికి నిజంగా ఆకలి అనిపించినప్పుడు మాత్రమే తినడం అలవాటు చేసుకున్నారు. దానికి తోడు భోజనం చేయడానికి పెద్ద ప్లేట్లకు బదులుగా చిన్న ప్లేట్లను వాడటం ప్రారంభించారు. దీనివల్ల ఆహారం పరిమాణం సహజంగానే తగ్గి, పోర్షన్ కంట్రోల్ సాధించడం చాలా తేలికైంది.
ఇష్టమైనవి తింటూనే బరువు తగ్గడం
బరువు తగ్గడం అంటే బిర్యానీలు, తీపి పదార్థాలు, టీలు పూర్తిగా మానేయాలని చాలామంది భావిస్తారు. కానీ ఖుష్బూ తనకు ఇష్టమైన మటన్ బిర్యానీ, ఐస్‌క్రీమ్స్, స్వీట్లు, చక్కర వేసిన మిల్క్ టీ ఏదీ వదులుకోలేదు. కాకపోతే తినే పరిమాణాన్ని మాత్రం బాగా తగ్గించారు. బిర్యానీ తిన్నా ఒక చిన్న గిన్నెలో కొద్దిగా మాత్రమే తీసుకుంటూ, ఆహారాన్ని పూర్తిగా మానేయకుండా ఎక్కువగా తినడాన్ని మాత్రం నియంత్రించుకున్నారు.
నడక, యోగాలతో ముందడుగు
వ్యాయామం విషయంలో కూడా ఆమె ఎలాంటి హంగామా చేయలేదు. రోజూ క్రమం తప్పకుండా ఒక 45 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకున్నారు. అలాగే ఇంట్లోనే తన భర్తతో కలిసి క్రమశిక్షణగా యోగా చేసేవారు. జిమ్‌కు వెళ్లకపోయినా, రోజూ శరీరాన్ని కదిలించేలా నడక, యోగాలనే తమ ఫిట్నెస్ మంత్రంగా మార్చుకున్నారు.
ఫలితం?
దాదాపు 40 కిలోల బరువు తగ్గిన ఖుష్బూ.. ఇప్పుడు తన కొత్త లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ కథనంలో చూడాల్సింది “ఏం తిన్నారు?” అనేది కాదు. “ఎంత తిన్నారు.. ఎంతకాలం ఆ నియమాన్ని పాటించారు?” అనేదే అసలేంది.
క్రమశిక్షణే అసలైన రహస్యం
ఈ 40 కిలోల వెయిట్ లాస్ వెనుక ఎలాంటి మ్యాజిక్ డ్రింకులు గానీ, షార్ట్కట్లు గానీ లేవు. సరైన అలవాట్లను నమ్ముకుని వాటిని దీర్ఘకాలం పాటించడమే ఆమె విజయానికి కారణం.
గమనిక:
ఖుష్బూకు పనిచేసిన విధానం ప్రతి ఒక్కరికీ అలాగే పనిచేస్తుందని చెప్పలేం. వయసు, ఆరోగ్యం, శరీర నిర్మాణం, జీవనశైలి ఆధారంగా బరువు తగ్గే పద్ధతి మారుతుంది. కాబట్టి ఆహారం లేదా వ్యాయామంలో పెద్ద మార్పులు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








