కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం!?
తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని కీలక రాజకీయ పరిణామాలకు తెరలేపింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325కు సంబంధించి బయటపడిన 45 ఎకరాల ‘మిస్సింగ్ ల్యాండ్’ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
ఎర్రవల్లిలో కేసీఆర్ కుటుంబం భూఅక్రమాలకు పాల్పడిందని, రెవిన్యూ యంత్రాంగం దానిపై విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సాక్షాత్తూ అసెంబ్లీలో ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రంంగంలోకి దిగిన రెవిన్యూ అధికారులకు అనేక విషయాలు తెలిసాయి. రెవెన్యూ రికార్డులకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య పెద్ద తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల పరిధిలోని సర్వే నంబర్ 325లో రికార్డుల ప్రకారం మొత్తం 388 ఎకరాల భూమి ఉండాలి. అయితే, సర్వేలో కేవలం 343 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తేలింది. మిగిలిన 45 ఎకరాల భూమి ఎక్కడికిపోయింది? ఎవరి చేతుల్లోకి వెళ్లింది? అనే ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ముఖ్యంగా ఈ వివాదాస్పద సర్వే నంబర్‌ను ఆనుకుని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల భూములు ఉండటం ఆసక్తి రేపుతోంది. సరిహద్దు భూములున్న వారి నుంచి రెవెన్యూ రికార్డులు సేకరించి, సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనివల్ల కేవలం అధికారులకే కాకుండా, నేరుగా కేసీఆర్ కుటుంబానికి కూడా నోటీసులు జారీ చేసే ప్రక్రియ అనివార్యమైంది. దీనిని కేవలం ఒక సాధారణ రెవెన్యూ లేదా ల్యాండ్ ఇష్యూగా చూసేందుకు వీలు లేదు. దీని వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని చెప్పొచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలపై జరిగిన పరిణామాలు, అవినీతి ఆరోపణలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివర్స్ అవుతున్నాయి.
కేసీఆర్ సొంత నియోజకవర్గం, పైగా ఆయన నివాసం ఉండే ఫామ్‌హౌస్ ఉన్న ప్రాంతంలోనే భూముల వివాదం తలెత్తడం బీఆర్ఎస్ అధినాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఈ సర్వే నంబర్ లోని వివాదాస్పద భూమిని స్వాధీనం చేసుకుని, అక్కడ ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ని నిర్మించి, అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెంటిమెంట్‌తో ముడిపడిన ఈ నిర్ణయం ద్వారా రాజకీయంగా బీఆర్ఎస్ను డిఫెన్స్‌లో పడేయాలని కాంగ్రెస్ వ్యూహరచన చేసినట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమ భూసేకరణలు లేదా రికార్డుల తారుమారుపై ప్రస్తుత ప్రభుత్వం ఒక స్పష్టమైన సంకేతం పంపుతోంది.
రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశాలున్నాయి. రెవెన్యూ శాఖ నుంచి అధికారికంగా నోటీసులు వెలువడితే, బీఆర్ఎస్ పార్టీ దీనిని తీవ్రంగా ఖండించే అవకాశం ఉంది. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి డ్రామాలకు తెరతీస్తోందని బీఆర్ఎస్ వర్గం ఆరోపించే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు, జూన్ 2 నాటికి అమరవీరుల కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులకు సీఎం డెడ్‌లైన్ విధించడం చూస్తుంటే, ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదనే కఠిన వైఖరితో ఉందనేది స్పష్టమవుతోంది.








