‘ఫ్లై దుబాయ్’ ఘటన: ఆ ఒక్క ప్రయాణికుడు లేకపోతే పైలట్ బతికేవారా?
ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ప్రాణాలను కాపాడేందుకు ఓ డెంటిస్ట్, కొంతమంది ప్రయాణికులు చేసిన పోరాటం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కాక్‌పిట్‌లో దాడి జరిగిన తర్వాత తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌కు ఇజ్రాయెల్‌కు చెందిన జార్జియన్ డెంటిస్ట్ డాక్టర్ షోటా ముసావ్ సుమారు 45 నిమిషాల పాటు ప్రాథమిక వైద్యం అందిస్తూ, ఆయన స్పృహ కోల్పోకుండా చూసుకున్నారు. అదెలా జరిగిందో చూద్దాం.
ఫ్లై దుబాయ్‌కి చెందిన FZ1073 విమానం సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరింది. విమానంలో 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రయాణం మధ్యలో కాక్‌పిట్ నుంచి కేకలు వినిపించడంతో పరిస్థితి ఒక్కసారిగా భయానకంగా మారింది. అదే ప్లైట్ లో ప్రయాణిస్తున్న డాక్టర్ ముసావ్కు మొదట ఏం జరిగిందో అర్థం కాలేదు. విమానానికి ఏదైనా భారీ ప్రమాదం జరిగిందని అనుకున్నారు. కానీ కాక్‌పిట్ వైపు వెళ్లినప్పుడు తీవ్రంగా గాయపడిన కెప్టెన్ రక్తపు మడుగులో కనిపించారు.
45 నిమిషాల పాటు కెప్టెన్‌ను కాపాడేందుకు పోరాటం
వెళ్లి చూసేసరికి కెప్టెన్ తల, ఎడమ చేతిపై తీవ్ర గాయాల నుంచి భారీగా రక్తస్రావం అవుతోంది. డాక్టర్ ముసావ్ వెంటనే ప్రయాణికుల వద్ద ఉన్న టీ-షర్ట్‌లను ఉపయోగించి గాయాలపై ఒత్తిడి పెట్టారు. రక్తస్రావం ఆగకపోవడంతో సిబ్బంది నుంచి ఐస్ ప్యాకెట్లు తెప్పించారు.
“చాలా లోతైన గాయాలు ఉన్నాయి. నేను టీ-షర్ట్‌ను తొలగించి గాయం చూస్తే మళ్లీ రక్తం ఎక్కువగా వచ్చేది. అందుకే ఒత్తిడి పెట్టి, ఐస్‌తో రక్తస్రావాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించాను” అని ఆయన వివరించారు. ఆ 45 నిమిషాల్లో ఆయన కేవలం గాయాలకు చికిత్స చేయడమే కాకుండా కెప్టెన్ స్పృహలో ఉండేలా మాట్లాడుతూనే ఉన్నారు.
“దయచేసి నిద్రపోవద్దు. మాకు మీరు కావాలి” అని కెప్టెన్‌కు చెబుతూ, ఆయనకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, వారి పేర్లు ఏమిటని అడిగారు. “భయపడకండి. మీరు మీ కుటుంబం దగ్గరకు తిరిగి వెళ్తారు. మనం త్వరలో ల్యాండ్ అవుతాం” అంటూ ధైర్యం చెప్పారు.
కెప్టెన్ తన పేరు, వయసు, తాను దుబాయ్‌లో నివసిస్తున్నానని, భారత్‌కు చెందిన వ్యక్తినని చెప్పినట్లు డాక్టర్ తెలిపారు. అయితే కెప్టెన్ పరిస్థితి క్రమంగా విషమించింది.
“నా తల చాలా నొప్పిగా ఉంది. దయచేసి నాకు సహాయం చేయండి. నేను చనిపోవాలని అనుకోవడం లేదు. నేను బతకాలి” అని ఆయన చెప్పినట్లు ముసావ్ వెల్లడించారు.
పల్స్ పడిపోయింది.. పెదాలు నీలంగా మారాయి
ఒక దశలో కెప్టెన్ పల్స్ చాలా తక్కువగా పడిపోయింది. వెంటనే డాక్టర్ ముసావ్ ఆయన కాళ్లను పైకి ఎత్తారు. కొద్దిసేపటి తర్వాత పల్స్ తిరిగి సాధారణ స్థితికి వచ్చింది. మరోసారి కెప్టెన్ పెదాలు నీలంగా మారడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందని ఆయన గుర్తించారు. “మనం త్వరగా ల్యాండ్ అవ్వాలి. ఆయనకు ఎక్కువ సమయం లేదు” అని సిబ్బందిని హెచ్చరించారు.
కెప్టెన్‌కు పెయిన్ కిల్లర్ మందులు ఇవ్వాలని కొందరు ప్రయత్నించినప్పటికీ, తీవ్ర రక్తస్రావం, ఆయన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మందులు ఇవ్వడానికి ముసావ్ అంగీకరించలేదు. నీటిని మాత్రం కొద్దికొద్దిగా ఇచ్చారు.
ఆయనకు ప్రధానంగా మూడు విషయాలనే గమనిస్తూ ఉన్నారు—కెప్టెన్ మాట్లాడుతున్నారా, స్పృహలో ఉన్నారా, పల్స్ ఎలా ఉంది, పెదాల రంగు ఎలా మారుతోంది అని.
దాడి చేసిన కో-పైలట్‌ను ప్రయాణికులే కట్టేశారు
కెప్టెన్‌కు చికిత్స చేయడానికి ముందు డాక్టర్ ముసావ్ మరో కీలకమైన పని చేయాల్సి వచ్చింది. కాక్‌పిట్‌లో దాడికి పాల్పడిన కో-పైలట్‌ను కొంతమంది ప్రయాణికులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. హెడ్‌ఫోన్ కేబుల్స్‌ను ఉపయోగించి అతని చేతులు, కాళ్లను కట్టేశారు.
ఇవి కూడా చదవండి
“అతను చాలా తీవ్రంగా ప్రతిఘటించాడు. అందుకే పలుమార్లు కట్టాల్సి వచ్చింది. చేతులు, కాళ్లు బిగించి కట్టిన తర్వాత అతను మేము తనను అదుపులోకి తీసుకున్నామని అర్థం చేసుకున్నాడు” అని ముసావ్ తెలిపారు.
ఆ తర్వాతే ఆయన గాయపడిన కెప్టెన్ వైపు పూర్తిగా దృష్టి పెట్టారు. విమానం భారీగా కిందికి పడిపోయింది ఈ ఘటనలో ప్రయాణికులు ఎదుర్కొన్న మరో భయంకరమైన క్షణం విమానం ఒక్కసారిగా భారీగా కిందికి దిగడం. డాక్టర్ ముసావ్ చెప్పిన ప్రకారం, కేవలం అర నిమిషంలో విమానం “అసాధారణంగా” భారీగా ఎత్తు కోల్పోయింది.
“మనం చనిపోతామని 100 శాతం అనుకున్నాం” అని ఆయన చెప్పారు. ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి వెళ్లి పైలట్లను తీసుకురావాలని కేకలు వేశారు. చివరకు ఒక పైలట్ విమానాన్ని నియంత్రణలోకి తీసుకున్నప్పుడు పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది.
ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ ముసావ్ భావోద్వేగానికి గురయ్యారు. “మనం చనిపోవడానికి ఐదు నుంచి పది సెకన్ల దూరంలో ఉన్నామని మీకు అర్థమవుతుందా?” అని ఆయన అన్నారు.
సౌదీ అరేబియాలో అత్యవసర ల్యాండింగ్
విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్కు మళ్లించారు. అక్కడ కెప్టెన్ మచ్ఛర్‌ను వైద్యుల చేతికి అప్పగించారు. “గుడ్ లక్ మై ఫ్రెండ్. అంతా బాగుంటుంది” అని అప్పట్లో కెప్టెన్‌కు చెప్పినట్లు ముసావ్ గుర్తుచేసుకున్నారు. తర్వాత కెప్టెన్ ప్రాణాలతో బయటపడ్డారని, ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలుసుకున్నారు. అనంతరం ఆయనను UAEకి తరలించి వైద్య చికిత్స కొనసాగిస్తున్నారు.
“మేము ఆయన ప్రాణాలు కాపాడాం.. ఆయన మా ప్రాణాలు కాపాడారు”
ఈ ఘటన తర్వాత తనకు, తన భార్యకు నిద్ర కూడా సరిగా పట్టడం లేదని డాక్టర్ ముసావ్ చెప్పారు.
“రాత్రి మాకు రెండు గంటలు మాత్రమే నిద్ర వస్తోంది. గత మూడు రోజుల్లో నా బరువు మూడు కిలోలు తగ్గింది. ఇప్పుడు మాకు ఏం జరిగిందో అర్థం చేసుకుంటున్నాం. అసలు మానసిక ప్రభావం ఇప్పుడు మొదలవుతుంది” అని ఆయన తెలిపారు. అయితే తనను హీరోగా చూడటానికి ఆయన నిరాకరించారు.
“నేను ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. రక్తస్రావాన్ని ఆపాను, ఆయన పల్స్‌ను స్థిరంగా ఉంచాను. అంతే” అని అన్నారు. అదే సమయంలో విమానంలోని ప్రతి ఒక్కరినీ హీరోలుగా అభివర్ణించారు.
“స్మిత్ మా ప్రాణాలను కాపాడారు. ఆయన హీరో. నా కుటుంబాన్ని, విమానంలోని ప్రయాణికులందరినీ కాపాడినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఆయన మా ప్రాణాలను కాపాడారు.. మేము ఆయన ప్రాణాలను కాపాడాం.”
కాక్‌పిట్‌లో ఏదో తప్పు జరుగుతోందని ముందుగా గుర్తించి ఇతరులను అప్రమత్తం చేసిన మహిళను కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








