రష్యా చమురు రంగాన్ని గట్టి దెబ్బతీశాం.. ఉక్రెయిన్ కీలకప్రకటన..
నాలుగేళ్లకు పైగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇరుదేశాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఉక్రెయిన్ పూర్తిగా నష్టపోగా.. రష్యా సైతం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా రష్యాలో చమురు సంక్షోభం మరింత తీవ్రమైంది. ఫలితంగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతి దారైన రష్యా.. ఇప్పుడు తన అవసరాల కోసం భారత్ లాంటి దేశాల సాయం కోరుతోంది.ఇదే విషయాన్ని యుద్ధ పరిభాషలో వివరించారు ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ.
కీలక చమురు ఉత్పత్తిదారు అయిన రష్యాలోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ (Ukraine) దాడులు కొనసాగిస్తోంది. నాలుగేళ్లుగా ఇరుదేశాల మధ్య జరుగుతోన్న యుద్ధం కారణంగా రష్యా చమురు శుద్ధి సామర్థ్యం (Russia’s oil Refining Capacity) 50 శాతం ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.
నాలుగేళ్లుగా తాము కొనసాగిస్తోన్న సుదూర దాడులు సగానికి పైగా రష్యా చమురు శుద్ధి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేశాయని ఉక్రెయిన్ తెలిపింది. ఇతర దేశాలకు ఇంధనాన్ని సరఫరా చేసే వ్యవస్థలకు ఆటంకం కలిగించాయని పేర్కొంది. మాస్కో, యారోస్లావ్ల్, ఉస్ట్-లుగా, పెర్మ్ వంటి నగరాల్లోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఇటీవల చేసిన దాడుల వల్ల సగానికి పైగా చమురు శుద్ధి సామర్థ్యం దెబ్బతిందని వెల్లడించింది. ఇది తమ శత్రువు ఆర్థిక వ్యవస్థకు, దురాక్రమణ సామర్థ్యానికి కోలుకోలేని దెబ్బ అని అభివర్ణించింది.
ఇంధన సంక్షోభం..
మాస్కోలోని అనేక చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ పదేపదే దాడులు చేస్తుండడంతో ఈ ఏడాది ప్రారంభం నుంచే రష్యాలో ఇంధన సంక్షోభం (Fuel crisis) తలెత్తింది. దీంతో అధికారులు గ్యాసోలిన్ అమ్మకాలను పరిమితం చేయాల్సి వచ్చింది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన రోజుల్లో.. కొన్ని సంబర్భాల్లో ఇంధనం కోసం ప్రజలు కిలోమీటర్లు మేర బారులు తీరాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అయితే యుద్ధం కారణంగా దేశ చమురు మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టం గురించి రష్యా ఎలాంటి డేటాను బహిరంగంగా వెల్లడించలేదు. ఈ దాడుల వల్ల తమ స్థూల దేశీయోత్పత్తిలో కేవలం 1 శాతం మాత్రమే నష్టం వాటిల్లిందని గతేడాది పుతిన్ పేర్కొన్నారు. తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం వారికి సాధ్యం కాదని అన్నారు.
ప్రభుత్వ సబ్సిడీ పెరుగుదల
చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు కొనసాగిస్తుండడంతో గత నెలలో రష్యా కీలక చర్యలు తీసుకుంది. దేశీయ మార్కెట్కు ఇంధన సరఫరా చేసే చమురు కంపెనీలకు నాలుగేళ్లలో అతిపెద్ద సబ్సిడీ (Subsidy)ని ప్రకటించింది. రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్లో సబ్సిడీల మొత్తం 3.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏప్రిల్ 2022 నాటి రికార్డు తర్వాత ఇదే అత్యధిక చెల్లింపు.








