రాయల్ ఎన్ఫీల్డ్ కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ మైలురాయి నమోదైంది. రాష్ట్రంలో సరికొత్త పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతూ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం ‘రాయల్ ఎన్ఫీల్డ్’ (Royal Enfield) మోటార్ సైకిళ్ల ప్లాంట్ ఏర్పాటుకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. తిరుపతి జిల్లా తడ పరిధిలోని ప్రతిష్టాత్మక శ్రీసిటీ (Sri City) లో ఏర్పాటు చేయబోతున్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌కు కేంద్ర, రాష్ట్ర పర్యావరణ శాఖల నుండి అధికారికంగా పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ మాతృసంస్థ అయిన ఐషర్ మోటార్స్ (Eicher Motors) ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం ఏకంగా రూ.2,508 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టబోతోంది. రాష్ట్రంలో ఈ స్థాయి మెగా ఆటోమొబైల్ ప్రాజెక్ట్ రావడం పారిశ్రామిక వర్గాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్లాంట్ స్థాపన ద్వారా శ్రీసిటీ పరిసర ప్రాంతాలతో పాటు మొత్తంగా రాయలసీమ రీజియన్‌లో పారిశ్రామిక వృద్ధి బుల్లెట్ వేగంతో పుంజుకోనుంది. రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి గ్లోబల్ బ్రాండ్ ప్లాంట్ అందుబాటులోకి రావడం వల్ల తిరుపతి జిల్లా, రాయలసీమ ప్రాంత నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ తరహా మెగా ప్రాజెక్టుల ద్వారా ఏపీని దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చాలనేది కూటమి ప్రభుత్వ ప్రధాన వ్యూహం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమి కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన ఇప్పటికే పూర్తి కావడంతో, పర్యావరణ అనుమతులు కూడా లభించిన తరుణంలో ప్లాంట్ నిర్మాణ పనులు అతి త్వరలోనే వేగవంతం కానున్నాయి. ఈ ప్లాంట్ నుండి త్వరలోనే ఏపీ మార్క్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు మార్కెట్లోకి దూసుకురానున్నాయి.








