కేవలం $100తో అమెరికాలో ఇంట్లో వాటా.. అమెజాన్ బాస్ పెట్టుబడి పెట్టిన ప్లాట్‌ఫామ్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మామూలుగా రియల్ ఎస్టేట్ అనగానే మన ఆలోచనలు కోట్లలోకి వెళ్లిపోతాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కు ఆ స్దాయి డబ్బు అవసరమన్నది ఇన్నాళ్లూ మన ఆలోచన. కానీ అమెరికాలో ఇప్పుడు ఓ ప్లాట్‌ఫామ్ ఆ లెక్కను మార్చే ప్రయత్నం చేస్తోంది. కేవలం $100తోనే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోకి మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తోంది. అదీ ఆషామాషీ ప్లాట్ ఫామ్ కాదు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పెట్టుబడి పెట్టిన సంస్ద. పిండికొద్ది రొట్టె అన్నట్లు మీరు ఎంత పెట్టుబడి పెట్టగలరో అంతకు తగిన లాభాలు అందిస్తోంది. ఇదేం లెక్క అంటారా? అయితే అసలు మేటర్ లోకి వెళ్లాల్సిందే.
ఆ ప్లాట్ ఫామ్ పేరు Arrived. సాధారణంగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల కోసం భారీ మొత్తంలో డబ్బు అవసరం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద కమర్షియల్ ప్రాపర్టీలు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు వంటి వాటిలో సాధారణ పెట్టుబడిదారులకు అవకాశం తక్కువ. Arrived మాత్రం ఈ విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తోంది.
ఇది ప్రధానంగా సాధారణ పెట్టుబడిదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్. అంటే, భారీ ఆస్తులు కొనడానికి అవసరమైన మూలధనం లేని వ్యక్తులు కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఇక్కడ మీరు మొత్తం ఇంటినే కొనాల్సిన అవసరం లేదు. ఒక ఇంటిలో చిన్న వాటాను (share) కొనుగోలు చేస్తారు.
$100తోనే వ్యాపారంలో వాటా?
మొదట Arrived ఒక ఇంటిని ఎంపిక చేసి కొనుగోలు చేసిన తర్వాత, దానిని ఒక LLC కింద ఏర్పాటు చేస్తుంది. ఆ ఇంటి యాజమాన్యాన్ని చిన్న చిన్న షేర్లుగా విభజిస్తుంది. సాధారణంగా ఒక్క షేర్ ధర $10గా ఉంటుంది. కనీసం $100తో పెట్టుబడి ప్రారంభించవచ్చు.
ఉదాహరణకు ఒక ఇంటి విలువ $300,000 అనుకుందాం. ఆ ఇంటిని మొత్తం కొనడానికి మీ దగ్గర $300,000 ఉండాల్సిన అవసరం లేదు. మీరు మీకు అందుబాటులో ఉన్న మొత్తానికి అనుగుణంగా ఆ ఇంటిలో కొంత భాగాన్ని కొనుగోలు చేయవచ్చు. అంటే.. మీరు ఒక ఇంటికి పూర్తి యజమాని కాకపోయినా, ఆ ఇంటి పెట్టుబడిలో భాగస్వామి అవుతారు.
ఇంటిని ఎవరు చూసుకుంటారు?
ఇక్కడే ఈ విధానం సాధారణ ల్యాండ్లార్డింగ్కి భిన్నంగా ఉంటుంది. మీరు ఇంటిలో పెట్టుబడి పెట్టిన తర్వాత కిరాయిదారులను వెతకడం, అద్దె వసూలు చేయడం, ఇంటి నిర్వహణ, రిపేర్లు, ప్రాపర్టీ మేనేజ్మెంట్ వంటి పనులను మీరు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ బాధ్యతలను Arrived నిర్వహిస్తుంది.
మీరు పెట్టుబడిదారుడిగా మీ వాటాకు సంబంధించిన అద్దె ఆదాయాన్ని పొందుతారు. సాధారణంగా ఈ ఆదాయాన్ని త్రైమాసిక చెల్లింపుల రూపంలో అందిస్తారు. ఇక భవిష్యత్తులో ఆ ఇంటిని విక్రయించినప్పుడు దాని విలువ పెరిగి ఉంటే, వచ్చిన లాభంలో మీ వాటాకు అనుగుణంగా మీకూ ప్రయోజనం దక్కుతుంది.
ఏ ఇంటిలో పెట్టుబడి పెడుతున్నామో తెలుసుకోవచ్చా?
మీరు ఏదో తెలియని ఫండ్‌లో డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్న నిజమైన ఇళ్లను చూడవచ్చు. ప్రతి ప్రాపర్టీకి సంబంధించిన ఫొటోలు, ఫ్లోర్ ప్లాన్, అద్దె ద్వారా వచ్చే ఆదాయ అంచనాలు, ఖర్చులు, పెట్టుబడి వ్యవధి వంటి వివరాలను చూడవచ్చు.
సాధారణంగా ఒక ప్రాపర్టీని సుమారు 5 నుంచి 7 సంవత్సరాల కాలానికి ఉంచే విధంగా ప్రణాళిక ఉంటుంది. అంటే.. షేర్లను కొనుగోలు చేసే ముందు ఆ పెట్టుబడి ఎలా పనిచేస్తుందో అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది.
జెఫ్ బెజోస్ ఎందుకు ఇక్కడికి వచ్చారు?
Arrivedకు సంబంధించిన అతిపెద్ద ఇంట్రస్టింగ్ విషయాల్లో ఇదొకటి. ఈ ఐడియా నచ్చి…అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందిన పెట్టుబడి సంస్థ Bezos Expeditions ఈ ప్లాట్ఫామ్లో పెట్టుబడి పెట్టింది. దీంతో Arrived సాధారణ రియల్ ఎస్టేట్ స్టార్టప్ స్థాయి నుంచి మరింతగా దృష్టిని ఆకర్షించింది.
కంపెనీ ప్రారంభమైన తర్వాత వందలాది ఇళ్లను ఫండ్ చేసినట్లు చెప్తున్నారు. కొన్ని ప్రాపర్టీ లిస్టింగ్‌లు పెట్టుబడిదారుల నుంచి చాలా వేగంగా నిధులను పొందుతున్నాయి. అంటే.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలని కోరుకునే కానీ పెద్ద మొత్తంలో డబ్బు లేని వ్యక్తుల్లో కూడా ఈ విధానంపై ఆసక్తి పెరుగుతోంది.
మరి కంపెనీకి డబ్బు ఎలా వస్తుంది?
ఇలాంటి ప్లాట్‌ఫామ్ ఉచితంగా పనిచేయదు. Arrived వివిధ రకాల ఫీజులను వసూలు చేస్తుంది. ఇందులో ప్రాపర్టీని గుర్తించడం, పరిశీలించడం వంటి పనులకు సంబంధించిన sourcing fee, అలాగే ఆస్తిని నిర్వహించడానికి annual asset management fee ఉంటాయి. ఏ ప్రాపర్టీకి ఎంత ఫీజు ఉంటుందో మారవచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు ఈ వివరాలను వెల్లడిస్తామని కంపెనీ చెబుతోంది.
$100 పెట్టి ఇల్లు కొంటే ఎంత సంపాదించవచ్చు?
దానికి ఒకే సమాధానం ఉండదు. ఎందుకంటే అద్దె ఆదాయం, ఇంటి విలువ, నిర్వహణ ఖర్చులు, ఖాళీగా ఉండే కాలం, మార్కెట్ పరిస్థితులు వంటి అనేక అంశాలపై రాబడి ఆధారపడి ఉంటుంది. బయిటకు వచ్చిన లెక్కలు ప్రకారం, 2024 మొదటి త్రైమాసికంలో పెట్టుబడిదారులకు 352 ప్రాపర్టీల నుంచి మొత్తం $1.1 మిలియన్ డివిడెండ్లు చెల్లించారు. అదే సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఈ మొత్తం $1.84 మిలియన్లకు పెరిగింది. అప్పటికి 365 ఇళ్లు ఆపరేషన్‌లో ఉన్నాయని తెలుస్తోంది.
అదే సమయంలో ప్రాపర్టీల స్థిరీకృత ఆక్యుపెన్సీ రేటు 92 శాతంగా ఉందని, కొత్త లీజుల్లో సగానికి పైగా అంచనా వేసిన అద్దె కంటే ఎక్కువకు కుదిరాయని పేర్కొంది. అయితే ఇవి గత పనితీరు గణాంకాలు మాత్రమే. భవిష్యత్తులో ఇదే రాబడి వస్తుందని హామీ కాదు.
కేవలం ఇళ్లేనా?
కాదు. Arrived తర్వాత కాలంలో వెకేషన్ రెంటల్స్‌తో పాటు ఇతర రియల్ ఎస్టేట్ సంబంధిత ఫండ్లను కూడా అందించడం ప్రారంభించింది. Single Family Residential Fund, Private Credit Fund వంటి ఎంపికలు కూడా పెట్టుబడిదారులకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఒకే ఇంటిపై ఆధారపడకుండా వివిధ రకాల ఆస్తుల్లో పెట్టుబడులను విభజించుకునే అవకాశం ఏర్పడుతోంది.
కొత్తవాళ్లకు ఎంత సులభం?
రియల్ ఎస్టేట్‌లో అనుభవం లేని వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని ప్లాట్‌ఫామ్‌ను రూపొందించినట్లు Arrived చెబుతోంది. కొత్త పెట్టుబడిదారుల కోసం వెబినార్లు, లైవ్ Q&A సెషన్లు, సహాయ కేంద్రం, వివరణాత్మక గైడ్లు అందుబాటులో ఉంటాయి.
అంటే రియల్ ఎస్టేట్ గురించి పెద్దగా తెలియని వ్యక్తి కూడా ముందుగా సమాచారాన్ని తెలుసుకుని ఆ తర్వాత పెట్టుబడి పెట్టవచ్చు.
కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి
$100తో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు అంటే రిస్క్ ఉండదని కాదు. ఇంటి విలువ తగ్గవచ్చు. అద్దె రాకపోవచ్చు. ప్రాపర్టీ ఖాళీగా ఉండవచ్చు. నిర్వహణ ఖర్చులు పెరగవచ్చు. పెట్టుబడిని వెంటనే నగదుగా మార్చుకోవడం కూడా సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల దీన్ని బ్యాంక్ డిపాజిట్లా లేదా గ్యారంటీడ్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్లా చూడకూడదు.
ఫైనల్ గా..
Arrived వంటి ప్లాట్‌ఫామ్‌లు తీసుకొస్తున్న అసలు మార్పు “ఇల్లు కొనడం” కాదు.. “ఇంటి యాజమాన్యంలో చిన్న భాగాన్ని కొనడం.” గతంలో రియల్ ఎస్టేట్ అంటే పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నవారికే అందుబాటులో ఉండే ఆస్తి. ఇప్పుడు టెక్నాలజీ, fractional ownership వంటి విధానాల కారణంగా ఆ యాజమాన్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి ఎక్కువ మందికి అందించే ప్రయత్నం జరుగుతోంది. అందులోనూ జెఫ్ బెజోస్ పెట్టుబడి పెట్టడంతో ఈ ప్లాట్‌ఫామ్‌పై ఆసక్తి పెరుగుతోంది.








