కేబీఆర్ ఫ్లైఓవర్ వివాదం.. రాజకీయ రగడ!
హైదరాబాద్ లో ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అంతకుముంది బీఆర్ఎస్ హయాంలో కూడా ఇందుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు జరిగాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టును ఆమోదించి పనులు కూడా ప్రారంభించింది. అయితే ఇప్పుడు కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కన పెట్టింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వరకు ఏకైక ఎలివేటెడ్ కారిడార్, అండర్‌పాస్‌లతో కూడిన కొత్త డిజైన్‌ను తెరపైకి తెచ్చింది. ఇది వివాదాలకు కారణమవుతోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడేళ్ల పాటు సుదీర్ఘ అధ్యయనాలు, కోట్లాది రూపాయల ఖర్చుతో హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ తయారైంది. అయితే ఈ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. రూ.1,090 కోట్ల అంచనా వ్యయంతో ఉన్న ఈ ప్రాజెక్టును రద్దు చేసి, కొత్త డిజైన్లను తెరపైకి తెచ్చింది. నెల రోజుల్లోనే విభిన్న నిర్ణయాలు తీసుకోవడం అనేక విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టర్లు కొంతమేర పనులు కూడా ప్రారంభించారు. దాదాపు రూ.300 కోట్ల రూపాయల పనులు పూర్తయినట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో పాత టెండర్లు రద్దు చేసి కొత్త డిజైన్లకు వెళ్లడం ప్రభుత్వ అనాలోచిత విధానాలకు నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తాజా నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి రూ.1,200 కోట్లు ఆదా అవుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే అదే సమయంలో ఇప్పటికే వ్యయం చేసిన ప్రజాధనం బూడిదలో పన్నీరవుతుంది. ట్రాఫిక్ స్టడీస్ నిర్వహించకుండా, పాత ప్రాజెక్టుతో ఉన్న గ్రీనరీని, పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసేలా కొత్త ప్రతిపాదనలు ఉండటం పట్ల పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న వందేళ్ల నాటి వృక్షాలను తొలగించడం ద్వారా నగర కాలుష్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా చేసేందుకే, ప్రతిపాదిత ప్రాజెక్టులకు స్వస్తి చెప్పారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తమ పార్టీకి పేరు వస్తుందనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శిస్తోంది. అదే సమయంలో బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొడుతోంది. ప్రణాళికా లోపం, పారదర్శకత లేకపోవడం వల్ల నగర ప్రజలపై అదనపు భారం పడుతోందని.. అందుకే అతి తక్కువ వ్యయంతో కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చినట్లు చెప్తోంది.








