Trump ఒక్క మాట.. వేలాది వెబ్సైట్లు బుకింగ్ వేట! కోట్ల బిజినెస్ కి బాట!!
డొనాల్డ్ ట్రంప్ నోటి నుంచి ఒక్క మాట వస్తే చాలు, ప్రపంచంలో ఏ మూల తుఫాన్ వస్తుందో అన్నట్లు ఉంది బయిట పరిస్దితి! అయితే ప్రతీ సారి ఆయన మాటలకు టెన్షన్ పడాల్సిన పనిలేదు. కొన్నిసార్లు కోట్లకొద్ది బిజినెస్ కు దారి చూపించవచ్చు. అలాగే ఈసారి ఆయన విసిరిన ఒకే ఒక్క పదం, ఇంటర్నెట్ మార్కెట్లో ఊహించని తుఫాను సృష్టించింది.
అదేంటి అంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అని పిలవడం మానేసి, ఇకపై దానిని “సూపర్ ఇంటెలిజెన్స్” (SI) అని పిలవాలని ట్రంప్ ఒక చిన్న సలహా ఇచ్చారు. అంతే, డిజిటల్ బిజినెస్ ఒక్కసారిగా పీక్స్‌కు వెళ్ళిపోయింది. భవిష్యత్తులో ఈ ‘SI’ అనే పదానికి విపరీతమైన డిమాండ్ వస్తుందని అంచనా వేసిన జనాలు, వెంటనే పొలోమంటూ వెబ్సైట్ అడ్రస్‌లు రిజిస్టర్ చేసుకోవడం మొదలుపెట్టారు. నిన్నటిదాకా ఎవరూ పెద్దగా పట్టించుకోని కొన్ని వెబ్ సైట్లు, ఇప్పుడు డిజిటల్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఒక్క నెలలోనే రికార్డు స్థాయి బుకింగ్స్!
ఈ డొమైన్ పిచ్చి ఎంతలా ముదిరిందో స్లోవేనియా దేశం చెప్తున్న లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అక్కడ డొమైన్లు నిర్వహించే ‘Register.si’ ప్రతినిధులు చెప్పిన దాని ప్రకారం, ఆగస్టు నెలలో కేవలం మూడున్నర వేల .si డొమైన్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అయితే ట్రంప్ ప్రకటన రాగానే సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య ఏకంగా 46 వేలకు పైగా దాటేసింది.
అంటే ఒక్క నెలలోనే ఏకంగా 2,100 శాతానికి పైగా నమోదులు పెరిగాయి. ఒకానొక రోజు అయితే ఏకంగా 12 వేలకు పైగా డొమైన్లను జనాలు పోటీపడి కొనేశారు. ఈ రేంజ్ రష్ చూసి అక్కడి రిజిస్ట్రీ వర్గాలు కూడా అవాక్కవుతున్నాయి.
ఇంతకీ ట్రంప్ ఏం చెప్పారు?
సంగతేంటంటే, ఐక్యరాజ్యసమితి సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, “ఆర్టిఫిషియల్” అనే పదం వింటే ఏదో డూప్లికేట్ లేదా నకిలీ వస్తువులా అనిపిస్తోందని, అందుకే AIకి బదులుగా “సూపర్ ఇంటెలిజెన్స్” (SI) అని పిలిస్తే గంభీరంగా ఉంటుందని చెప్పారు. అంతకంటే ముందే తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్, సుప్రీమ్ ఇంటెలిజెన్స్ వంటి రకరకాల పేర్లతో ఒక పోల్ కూడా పెట్టారు. చివరికి సెప్టెంబర్ మూడో వారంలో “AI లేదా SI” అనే పదాలు వాడతానని స్పష్టం చేయడంతో, బిజినెస్ మైండ్ ఉన్నవాళ్లందరి కళ్లూ ఒకేసారి డొమైన్ మార్కెట్ వైపు పడ్డాయి.
ట్రంప్ మాటకు స్లోవేనియా డొమైన్‌కు సంబంధం ఏంటి?
ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది! సాధారణంగా .si అనేది స్లోవేనియా దేశానికి చెందిన ఇంటర్నెట్ కంట్రీ కోడ్. ట్రంప్ ప్రచారంలోకి తెచ్చిన ‘Super Intelligence’ షార్ట్‌ఫామ్ కూడా SI కావడంతో, ఈ స్లోవేనియా .si డొమైన్‌కు ఉన్నట్టుండి బంపర్ ఆఫర్ తగిలింది.
పైగా ట్రంప్ సతీమణి మెలానియా పుట్టిన ఊరు కూడా స్లోవేనియాలోనే ఉండటంతో, జనాలు దీనిని ఆమెకు లింక్ చేస్తూ మరింత కథలు అల్లేస్తున్నారు. అయితే నిజానికి అంతర్జాతీయ డొమైన్ కేటాయింపుల్లో సియెర్రా లియోన్ దేశానికి ‘SL’ వెళ్లిపోవడంతో, స్లోవేనియాకు అనుకోకుండా ‘SI’ లభించింది. దానికి, మెలానియాకి ఎలాంటి సంబంధం లేకపోయినా, ఈ అనుకోని యాదృచ్ఛికత ఇప్పుడు మార్కెట్లో భలే క్రేజ్ తెచ్చిపెట్టింది.
కనీస పెట్టుబడితో కోట్ల వ్యాపారం!
జనాలు ఈ డొమైన్లను కేవలం సరదా కోసం రిజిస్టర్ చేసుకోవడం లేదు, దీని వెనుక పెద్ద వ్యాపార వ్యూహమే ఉంది. మున్ముందు రోజుల్లో టెక్ కంపెనీలన్నీ AI స్థానంలో SI అని వాడటం మొదలుపెడితే, ఈ రోజు తక్కువ ధరకు కొన్న ‘SI’ డొమైన్ల విలువ రేపు ఆకాశాన్ని తాకుతుందని ఇన్వెస్టర్లు బెట్టింగ్ కాస్తున్నారు.
తక్కువలో కొని, డిమాండ్ వచ్చాక భారీ ధరకు అమ్మేయడమే వీరి ప్లాన్. గతంలో కరీబియన్ దీవైన ‘అంగ్విల్లా’కు చెందిన .ai డొమైన్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా పెరిగాక, కేవలం ఈ .ai డొమైన్ల అమ్మకాల వల్లే ఆ చిన్న దేశానికి ఏకంగా 32 మిలియన్ డాలర్ల రాబడి వచ్చింది. ఇప్పుడు .si విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని చాలామంది ఆశపడుతున్నారు.
స్లోవేనియా ఖజానాకు కాసుల వర్షం!
ఈ క్రేజ్ వల్ల స్లోవేనియా రిజిస్ట్రీకి కూడా బాగానే అదనపు ఆదాయం సమకూరింది. ప్రతీ డొమైన్ రిజిస్ట్రేషన్‌కు సుమారు 10 యూరోలు వసూలు చేయడంతో, ఒక్క సెప్టెంబర్ నెలలోనే దాదాపు 4.6 లక్షల యూరోల బిజినెస్ జరిగింది.
అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం తమకు వందల కోట్లు ఏమీ రావడం లేదని, ఇవన్నీ మీడియా సృష్టిస్తున్న అంచనాలేనని అక్కడి అధికారులు కాస్త తగ్గించి చెప్తున్నారు. ఏది ఏమైనా, అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా ప్రకారం స్లోవేనియా ప్రభుత్వానికి ఈ ఒక్క నెలలోనే కనీసం 3 లక్షల యూరోల దాకా అదనపు లాభం వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
టెక్ ప్రపంచం ట్రంప్ మాట వింటుందా?
అయితే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అమెరికా ప్రభుత్వంలో లేదా ట్రంప్ మాటల్లో ‘Super Intelligence’ అనే పదం వాడితే వాడొచ్చు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలు, పరిశోధకులు ఏళ్లుగా వాడుకలో ఉన్న ‘AI’ పదాన్ని అంత తేలిగ్గా పక్కన పడేస్తారా అనేది పెద్ద ప్రశ్న. ప్రపంచం మొత్తం ఈ కొత్త పదాన్ని అంగీకరిస్తే సరేసరి, లేదంటే ఈ డొమైన్లు కొన్నవాళ్ల ఆశలన్నీ అడియాసలు అయ్యే ప్రమాదం కూడా ఉంది.
ట్రంప్ విసిరిన ఒక్క మాటతో ఇంటర్నెట్లో మరో డిజిటల్ గోల్డ్ రష్ అయితే మొదలైంది. మరి ఈ రోజు కొద్ది యూరోలతో కొంటున్న ఈ వెబ్ అడ్రస్‌లు భవిష్యత్తులో కోట్ల విలువ చేసే ఆస్తులుగా మారతాయా లేక ఇది కేవలం ట్రంప్ మాటల చుట్టూ తిరిగే తాత్కాలిక హడావుడేనా అనేది కాలమే నిర్ణయించాలి!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








