అమెరికా ప్రముఖ సింగర్‌తో ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ నిశ్చితార్థం
అమెరికాలోని ప్రముఖ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేయనున్నారు. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న కంట్రీ మ్యూజిక్ గాయని, రాజకీయ విశ్లేషకురాలిగా గుర్తింపు పొందిన అలెక్సిస్ విల్కిన్స్తో ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఈ జంట సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది.
27 ఏళ్ల అలెక్సిస్ విల్కిన్స్ డైమండ్ ఉంగరాన్ని ప్రదర్శిస్తూ, 46 ఏళ్ల కాష్ పటేల్‌తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకోగా, పటేల్ దానిని రీపోస్ట్ చేశారు. నాష్‌విల్లేలో 2022లో ఒక మిత్రుడి వేడుకలో కలుసుకున్న వీరిద్దరూ, ఆ మరుసటి సంవత్సరం నుంచి డేటింగ్లో ఉన్నారు. 2025 ఫిబ్రవరిలో కాష్ పటేల్ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వీరి రిలేషన్‌షిప్‌నకు సంబంధించిన వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.
విమర్శలు…
వీరిద్దరి బంధం గతంలో కొన్ని వివాదాలకు కూడా కేంద్రబిందువుగా ఉండేది. ప్రభుత్వ విమానాల వ్యక్తిగత వాడకంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. గత ఏడాది మే నెలలో వాషింగ్టన్ నుంచి ఫిలడెల్ఫియాకు ఎఫ్‌బీఐ విమానంలో ప్రయాణించి ఒక మ్యూజిక్ కాన్సర్ట్‌కు హాజరయ్యారని, అలాగే నవంబర్ 2025లో పెన్ స్టేట్ యూనివర్సిటీలో జరిగిన విల్కిన్స్ షోకు వెళ్లేందుకు కూడా అధికారిక విమానాన్ని వాడారనే ఆరోపణలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి
ఈ విమర్శలను ఎఫ్‌బీఐ, కాష్ పటేల్ తీవ్రంగా తిప్పికొట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా వ్యక్తిగత ప్రయాణాల్లోనూ ఎఫ్‌బీఐ చీఫ్ అధికారిక విమానాలను ఉపయోగించాల్సి ఉంటుందని, నిబంధనల ప్రకారం ముందుగానే ప్రభుత్వానికి డబ్బులు రీయింబర్స్ చేస్తున్నామని స్పష్టం చేశారు. తన భాగస్వామిపై వస్తున్న నిరాధార ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, ఆమెను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని కాష్ పటేల్ ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు.








