ప్రమాదంలో రామప్ప ఆలయం..!?
కాకతీయ శిల్పకళా వైభవానికి ప్రతీక అయిన రామప్ప ఆలయం చుట్టూ ఇప్పుడు రాజకీయ వేడి రాజుకుంది. ములుగు జిల్లాలోని ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశానికి సమీపంలో సింగరేణి సంస్థ ప్రతిపాదించిన ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు.. ఉపాధి, ఇంధన వనరుల పేరుతో పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాకతీయుల కాలం నాటి అద్భుతమైన శిల్ప సంపద, రామప్ప చెరువు అందాలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలు. అలాంటి పవిత్ర ప్రాంతంలో బొగ్గు వెలికితీత పేరుతో బ్లాస్టింగ్, తవ్వకాలు జరిపితే, భూగర్భ జలాలు దెబ్బతినడమే కాక, శిల్పాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పురావస్తు నిపుణులు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలను సింగరేణి యాజమాన్యం ఖండించింది. పురావస్తు శాఖ, ఇతర శాస్త్రీయ నిపుణుల సమగ్ర అధ్యయనం తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని, చట్టబద్ధమైన పద్ధతుల్లోనే మైనింగ్ సాగుతుందని సింగరేణి స్పష్టం చేసింది. ఆలయానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని యాజమాన్యం చెబుతున్నప్పటికీ… ప్రజల్లో, ప్రతిపక్షాల్లో అనుమానాలు మాత్రం తొలగిపోలేదు.
ఈ అంశం ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చారిత్రక సంపదను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో పారిశ్రామిక లాభాల కోసం ప్రసిద్ధ పర్యాటక, వారసత్వ ప్రదేశాలను బలిపెడుతున్నారని మండిపడ్డారు. వెంకటాపురం ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
మరోవైపు.. అధికార పార్టీ నాయకులు ఈ విమర్శలను తిప్పకొడుతున్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే బీఆర్ఎస్ లేనిపోని అపోలను సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు. ఉపాధి అవకాశాలు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇంధన వనరులు ఎంతో కీలకమని, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అధికార వర్గాలు వాదిస్తున్నాయి. శాస్త్రీయ అధ్యయన నివేదికలు అనుకూలంగా వస్తేనే ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందని స్పష్టం చేస్తున్నాయి.
ఒకవైపు తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం.., మరోవైపు పారిశ్రామిక, ఆర్థిక అవసరాలు… ఈ రెండింటి మధ్య తలెత్తిన ఈ ఘర్షణ రాజకీయ పోరుకు దారితీసేలా ఉంది. రామప్ప ఆలయం కేవలం ఒక పవిత్ర ప్రదేశమే కాదు.. తెలుగు జాతి గర్వించదగ్గ చారిత్రక చిహ్నం. కాబట్టి, రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శల కంటే భవిష్యత్ తరాల కోసం ఈ అపురూప కట్టడాన్ని పరిరక్షించడమే అన్నింటికంటే ముఖ్యమని మేధావులు అభిప్రాయపడుతున్నారు.








