వెంకట్ నాగం గారి “కలగూరగంప”, “రచ్చబండ చర్చలు” పుస్తకాలపై సమీక్షా అభినందనలు
మృత్యుంజయుడు తాటిపాముల
(రచయిత – సిలికాన్ వ్యాలీ, అమెరికా, పూర్వ ప్రధాన సంపాదకులు – సిలికానాంధ్ర సుజనరంజని అంతర్జాల మాసపత్రిక)
పుస్తకాల పేర్లు: “కలగూరగంప” వ్యాస సంపుటి, “రచ్చబండ చర్చలు”
రచయిత పేరు: వెంకట్ నాగం
ప్రచురణకర్త: వంగూరి ఫౌండేషన్
ధర: రూ. 100/- “కలగూరగంప”, రూ. 400/- “రచ్చబండ చర్చలు”
పుస్తక ఉద్దేశ్యం: సాహిత్య, సామాజిక, చారిత్రక మరియు సమకాలీన అంశాలపై రచయిత నిశిత దృష్టికోణాన్ని, లోతైన ఆలోచనలను ప్రతిబింబించే విశ్లేషణాత్మక వ్యాసాల సంపుటి.
సమీక్షకులు: మృత్యుంజయుడు తాటిపాముల (సిలికాన్ వ్యాలీ, అమెరికా, పూర్వ ప్రధాన సంపాదకులు – సిలికానాంధ్ర సుజనరంజని అంతర్జాల మాసపత్రిక)
పుస్తకాల లభ్యత: వెంకట్ నాగం గారు రచించిన రెండు పుస్తకాలు: “కలగూరగంప” వ్యాస సంపుటి మరియూ “రచ్చబండ చర్చలు”
‘అచ్చంగా తెలుగు’ మరియు ‘నవోదయ’ వెబ్సైట్లలో సాహితీ ప్రియులకు అందుబాటులో ఉన్నాయి.
పుస్తక సమీక్ష:
అందరికీ నమస్కారమండి. మిత్రులు వెంకట్ నాగం గారు రచించిన ఈ రెండు విశిష్ట పుస్తకాలను నేను ఒక పది రోజుల క్రితమే అందుకున్నాను. ఇటీవల సెప్టెంబర్ 27, 2026న నిర్వహించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక 96వ అంతర్జాల సదస్సు ఒక అద్భుతమైన సాహితీ సదస్సుగా నిలిచింది. ఆ సాహిత్య వేదికలో భాగంగా జరిగిన ఈ విశిష్ట గ్రంథావిష్కరణ మహోత్సవంలో నేను పాలుపంచుకోవడం, ఈ రెండు అద్భుతమైన పుస్తకాల ఆవిష్కరణలో భాగస్వామిని కావడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది.
ముఖ్యంగా రచయిత వెంకట్ నాగం గారి గురించి చెప్పాలంటే, మేము ఉండేది సిలికాన్ వ్యాలీ, బే ఏరియాలో, మాకు రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న శాక్రమెంటోలో వారు ఉంటారు. వారు కేవలం ఒక సాహితీవేత్త మాత్రమే కాదు; శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) యొక్క ‘శాక్రమెంటో తెలుగు వెలుగు’ అంతర్జాల సంచికకు గౌరవ సంపాదకులుగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. నేను కూడా సిలికానాంధ్ర ‘సుజనరంజని’ పత్రికకు దాదాపు 16 సంవత్సరాల పాటు సంపాదకత్వం వహించాను. ఆ పత్రికా ప్రయాణంలోనే మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. వారు కథల పోటీలు నిర్వహించేవారు, స్వయంగా కథలు రాసేవారు మరియు మా సుజనరంజని పత్రికకు కూడా తమ రచనలను పంపించేవారు. అలాగే వారి సంచికలో రచనల కోసం గానీ, నిర్వహించే పోటీల కోసం గానీ నా వంతు సహాయ సహకారాలను వారు ఎంతో ఆత్మీయంగా తీసుకునేవారు.
పుస్తకాల విశిష్టత మరియు విషయ వైవిధ్యం:
ఈ మధ్య కాలంలో వారు ఏకకాలంలో ఈ రెండు పుస్తకాలను ప్రచురించి, అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఆవిష్కరణలు చేయడం నన్ను ఎంతో ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. తానా 96వ సాహిత్య సదస్సులో ఈ పుస్తకాల ఆవిష్కరణ అనగానే, “ఆ రెండు పుస్తకాలు నాకు పంపించండి, నేను చదువుతాను” అని అన్నాను.
పుస్తకాలు వచ్చిన తర్వాత వాటిని ఆద్యంతం చదివిన నాకు, వెంకట్ నాగం గారిలోని మరొక అద్భుతమైన ప్రతిభ పరిచయమైంది. సాధారణంగా మేము కలిసినప్పుడు పత్రికల గురించో, సాహిత్య విశేషాల గురించో మాట్లాడుకునేవాళ్లం. కానీ, ఈ రెండు పుస్తకాల్లో వారు ఎంచుకున్న అంశాలలో ఎంతటి వైవిధ్యం ఉందంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది!
వారు ప్రవాసంలో (అమెరికాలో) ఉంటూ, అక్కడి ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న హెచ్1-బి (H1-B) వీసా సమస్యలు, అక్కడ అప్పుడప్పుడు తలెత్తే జాతి వివక్షత మరియు దానికి సంబంధించిన క్లిష్టమైన సామాజిక అంశాలను ఎంతో నిశితంగా చర్చించారు. అదే సమయంలో, ఇటు భారతదేశంలో అత్యంత వైభవంగా జరిగిన అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన, దాని వెనుక ఉన్న సుదీర్ఘమైన చారిత్రక నేపథ్యం ఏమిటనే అంశాలను అద్భుతంగా విశ్లేషించారు. అక్కడితో ఆగకుండా, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలైన డాలర్ విలువ పతనం గురించి, అలాగే ఆధ్యాత్మిక విషయాలైన అన్నమయ్య కీర్తనలలో దాగి ఉన్న పదాల సాహిత్య దర్శనం మరియు అందులోని వైవిధ్యం గురించి ఈ రెండు పుస్తకాలలో ఎంతో ప్రతిభావంతంగా, విశ్లేషనాత్మకంగా రాశారు.
విశ్లేషణాత్మక శైలి మరియు ముగింపు:
వెంకట్ నాగం గారు ఏదైనా విషయాన్ని ఎంచుకున్నారంటే, దానిని ఏదో పైపైన చుట్టేయరు. ఆ అంశానికి అవసరమైన చోటల్లా సామెతలను, చక్కటి సంస్కృత శ్లోకాలను జోడిస్తూ, పురాణాలలో చెప్పబడిన సత్యాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత సమాజ పరిస్థితులకు అన్వయిస్తారు. కేవలం సమస్యలను ఎత్తిచూపడమే కాకుండా, ఆయా సమస్యలకు సరైన పరిష్కారం ఏమిటనే దిశగా పాఠకుడిలో ఆలోచనలు రేకెత్తించే విధంగా వారి వ్యాస రచన సాగుతుంది.
అందుకే ఈ పుస్తకాలకు వారు పెట్టిన “కలగూరగంప”, “రచ్చబండ చర్చలు” అనే శీర్షికలు వందకు వంద శాతం సార్థకతను సంతరించుకున్నాయి. ఈ రెండు పుస్తకాలు ‘అచ్చంగా తెలుగు’ మరియు ‘నవోదయ’ వెబ్సైట్లలో పుస్తక ప్రియులకు అందుబాటులో ఉన్నాయి. సాహిత్య లోకానికి, సాహితీ ప్రియులకు ఎంతో ఉపయోగకరమైన ఇటువంటి మరిన్ని ఉత్తమ గ్రంథాలు వెంకట్ నాగం గారి కలం నుండి రావాలని ఆకాంక్షిస్తూ, వారికి అభినందనలు తెలియజేస్తూ, వారి తదుపరి పుస్తకం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ధన్యవాదాలు.









