అమెరికా ‘దివాళా’ తీస్తోందా? ఎలాన్ మస్క్ హెచ్చరిక వెనక అసలు నిజం ఏమిటి?
మొదటి నుంచీ ఎలాన్ మస్క్‌కి ఒక ప్రత్యేకత ఉంది. ఇతరులు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నప్పుడు.. తాను ఆ భవిష్యత్తును తయారు చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఎలక్ట్రిక్ కార్ల నుంచి అంతరిక్ష ప్రయాణం వరకు ఆయన చేసిన ప్రయోగాలు అందుకు ఉదాహరణ. అందుకే అమెరికా ఆర్థిక భవిష్యత్తుపై ఆయన చేసిన హెచ్చరికను కూడా మార్కెట్లు, టెక్ ప్రపంచం, పెట్టుబడిదారులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. “ అమెరికా దివాళా తీసే అవకాసం ఉంది” అని చెప్పినప్పుడు అది సాధారణ కామెంట్‌గా మిగలలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది.
మస్క్ చెప్పింది నిజంగా అమెరికా రేపే దివాళా తీస్తుందన్న హెచ్చరికేనా? లేక భారీగా పెరుగుతున్న అప్పులు, వడ్డీ భారం, బడ్జెట్ లోటు గురించి ఆయన చెబుతున్న అసలు సమస్యను మనం మరో కోణంలో చూడాలనా?
మస్క్ అసలు ఏం చెప్పారు? ఆయన భయం ఏమిటి?
డ్వార్కేష్ పోడ్కాస్ట్లో అమెరికా జాతీయ రుణం గురించి మాట్లాడినప్పుడు మస్క్ ఈ తీవ్రమైన హెచ్చరిక చేశారు. AI, రోబోటిక్స్ సాంకేతికతలు గనుక లేకపోతే అమెరికా ఆర్థికంగా తీవ్ర చిక్కుల్లో పడుతుందని, అప్పుల ఊబి నుంచి గట్టెక్కడానికి ఇవి తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.
అయితే మస్క్ మాటల అంతరార్థం “అమెరికా దగ్గర రూపాయి (డాలర్) కూడా లేకుండా పోయింది” అని కాదు; పెరుగుతున్న అప్పుల వేగాన్ని దేశ ఆర్థిక వృద్ధి దాటలేకపోతే అసలు సమస్య మొదలవుతుందనేదే ఆయన ఆందోళన. అమెరికా ఇప్పటికే అప్పులపై చెల్లిస్తున్న వడ్డీ ఖర్చు రికార్డు స్థాయికి చేరడమే ఈ భయానికి ప్రధాన కారణం.
అంకెల వెనుక దాగున్న అప్పుల తీవ్రత
అమెరికా జాతీయ రుణం ఇప్పటికే 40 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్థిక విధానాలు దీర్ఘకాలంలో స్థిరంగా కొనసాగలేవని, రుణం-జీడీపీ నిష్పత్తి భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుందని అమెరికా ట్రెజరీ స్వయంగా అంగీకరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
అసలు ప్రమాదం అప్పుతో కాదు.. పెరుగుతున్న వడ్డీతోనే!
ఇక్కడ అసలు సమస్య అప్పు చేయడం మాత్రమే కాదు, దానిపై చెల్లిస్తున్న వడ్డీ భారం ఏటికేటా కొండలా పెరిగిపోవడం. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం కేవలం అప్పులపై వడ్డీ చెల్లించడానికే ఏడాదికి సుమారు 1 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. అంటే ప్రభుత్వం సేకరించే ప్రతి ఐదు డాలర్ల ఆదాయంలో దాదాపు ఒక డాలర్ కేవలం వడ్డీలకే సరిపోతోంది. “అప్పు చేసి పప్పు కూడు తిన్నంత కాలం బాగానే ఉన్నా, అసలు కంటే వడ్డీయే ఎక్కువైనప్పుడు” అసలు కథ మొదలవుతుంది. అమెరికా విషయంలో సరిగ్గా ఇదే జరుగుతుండటంతో ఆర్థిక నిపుణులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా నిజంగానే దివాళా తీస్తుందా?
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆమోదయోగ్యమైన ‘రిజర్వ్ కరెన్సీ’ అయిన డాలర్‌ను ముద్రించే అధికారం అమెరికాకు ఉంది. కాబట్టి దేశం పూర్తిగా దివాళా తీసి, మూతపడిపోతుందనే కోణంలో మస్క్ వ్యాఖ్యలను చూడలేం. కానీ, పెరుగుతున్న అప్పుల వల్ల వడ్డీ భారం పెరిగి, దానికోసం మరింత అప్పు చేయాల్సి రావడం, దానివల్ల మార్కెట్లో వడ్డీ రేట్లు మరింత పెరిగిపోవడం లాంటి ‘డెట్ స్పైరల్’ (రుణ విషవలయం) ఏర్పడే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. దిగ్గజ ఆర్థికవేత్త రే డాలియో, జేపీ మోర్గాన్ సీఈఓ జేమీ డైమన్ వంటి వారు కూడా ఇదే రుణ విషవలయం గురించి అమెరికాను హెచ్చరించడం గమనార్హం.
AI, రోబోటిక్స్ మస్క్‌కు ఎలా పరిష్కారంగా కనిపిస్తున్నాయి?
అప్పుల సుడిగుండం నుంచి బయటపడటానికి ఏ దేశానికైనా రెండే మార్గాలుంటాయి: ఒకటి ఖర్చులు తగ్గించుకోవడం, రెండు ఆర్థిక వ్యవస్థను వేగంగా పెంచడం. మస్క్ రెండవ మార్గాన్ని ఎంచుకున్నారు. AI, రోబోటిక్స్ రంగాల వల్ల మానవ ఉత్పాదకత పదింతలు పెరిగితే, వస్తువులు, సేవల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరిగి, ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ ఆదాయం వస్తుంది.
ఫలితంగా అప్పు-జీడీపీ నిష్పత్తి తగ్గుతుందని మస్క్ భావిస్తున్నారు. ఆయన ఆలోచనలో రోబోట్ అనేది కేవలం ఒక యంత్రం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీగెత్తించే గ్రోత్ ఇంజిన్. అయితే, AI అంత త్వరగా అంతటి ఉత్పాదకతను సాధించగలదా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.
ఇది భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
అమెరికాలో పెద్ద ఆర్థిక సంక్షోభం తలెత్తితే అది వారి సొంత సమస్య మాత్రమే కాదని, గ్లోబల్ ఎకానమీలో భాగంగా భారత్‌పై కూడా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని మనం గ్రహించాలి. అమెరికా బాండ్ యీల్డ్స్ పెరిగితే విదేశీ పెట్టుబడిదారులు భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి తమ డబ్బును ఉపసంహరించుకుని అమెరికా ఆస్తుల్లో పెట్టుబడి పెడతారు. దీనివల్ల భారత స్టాక్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు రావడమే కాకుండా రూపాయి విలువ పడిపోయే అవకాశం ఉంది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడితే మన దిగుమతుల ఖర్చు భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా భారత్ అత్యధికంగా దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు రవాణా ఖర్చులు ప్రియమవుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగి హైదరాబాద్‌లో ఉండే ఒక సామాన్య కుటుంబం నెలవారీ బడ్జెట్‌పై నేరుగా ప్రభావం పడుతుంది.
అదే సమయంలో, భారతీయ ఐటీ రంగానికి ఇది రెండు రకాల పరిణామాలను తెచ్చిపెట్టవచ్చు. ఒకవైపు అమెరికా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రాజెక్టులను కుదిస్తే ఐటీ అవుట్‌సోర్సింగ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు, తమ ఖర్చులను వేగంగా తగ్గించుకోవడానికి వారు AI ని ఆశ్రయిస్తే, మన ఐటీ కంపెనీలకు సరికొత్త అవకాశాలు తలుపు తడతాయి.
ముగింపు
మొత్తానికి, మస్క్ చెప్పినట్లుగా అమెరికా వెంటనే దివాళా తీయకపోవచ్చు కానీ, పెరుగుతున్న అప్పులు మరియు వడ్డీ భారం నిజంగానే ఆ దేశానికి పెద్ద తలనొప్పిగా మారాయి. మస్క్ హెచ్చరికలో కొంత అతిశయోక్తి ఉన్నప్పటికీ, అమెరికా అప్పుల సమస్యను ప్రపంచం ఇక ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయలేదనేది పచ్చి నిజం.
అందుకే ఇప్పుడు ఆలోచించాల్సింది “అమెరికా దివాళా తీస్తుందా,లేదా?” అని కానే కాదు, పెరుగుతున్న అప్పుల భారం కంటే వేగంగా, AI సాయంతో అమెరికా తన ఆర్థిక వ్యవస్థను పరుగులు తీగెత్తించగలదా లేదా అనేదే! దీనికి కాలమే సమాధానం చెప్పాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








