మంత్రి లోకేశ్‌ను కలిసిన స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ.. అండగా ఉంటామని భరోసా
మంత్రి లోకేష్‌ను కలిసిన ప్రఖ్యాత ఆర్చర్ జ్యోతి సురేఖ
ఏషియన్ గేమ్స్-2026లో స్వర్ణపతకం సాధించిన సురేఖను అభినందించిన లోకేష్
అమరావతి: జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్-2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ప్రఖ్యాత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ, తండ్రి సురేంద్రకుమార్ సోమవారం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఏషియన్ గేమ్స్ లో ఇప్పటివరకు నాలుగు గోల్డ్ మెడల్స్ సహా ఆరు పతకాలు సాధించిన సురేఖ చరిత్ర సృష్టించారు. ఏషియన్ గేమ్స్ లో తన ప్రతిభతో స్వర్ణం కైవసం చేసుకున్న జ్యోతి సురేఖను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. 2028 ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.








