అమెరికాకి వెళ్లాక వీసా స్టేటస్ మార్చుకోవచ్చా? తప్పక తెలుసుకోవాల్సిన US Immigration Rules
అమెరికా వీసా చేతిలో ఉందని అక్కడ ఏదైనా చేసేయొచ్చా? అసలు మీ స్టేటస్‌ను నిర్ణయించేది వీసా కాదంటే నమ్ముతారా? భారతీయులు తప్పక తెలుసుకోవాల్సిన ఓ కీలక రూల్ ఉంది. అదేంటో చూద్దాం.
అమెరికాలో దిగాక ప్లాన్ మారితే ఏం చేయాలి?
అమెరికా వెళ్లిన తర్వాత అక్కడ వీసా స్టేటస్ మార్చుకోవచ్చా? ఈ ప్రశ్న చాలామంది భారతీయుల మనసులో నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. అక్కడికి టూరిస్ట్‌గా వెళ్లిన తర్వాత చదువుకోవాలనిపించినా, లేదా మరొక నాన్-ఇమ్మిగ్రెంట్ కేటగిరీకి మారాలనిపించినా వెంటనే ఆ కొత్త స్టేటస్‌లోకి మారిపోవచ్చా?
లేదంటే మళ్లీ మన దేశానికి తిరిగి వచ్చేసి, కొత్త వీసా వేయించుకుని వెళ్లాలా? ఈ విషయంలో చాలామందికి రకరకాల సందేహాలు, అయోమయం ఉంటాయి. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం అక్కడే ఉంటూ స్టేటస్ మార్చుకోవడానికి అవకాశమైతే ఉంది కానీ, దానికి కొన్ని కండీషన్స్ ఉంటాయి.
అసలు రూల్స్ ఏం చెప్తున్నాయి?
అమెరికాలో ఉన్నప్పుడే ఒక కేటగిరీ నుంచి మరో కేటగిరీకి మారడాన్ని చట్టం అనుమతిస్తుంది. అయితే మీరు అమెరికాలోకి చట్టబద్ధంగా ప్రవేశించి ఉండడం, మీ ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ఇంకా చెల్లుబాటులో ఉండడం చాలా ముఖ్యం.
అలాగే మీరు ఉన్నంతకాలం నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించకుండా, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉంటేనే USCISకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ ప్లాన్ మార్చుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ, మీ ప్రస్తుత Authorized Stay ముగియక ముందే ఈ ప్రాసెస్ ప్రారంభించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ పెట్టడం వేరు.. పర్మిషన్ రావడం వేరు!
ఇక్కడ చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, అప్లికేషన్ పెడితే పని అయిపోయిందనుకోవడం. ఉదాహరణకు ఒకరు టూరిస్ట్‌గా వెళ్లారనుకుందాం, అక్కడ ఏదైనా కోర్సు నచ్చి స్టూడెంట్ స్టేటస్ కోసం దరఖాస్తు చేశారు. అలా అప్లికేషన్ పెట్టగానే వారు వెంటనే స్టూడెంట్ అయిపోరు.
USCIS నుంచి ఆమోదం (Approval) వచ్చేంత వరకు కొత్త స్టేటస్‌కు సంబంధించిన ఏ పనీ చేయకూడదు, అంటే చదువు వెంటనే ప్రారంభించకూడదు. అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్న కాలంలో కూడా మీరు టూరిస్ట్ స్టేటస్ నిబంధనలనే కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
వీసా స్టిక్కర్ కాదు.. I-94 మాత్రమే ముఖ్యం!
ఇక అందరూ వీసా ఎక్స్పైరీ డేట్ చూసుకుని సమయం ఉందనుకుంటారు, కానీ అసలైన కీలకమైన డాక్యుమెంట్ పాస్‌పోర్ట్‌లోని వీసా కాదు, Form I-94 మాత్రమే. మీ పాస్‌పోర్ట్‌లో ఉన్న వీసా స్టిక్కర్ గడువు ఎంత ఉన్నప్పటికీ, మీరు అమెరికాలో ఎంతకాలం చట్టబద్ధంగా ఉండవచ్చో నిర్ణయించేది మాత్రం I-94 ఫామే. కాబట్టి స్టేటస్ మార్చాలనుకునే ఆలోచన రాగానే ముందుగా మీ I-94లో ఉన్న డేట్‌ను చెక్ చేసుకోవడం అత్యవసరం. ఆ గడువు ముగియక ముందే స్టేటస్ చేంజ్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
అందరికీ ఈ అవకాశం ఉండదు సుమా!
ఈ అవకాశం అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తించదు. Visa Waiver Program ద్వారా వచ్చిన వారికి, C కేటగిరీ Transit ప్రయాణికులకు, D కేటగిరీ Crew members కు, అలాగే S కేటగిరీ Informants కు ఇలాంటి మార్పులకు అనుమతి ఉండదు. అంతేకాదు, M-1 వొకేషనల్ స్టూడెంట్స్ F-1 అకడమిక్ స్టేటస్‌కి మారడంపై, J-1 ఎక్స్ఛేంజ్ విజిటర్స్‌లో ముఖ్యంగా రెండేళ్ల Foreign Residence నిబంధన ఉన్నవారికి అనేక కఠినమైన పరిమితులు ఉంటాయి.
కొన్ని ప్రత్యేక మినహాయింపులు
అయితే కొన్ని కేటగిరీల వారికి ఊరటనిచ్చే విషయాలు కూడా ఉన్నాయి. H, L, F వంటి ప్రధాన కేటగిరీల్లో ఉన్నవారి జీవిత భాగస్వాములు, పిల్లలు కొన్ని పరిస్థితుల్లో ప్రత్యేకంగా స్టేటస్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండానే అక్కడ చదువుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే B-1 బిజినెస్ వీసాపై వెళ్లిన వారు తమ ఆథరైజ్డ్ స్టే ముగిసేలోపు సరదాగా తిరగడానికి (Pleasure) అక్కడే కొనసాగవచ్చు, దీనికి ప్రత్యేకంగా స్టేటస్ మార్పు అప్లికేషన్ అవసరం ఉండదు.
చివరగా.. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి
1. అమెరికాలోకి వెళ్లిన తర్వాత మీ ప్లాన్ మారితే కొన్ని పరిస్థితుల్లో అక్కడి నుంచే status change కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
2. Application పెట్టడం అంటే approval వచ్చినట్టు కాదు.
3. అమెరికాలో మీ stay గురించి తెలుసుకోవడానికి Visa Stickerతో పాటు I-94ను తప్పకుండా చూడాలి.
ముఖ్యంగా భారతీయులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.
అమెరికా ఇమ్మిగ్రేషన్‌లో చిన్న తప్పు కూడా తర్వాత పెద్ద సమస్యగా మారొచ్చు. మీకు ఉన్న వీసా ఏదైనా కావచ్చు. కానీ మీరు ప్రస్తుతం ఏ statusలో ఉన్నారు, ఆ status ఎప్పుడు ముగుస్తుంది, దాని నిబంధనలు ఏమిటి అన్నదే అసలు విషయం.
అందుకే అమెరికాలో ఉండి చదువు, ఉద్యోగం లేదా మరో permitted purpose కోసం మీ ప్లాన్ మార్చుకోవాలనుకుంటే, “వీసా ఉంది కదా” అని కాకుండా.. ముందుగా మీ I-94, ప్రస్తుత status, USCIS నిబంధనలను చెక్ చేయడం చాలా ముఖ్యం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








