శాన్‌డియాగోలో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్ రన్’… ఫిట్నెస్ ప్రాముఖ్యతను చాటిచెప్పిన ఎన్నారైలు
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌డియాగోలో ‘వికసిత్ భారత్ రన్ – 2026’ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. లాస్ ఏంజెల్స్‌లోని భారతీయ రాయబార కార్యాలయం (కన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా), సీఆర్‌వై శాన్‌డియాగో, శాన్‌డియాగో తమిళ సంఘం సంయుక్తంగా ఎస్కొండిడోలోని లేక్ హాడ్జెస్ వేదికగా ఈ రన్‌ను విజయవంతంగా చేపట్టాయి. ఫిట్నెస్, ఐక్యతను చాటేలా నిర్వహించిన ఈ ఉత్సాహభరితమైన కార్యక్రమానికి అన్ని వయసుల వారు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఉత్సాహంగా సాగిన రన్…
అందమైన లేక్ హాడ్జెస్ ట్రైల్లో జరిగిన ఈ రన్లో చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్ల వరకు ప్రవాస భారతీయ కుటుంబాలు ఎంతో ఉత్సాహంగా భాగస్వాములయ్యాయి. ఈ రన్‌ను లాస్ ఏంజెల్స్ కన్సులేట్ జనరల్ డాక్టర్ కే.జే.శ్రీనివాస ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో మమేకమై మాట్లాడారు. ఫిట్నెస్ను అలవరుసుకోవాలని, సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘వికసిత్ భారత్ 2047’ స్ఫూర్తిని అందరూ అలవర్చుకోవాలని, 2047 నాటికి ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఇవి కూడా చదవండి
భాగస్వామ్య సంస్థలు ..
ఈ ఈవెంట్‌ను సీఆర్‌వై అమెరికా (CRY America) సంయుక్తంగా నిర్వహించగా.. బ్రహ్మ కుమారీస్, శాన్‌డియాగో తమిళ సంఘం తదితర స్థానిక సామాజిక సంఘాలు సహకరించాయి. ఈ సంస్థలన్నీ కలిసి రావడంతో శాన్‌డియాగో ప్రాంతంలోని ప్రవాస భారతీయులందరూ పెద్ద ఎత్తున ఒకే వేదికపైకి వచ్చారు.
ప్రవాస భారతీయుల పాత్ర కీలకం: కాన్సులేట్ జనరల్
కార్యక్రమంలో పాల్గొన్నవారితో మాట్లాడుతూ.. వికసిత్ భారత్ సాధనలో ప్రవాస భారతీయులు, ముఖ్యంగా యువత పాత్ర ఎంతో కీలకమని కన్సులేట్ జనరల్ పేర్కొన్నారు. మాతృభూమి భారతదేశంతో అనుబంధాన్ని ఎప్పుడూ కొనసాగించాలని, తమ ఆలోచనలు, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలతో దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు కృషి చేసిన భాగస్వామ్య సంస్థలు, వాలంటీర్లు , ప్రవాస సభ్యులందరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.








