ధోనీ ఇచ్చిన ఆ ఒక్క సలహా భారత్‌ను ముంచేసింది..!
భారత క్రికెట్ జట్టుపై చారిత్రాత్మక విజయంతో వెస్టిండీస్ జట్టు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మూడో వన్డేలో భారత్ నిర్దేశించిన 352 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి విండీస్ సంచలన విజయం సాధించింది. అయితే, టీమిండియాను ఓడించి తమ చరిత్రలోనే అత్యంత భారీ రన్ చేజ్‌ను విజయవంతంగా ముగించడం వెనుక భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) ఇచ్చిన ఒక గోల్డెన్ సలహానే కారణమని వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్(Shai Hope) వెల్లడించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెజెంటేషన్ వేడుకలో షాయ్ హోప్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
“352 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగినప్పుడు, ఒకానొక దశలో మ్యాచ్ క్లిష్టంగా మారింది. ఆ సమయంలో గతంలో గ్రేట్ మ్యాన్ ఎంఎస్ ధోనీతో నేను జరిపిన సంభాషణ నా మనసులోకి వచ్చింది. ధోనీ నాతో ఒకసారి.. ‘నీవు అనుకునేదాని కంటే నీకు ఎప్పుడూ ఎక్కువ సమయమే ఉంటుంది’ అని చెప్పారు. ఆ మాటలే నాలో ఓపికను పెంచాయి. రన్ రేట్ ఒత్తిడికి లొంగిపోకుండా ఇన్నింగ్స్‌ను ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆ సలహా నాకు మార్గదర్శనం చేసింది” అని హోప్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి
భారత్ నిర్దేశించిన భారీ లక్ష్య చేధనలో కెప్టెన్ షాయ్ హోప్ ముందుండి జట్టును నడిపించారు. మ్యాచ్ మధ్యలో గ్రోయిన్ ఇంజ్యూరీ ఇబ్బంది పెడుతున్నా, జట్టులో ఒక బ్యాటర్ తక్కువగా ఉన్నా వెనకడుగు వేయకుండా పోరాడారు. కేవలం 143 బంతుల్లోనే 162 పరుగులతో అజేయంగా నిలిచి వెస్టిండీస్ జట్టుకు 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు. ధోనీ శైలిలోనే ఒత్తిడిని అధిగమించి మ్యాచ్‌ను చివరివరకు తీసుకెళ్లి మరీ ముగించాడు. భారత్ ఈ వన్డే సిరీస్‌ను ఇప్పటికే 2-1తో కైవసం చేసుకున్నప్పటికీ, ఈ ఆఖరి వన్డేలో విండీస్ సాధించిన రికార్డు విజయం మరియు ధోనీ సలహాపై హోప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.








