కాంగ్రెస్ సత్యాగ్రహ వెబ్ సైట్.. ఏంటి దీని స్పెషల్..
కేంద్రంపై తమ పోరాటాన్ని ఇండీ కూటమి మరింత ఉధృతం చేసింది. మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. సందు దొరికితే చాలు ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తోంది. దీనిలో భాగంగా ఏకంగా నిరసన గళాలకోసం డిజిటల్ వేదికను ఏర్పాటు చేసింది.
‘సత్యాగ్రహ’ పేరుతో తీసుకొచ్చిన ఈ వెబ్సైట్ ద్వారా సత్యాన్ని అణగదొక్కేచోట బాధితులకు సాయం అందిస్తామని రాహూల్ గాంధీ స్పష్టం చేశారు.
ఈ వేదిక వల్ల అంశాల వారీగా చేపట్టే ఆందోళనలన్నీ ఒకే వేదికపైకి వస్తాయని రాహుల్ తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ సమస్యలపై నిరసనలను చేపట్టేవారు సత్యాగ్రహలో వాటిని రిజిస్టరు చేయాలని సూచించారు. ‘‘దేశవ్యాప్తంగా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతుంటారు. అయితే తరచూ వారు ఒంటరిగా పోరాడాల్సి వస్తోంది. జెన్-జీ, విద్యార్థులు, రైతులు, ఆదివాసీలు, దళితులు, మహిళలు.. ఇలా ప్రతి ఒక్కరి నిరసనల వెనుక ఒక ఆందోళన ఉంటుంది. అయితే ఒంటరిగా పోరాడేవారి గొంతు నొక్కడం ప్రభుత్వాలకు సులువవుతుంది. ఇలాంటి వారి గొంతుకలను ఒకే వేదిక మీదకు తీసుకురావడానికి సత్యాగ్రహ ఉపయోగపడుతుంది’’ అని రాహుల్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
గాంధీజీ నేర్పిన పాఠం
‘‘సత్యం అనేది గొప్ప ఆయుధమని మహాత్మా గాంధీ మనకు నేర్పారు. ఆ సత్యం కోసం కలిసి ఉద్యమిస్తే మరింత గొప్ప ఆయుధమవుతుంది. ఏదైనా అన్యాయంపై మీరు పోరాడుతుంటే దానిని సత్యాగ్రహలో రిజిస్టరు చేయండి. ఇది 2 నిమిషాల పని. దీంతో మీ పోరాటం సత్యాగ్రహ మ్యాప్‌లో చేరుతుంది. మీలాగే పోరాడుతున్నవారు ఇంకెవరున్నారో మీకు తెలుస్తుంది. నేను పార్లమెంటులో, వీధుల్లో ఏం చేయాలో అది చేస్తా. అది నా బాధ్యత’’ అని రాహుల్ పేర్కొన్నారు.








