పర్యావరణ అనుకూల ‘‘బాంబు సైకిల్స్’’ వచ్చేశాయి..
పర్యావరణ అనుకూల సైకిళ్లు వచ్చేశాయి. అసోం వేదికగా ‘‘బాంబూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’’ వెదురుతో సైకిళ్లను తయారు చేసింది. గాంధీ జయంతి వేడుక సందర్భంగా సతీ రాధిక శాంతి ఉద్యానవనంలో సీఎం హిమంత బిస్వ శర్మ వీటిని ప్రారంభించారు. ఈ సైకిళ్లు పూర్తిగా వెదురుతో తయారయ్యాయి. దీనికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ ధ్రువీకరణ కూడా లభించింది.
గౌహతిలోని ప్రజలకు వీటిని అందుబాటులో వుంచనుంది ప్రభుత్వం. వెదురు సైకిళ్లకు మంచి స్పందన లభిస్తే పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేసే ప్రభుత్వ పథకాల్లో వీటిని కూడా చేర్చాలని ప్రభుత్వం యోచిస్తుంది.
‘అసోం వెదురు సైకిల్’ను ఛాయ్గావ్లోని బాంబూ టెక్నాలజీ పార్క్‌లో, పుణెకు చెందిన బాంబూ ఇండియా భాగస్వామ్యంతో తయారు చేశారు. ఈ సైకిళ్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాన్ని రాష్ట్రవ్యాప్తంగా సేకరిస్తున్నారు. రూ. 15 కోట్ల ఈ ప్రాజెక్ట్ కింద నెలకు 1,000 సైకిళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. దీని వల్ల గ్రామీణ జీవనోపాధితో పాటు పర్యావరణ అనుకూల సంస్థలను ప్రోత్సహించి 50-100 ప్రత్యక్ష ఉద్యోగాలను అందిస్తుందని తెలిపారు.ఈ వెదురు సైకిల్‌ను కేవలం రూ. 5 ఖర్చుతో ఛార్జ్ చేసి, 50 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.
’’దేశంలోనే మొట్టమొదటి వెదురు ఆధారిత సైకిల్‌ను మేము ప్రవేశపెట్టాం. వెదురు సైకిళ్ల తయారీ కోసం పుణేకు చెందిన ‘బాంబూ ఇండియా’ సంస్థకు షైగావ్లోని ‘బాంబూ పార్క్’లో స్థలం కేటాయించాం. ఈ సంస్థ నెలకు 1,000 వెదురు సైకిళ్లను తయారు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే సెప్టెంబరులో ‘అసోం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లిమిటెడ్’- ‘బాంబూ ఇండియా’ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు శుక్రవారం మొదటిసారిగా కొన్ని సైకిళ్లను విడుదల చేశాం. ఈ వెదురు సైకిళ్లపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తే, భవిష్యత్తులో వీటి తయారీ ప్రక్రియను వేగవంతం చేస్తాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తే, ఈ సైకిళ్లను గువాహటిలోని అన్ని పార్కుల్లో అందుబాటులో ఉంచుతాం. అసోంలో వెదురును అనేక రకాల ఉపయోగిస్తారు. ఈ వెదురుతో 800 రకాల ఉత్పత్తులను తయారు చేయవచ్చు. టైల్స్, మిథనాల్, ఇథనాల్, సుస్థిర విమానయాన ఇంధనం వంటి వాటి తయారీకి వెదురును ఉపయోగించవచ్చు. వెదురు ఉక్కు కంటే దృఢమైనదని, ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని ఆ సంస్థ చెబుతోంది.” అని సీఎం ప్రకటించారు.








