స్థానిక పోరుకు జనసేనాని సరికొత్త వ్యూహం..!
ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన(Janasena) అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పార్టీ యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలు మరియు నియోజకవర్గాల వారీగా జనసేనకున్న బలబలాలపై పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా సమీక్షించారు.
కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే, క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేశారు. ఈ సమావేశంలో జనసేనాని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న పాత కమిటీలన్నింటినీ తక్షణమే రద్దు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల నాటికి సరికొత్త ఉత్సాహంతో, కష్టపడే నాయకులకు ప్రాధాన్యత దక్కేలా చాలా త్వరలోనే నూతన కమిటీలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
పాత కమిటీల స్థానంలో క్రియాశీలకంగా పనిచేసే కొత్త రక్తాన్ని నింపడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగరేయాలనే పట్టుదలతో జనసేనాని ఉన్నట్లు ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది. స్థానిక పోరులో అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు వంటి కీలక విషయాలపై తొందరపడకుండా.. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో పార్టీకి ఉన్న వాస్తవ బలాన్ని శాస్త్రీయంగా అంచనా వేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీ లీడర్షిప్ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. పవన్ కల్యాణ్ తీసుకున్న ఈ మేజర్ రీ-ఆర్గనైజేషన్ నిర్ణయం మరియు వ్యూహాత్మక అడుగులు జనసేన శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపాయి.








