హనుమాన్ చాలీసా గట్టిగా పఠించా : వీడియో కాల్ లో స్మిత్ మచ్చర్
న్యూఢిల్లీ : ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన హింసాత్మక ఘటనలో వీరోచితంగా పోరాడి, గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను ప్రధాని మోదీ ఫోన్లో పరామర్శించారు. యూఏఈలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్ తో మోదీ వీడియో కాల్ లో మాట్లాడారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాక్ పిట్ లో తనకు ఎదురైన పరిస్థితిని మచ్చర్ ప్రధాని మోదీకి వివరించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చూపించిన సమయ స్ఫూర్తి, ధైర్యం అభినందనీయం. మీ ప్రాణం కంటే ప్రయాణికుల భద్రత కోసం పోరాడిన మీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. త్వరగా కోలుకోవాలని యావత్ భారత్ ప్రార్థిస్తోంది. భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కాదు. ఇతరులను రక్షించడం కోసం తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టడానికి సిద్ధపడతారని మన దేశం ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటుంది’’ అని స్మిత్ తో మోదీ అన్నారు.
మరో వైపు ప్రధాని మోదీయే నేరుగా ఫోన్ చేయడంపై కెప్టెన్ స్మిత్ మచ్చర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా మచ్చర్ మాట్లాడుతూ ‘‘మీరు నాకు అత్యంత ఆరాధనీయులు. మీ నుంచి ఫోన్ రావడం గర్వంగా వుంది. కలలో కూడా నేను ఊహించలేదు. అనుకోని పరిస్థితులు, విపత్కర పరిస్థితుల్లో హనుమాన్ చాలీసా పఠిస్తా. కాక్ పిట్ లో ఘర్షణ సమయంలోనూ హనుమాన్ చాలీసాయే పఠించా. ఆ సమయంలో నేను గాయపడినా, ఆలోచించలేదు. ఎవరి ప్రాణాలూ పోవద్దని మాత్రం దేవుడ్ని ప్రార్థించా. నేను ఎలాగైనా లేవాలి. లేదంటే నాతో పాటు అందరూ మరణిస్తారని గట్టిగా భావించా’’ అంటూ మోదీకి వివరించారు.








