రైల్వే శాఖ సరికొత్త రికార్డ్.. చినాబ్ బ్రిడ్జిపై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో..
భారతీయ రైల్వే మరో ఘనత కూడా తన రికార్డుల్లో నమోదు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి ప్రాంతంలో నిర్మించిన ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ బ్రిడ్జిపై వందే భారత్ ఎక్స్ ప్రెస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ రూట్ లో రైళ్ల గరిష్ఠ వేగాన్ని 75 కిలోమీటర్ల నుంచి 100 కి.మీ.కి పెంచిన తర్వాత వందే భారత్ రైలు ఈ రికార్డును నమోదు చేసిందని రైల్వే ప్రకటించింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జితో పాటు భారత్ లో తొలి కేబుల్ స్టే రైల్వే బ్రిడ్జి అయిన అంజి బ్రిడ్జిని కూడా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దాటింది. దీంతో ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా లింక్ (యూఎస్బీఆర్ఎల్) ప్రాజెక్టులో మైలురాయిని సాధించినట్లయింది.
శ్రీమాత వైష్ణోదేవి కత్రా-బనిహాల్ సెక్షన్లో రైలు వేగం గంటకు ఇంతకుముందు 75 కిలోమీటర్లు ఉండగా దానిని 111 కిలోమీటర్లకు పెంచామని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉచిత్ సింఘాల్ తెలిపారు. దేశంలోనే మొదటి కేబుల్ బ్రిడ్జి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ బ్రిడ్జిని దాటడం ద్వారా వందే భారత్ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 26401/26404) రికార్డు సాధించిందని సింఘాల్ చెప్పారు. కాగా.. యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టులో 111 కిలోమీటర్ల కత్రా-బనిహాల్ సెక్షన్ చాలా కీలకమైనది. కశ్మీర్ లోయ, దేశంలోని మిగతా ప్రాంతాల మధ్య నిరంతర రైలు కనెక్టివిటీని అందించేందుకు ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.








