Reels కంటిన్యూగా చూస్తున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందో తెలిసా? సైంటిస్టులు తేల్చిన అసలు నిజాలు ఇవే!
రాత్రి పడుకునే ముందు …
‘ఒక్క వీడియో చూసి పెట్టేద్దాం’ అని ఫోన్ చేతిలోకి తీసుకుంటాం.
ఒక Reel. అది అయిపోయింది. వెంటనే మరోటి. అందులో ఇంట్రస్ట్ లేకపోతే… ఒక్క swipe. మరో వీడియో. మళ్లీ swipe. అలా స్వైప్ చేస్తూ చూస్తుండగానే అరగంట, గంట గడిచిపోతుంది. అయితే ఇక్కడ మన చేతి వేలు మాత్రమే swipe చేస్తుందా? లేక మన మెదడు కూడా ప్రతి కొన్ని సెకన్లకోసారి కొత్తదాన్ని వెతకడానికి అలవాటు పడుతోందా?
TikTok, Instagram Reels, YouTube Shorts వంటి Short-form వీడియోలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి రోజువారీ ఎంటతర్టైన్మెంట్ గా మారిపోయాయి. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు మరో విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఈ నిరంతర స్క్రోలింగ్ మన మన ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, Impulse Controlపై ఏమైనా ప్రభావం చూపుతోందా?
రీల్స్ వల్ల మెదడు నిజంగానే పాడవుతుందా?
సోషల్ మీడియాలో తరచూ “రీల్స్ చూస్తే మెదడు పాడవుతుంది”, “మన ఏకాగ్రత నాశనమవుతుంది” అంటూ వార్తలు కనిపిస్తుంటాయి. కానీ, శాస్త్రీయంగా చూస్తే షార్ట్ వీడియోలు మన మెదడును నేరుగా పాడుచేస్తున్నాయని చెప్పడానికి ప్రస్తుతం బలమైన ఆధారాలేవీ లేవు. అయితే, ఆందోళన చెందడానికి కొన్ని కారణాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
షార్ట్ వీడియోలను ఎక్కువగా చూడటం వల్ల ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి సమస్యలు రావడం, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం వంటి ఫలితాలతో సంబంధం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, రెండు విషయాల మధ్య సంబంధం (Correlation) ఉండటం వేరు, ఒకదాని వల్లే మరొకటి జరిగిందని నిరూపించడం (Cause) వేరు. రీల్స్ ఎక్కువగా చూసేవారిలో కొన్ని సమస్యలు కనిపిస్తున్నప్పటికీ, ఆ సమస్యలకు కేవలం రీల్సే కారణమని శాస్త్రీయంగా నిరూపించడానికి ఇంకా సమగ్రమైన పరిశోధనలు జరగాల్సి ఉంది.
మన మెదడు ఏం నేర్చుకుంటోంది?
షార్ట్ వీడియోల ప్రపంచంలో మనకు ఏదైనా నచ్చకపోతే వేచి ఉండాల్సిన పనిలేకుండా వెంటనే స్వైప్ చేసి కొత్త వీడియోలోకి వెళ్తుంటాం. ఇలా ప్రతి కొన్ని సెకన్లకూ కొత్త విషయం దొరకడంతో, ‘నచ్చకపోతే వెంటనే మార్చేయొచ్చు’ అనే ఆలోచనకు మన మెదడు అలవాటు పడుతోంది.
ఒక వైరల్ ‘Brain Study’… కానీ అసలు కథ వేరే!
ఇటీవల చైనాలోని Zhejiang University పరిశోధకులు 56 మంది యువకులపై MRI అధ్యయనం చేశారు. వారికి వరుసగా Short videos చూపించారు. పాల్గొనేవారు వీడియోను మధ్యలోనే వదిలేసి తదుపరి వీడియోకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు, మెదడులో కొన్ని ప్రాంతాలు ఎక్కువగా యాక్టివ్‌గా కనిపించాయి. అంతే. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అధ్యయనం మరో రూపం దాల్చింది.
“TikTok మీ మెదడును మొద్దుబారుస్తోంది.” అంటూ ప్రచారం మొదలైంది. ఒక మీడియా సంస్థ అయితే Instagram Reels, TikTok మనుషులను “Dumb & Depressed” చేస్తున్నాయని హెడ్డింగ్ పెట్టింది. కానీ న్యూరోసైంటిస్టులు ఆ అధ్యయనాన్ని పరిశీలించినప్పుడు… అది అసలు చెప్పింది అంతకంటే చాలా తక్కువ.
ఆ పరిశోధన: TikTok మనల్ని తెలివితక్కువవాళ్లుగా మారుస్తుందని చెప్పలేదు. Short videos depressionకు కారణమని చెప్పలేదు. ఆ పరిశోధన కేవలం మనం ఒక వీడియోను స్కిప్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మెదడు ఎలా స్పందిస్తుందో మాత్రమే చెప్పింది.
జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతోందా?
ఈ అధ్యయనాలు సాధారణమైనవే అయినప్పటికీ, ఇతర పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన హెచ్చరికలను జారీ చేస్తున్నాయి. బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం, షార్ట్ వీడియోలలో నిరంతరం సందర్భాలు మారడం వల్ల కొద్దిసేపటి తర్వాత చేయాల్సిన పనులను గుర్తుంచుకునే సామర్థ్యం (Prospective Memory) తగ్గే అవకాశం ఉంది.
అలాగే న్యూ మెక్సికో యూనివర్సిటీ పరిశోధనలో, రోజుకు సగటున రెండు గంటలకు పైగా టిక్‌టాక్ ఉపయోగించే విద్యార్థుల్లో వర్కింగ్ మెమరీ, గత సంఘటనలను గుర్తుంచుకునే ఎపిసోడిక్ మెమరీల్లో సమస్యలు ఉన్నట్లు గమనించారు.
ఆస్ట్రియాలోని సిగ్మండ్ ఫ్రాయిడ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం రోజుకు 4 గంటల కంటే ఎక్కువ సమయం షార్ట్ వీడియోలు చూసే వారిలో నాడీ సంబంధిత మార్పులు కనిపిస్తున్నాయని తెలిసింది. ప్రతిరోజూ రెండు గంటలకు పైగా ఒకే పనికి కేటాయిస్తే, మెదడు ఆ అలవాటుకు అనుగుణంగా మారిపోవడం సహజమే.
ఒకేసారి నాలుగు పనులు… మన మెదడు నిజంగా చేయగలదా?
Maryland Universityకి చెందిన న్యూరోసైంటిస్ట్ Luiz Pessoa మరో ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. ఆయన తన టీనేజ్ కూతురితో కలిసి Formula 1 highlight videos చూస్తారు. కానీ వీడియో చూస్తున్న సమయంలో ఆమె ఫోన్‌ను కూడా చూస్తుంది. అంటే…ఒక స్క్రీన్‌పై వీడియో. మరో స్క్రీన్‌పై ఫోన్. మధ్యలో మెసేజ్. మళ్లీ వీడియో. మళ్లీ స్క్రోల్. ఇలా మనం ఒకేసారి రెండు, మూడు, నాలుగు పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. 20–30 సంవత్సరాల క్రితం మనం ఇంతగా చేయలేదని Pessoa చెబుతున్నారు. అయితే ఇక్కడో సందేహం…మన Attentionకి కూడా ఒక పరిమితి ఉంటే… రోజూ దాన్ని ఇలా ముక్కలు ముక్కలుగా పంచుకుంటూ ఉంటే ఏమవుతుంది? దానికి శాస్త్రవేత్తల దగ్గర ఇంకా పూర్తి సమాధానం లేదు.
కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. Short-form వీడియోల ప్రభావంపై మనకు తెలిసిన దానికంటే… తెలియనిదే ఇంకా ఎక్కువ. అందుకే “Reels మన మెదడును పాడు చేస్తున్నాయి” అని ఇప్పుడే తీర్పు చెప్పడం ఎంత తొందరో… “అసలు ఎలాంటి ప్రభావం లేదు” అని అనుకోవడం కూడా అంతే తొందరపాటు.
ఏదైమైనా …ఆ swipe మన మెదడులో ఏం మార్చుతోందో తెలుసుకోవడానికి మాత్రం ఇంకా చాలా పరిశోధన అవసరం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








