నదుల్లో వ్యర్థాలు వదలొద్దు… స్వచ్ఛతతోనే స్వర్ణాంధ్ర: సీఎం చంద్రబాబు
నదుల్లో వ్యర్థాలు వదలొద్దు… పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
పరిశుభ్రత అలవాటుగా మారాలి – స్వచ్ఛతతోనే స్వర్ణాంధ్ర
పరిసరాల పరిశుభ్రతతో పాటు… వ్యక్తిగత శుభ్రత, ఆలోచనల్లో శుభ్రత అవసరం
చెత్త సమస్య కాదు… సంపదగా మార్చే విధానంగా చూడాలి
రూ.1.30 లక్షల కోట్లతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026 సభలో ముఖ్యమంత్రి
నెట్జీరోపై సీఎం సమక్షంలో ఐఐటీ కాన్పూర్‌తో ఎంఓయూ కుదుర్చుకున్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్
విజయవాడ, అక్టోబర్ 2: నదులను పరిశుభ్రంగా ఉంచాలని… వ్యర్థాలు వదలొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని.. ఐదు కోట్ల మంది ప్రజలు భాగస్వాములై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితేనే రాష్ట్రంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు. విజయవాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా వారియర్లు, స్వచ్ఛ గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, సంస్థలు, ప్రాంగణాలు, ఎన్జీవోలు తదితరులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… కృష్ణా, గోదావరి నదుల్లోకి వ్యర్థాలు, మురుగునీటిని వదిలేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దిగువ ప్రాంతాల్లో ప్రజలు నదుల నీటినే తాగునీటిగా వినియోగిస్తున్నారని తెలిపారు. నదులను కలుషితమైతే అది ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా అపరిశుభ్రత ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నదుల కలుషితం వల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. పర్యావరణానికి నష్టం చేసే చర్యల వల్లే ఎల్‌నినో లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఎల్ నినో ప్రభావంతో కృష్ణా నదికి నీరు రాని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. జల్‌జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి నీరు అందించడంతో పాటు మురుగునీటి శుద్ధికి రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
స్వచ్ఛత ద్వారా ఆరోగ్యాంధ్ర
వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, ఆలోచనల్లోనూ స్వచ్ఛత ఉండాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు.. వ్యక్తిగత శుభ్రత పాటిస్తే అనారోగ్యం దరి చేరదన్నారు. గాంధీజీ స్వాతంత్ర్యం పోరాటంతో పాటు… స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇచ్చారని సీఎం పేర్కొన్నారు. కోల్‌కతాలో అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను చూసి ఆయనే స్వయంగా శుభ్రం చేశారని గుర్తు చేశారు. పరిశుభ్రత ఏ ఒక్క వర్గానికో సంబంధించిన అంశం కాదని… ఆరోగ్యం కోసం ఎవరి పరిసరాలను వారే శుభ్రంగా ఉంచుకోవాలన్నదే గాంధీజీ సందేశమని చెప్పారు. రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్వచ్ఛతా కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. గత పాలకుల కాలంలో పరిశుభ్రతపై తగిన శ్రద్ధ లేకపోవడంతో టన్నుల కొద్దీ చెత్త రోడ్లపై పేరుకుపోయేదని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో నిర్వహిస్తున్నామని, తాను కూడా ప్రతి నెలా స్వయంగా పాల్గొంటున్నానని తెలిపారు. రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు.
నెట్‌జీరో దిశగా ఏపీ
చెత్తను సమస్యగా చూడకుండా సంపద సృష్టించే వనరుగా మార్చుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యర్థాలతో విద్యుత్తు ఉత్పత్తి చేయడంతో పాటు ఎరువులు, బయోగ్యాస్ తయారు చేసి సర్క్యులర్ ఎకానమీ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నామని చెప్పారు. ఘన వ్యర్థాల సేకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ రథాలను నిర్వహిస్తున్నామన్నారు. జీరో గార్బేజ్ లక్ష్యంతో ఈ–ఆటోలు, పుష్‌కార్టులు, మెకనైజ్డ్ రోడ్ స్వీపింగ్ యంత్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్తగా చెత్త పేరుకుపోకుండా ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మ్యాజిక్ డ్రెయిన్లు, సోక్ పిట్లు, కంపోస్ట్ పిట్లు, గోబర్ధన్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో నెట్‌జీరో కాన్సెప్ట్‌తో పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. దీన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ విషయంలో కొత్త విధానాలను అధ్యయనం చేసేందుకు నెట్‌జీరో అంశంపై ఐఐటీ కాన్పూర్‌తో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. నగరాల్లో సిటీ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అమలు చేయడంతో పాటు మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రూ.1.30 లక్షల కోట్లతో గ్రామీణాభివృద్ధి
పట్టణ ప్రాంతాలతో పాటు పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక రూపొందించామని చెప్పారు. కొందరు చేస్తున్న మంచిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో రాయలసీమ మొత్తం కరువు పరిస్థితులతో ఉండేదని సీఎం గుర్తుచేశారు. డ్రిప్ ఇరిగేషన్‌తో పాటు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించగలిగామని తెలిపారు. ఇప్పుడు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా మార్చేందుకు అంకురార్పణ చేశామని చెప్పారు. గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ ద్వారా గ్రీన్ కవర్ పెరిగి పర్యావరణంలో మార్పు వస్తుందని పేర్కొన్నారు. పరిశుభ్రతతో పాటు.. పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. తిరుమలకు వెళ్లిన ప్రతిసారీ శ్రీవారి దర్శనంతో పాటు అక్కడి పచ్చదనంపై తాను ప్రత్యేకంగా దృష్టి పెడతానని సీఎం తెలిపారు. తిరుమల కొండల్లో 80 శాతానికి పైగా పచ్చదనం ఉందని.. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచుతూ మరింత హరిత విధానాలను అనుసరిద్దామని చెప్పారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది బాధ్యత తీసుకుని మొక్కలు నాటి హరిత ప్రదేశ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
స్వచ్ఛ చల్లపల్లి స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు
స్వచ్ఛ చల్లపల్లిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలను అమలు చేయాలని సీఎం పిలుపునిచ్చారు. చల్లపల్లిలో ప్రజల్లో స్వచ్ఛతపై చైతన్యం వచ్చి, అది అలవాటుగా మారడంతో పరిసరాల్లో చెత్త వేసే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. ఇదే తరహా స్వచ్ఛతా అలవాట్లు రాష్ట్రవ్యాప్తంగా రావాలని ఆకాంక్షించారు. ప్రతి ఏడాది అక్టోబరు 2న నెట్‌జీరో, స్వచ్ఛతపై పనిచేసిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందించే కార్యక్రమాలను అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పరంగా 22 విభాగాల్లో 130 రాష్ట్రస్థాయి అవార్డులు, 2,044 జిల్లా స్థాయి అవార్డులు అందిస్తున్నట్లు సీఎం తెలిపారు. స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, ఆస్పత్రులు, బస్టాండ్లు, పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పారిశుధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్ల సేవలను కూడా గుర్తిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 12 వేల మంది క్రీడాకారులు, రన్నర్లు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంఘీభావం తెలపడం అభినందనీయమన్నారు. ఈ విధంగా స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం కోరారు. ప్రస్తుతం ఇస్తున్న స్వచ్ఛతా అవార్డులతో పాటు.. ప్రతి పాఠశాల, పంచాయతీ, మున్సిపాలిటీకి స్వచ్ఛత ర్యాంకులు ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. దీనిపై ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకుని మరింత మెరుగైన విధానాలను అమలు చేస్తామని చెప్పారు.
స్వచ్ఛాంధ్ర అవార్డులు–విజేతలు
స్వచ్ఛతా రంగంలో విశేషంగా సేవలందించిన స్వచ్ఛతా వారియర్లు, ఎన్జీవో సంస్థలకు సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర–2026 అవార్డులు అందజేశారు. స్వచ్ఛ కాలనీలు, అసోసియేషన్లు, వివిధ సంస్థలకు కూడా అవార్డులు ప్రదానం చేశారు. హోటళ్ల కేటగిరీలో విశాఖ నోవోటెల్‌కు స్వచ్ఛతా అవార్డు లభించింది. ఇక పరిశుభ్రత పాటిస్తున్న వివిధ రైతు బజార్లకు అవార్డులు ప్రకటించారు. విజయవాడ-పాయకాపురం, కర్నూలు-సీక్యాంప్, శ్రీకాకుళం-విల్లిస్ రైతు బజార్లకు స్వచ్ఛతా అవార్డులు అందాయి. తెనాలి, చిలకలూరిపేట, మంగళగిరి, పొన్నూరు, బొబ్బిలి, రాజాం, యలమంచిలి, పలమనేరు, గిద్దలూరు మున్సిపాలిటీలకు స్వచ్ఛతా అవార్డులు లభించాయి. కాకినాడ జిల్లాలోని కే.మూలపేట, రావులపాలెం, పత్తికొండ, దుప్పాడ, నంబూరు, ఆర్.ఎల్.పురం గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ గ్రామ పంచాయతీ కేటగిరీలో అవార్డులు దక్కాయి. పాఠశాలల కేటగిరీలో నిడమర్రు జెడ్పీ హైస్కూల్, నెల్లూరులోని దేవిరెడ్డి శారదా హైస్కూల్, చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్‌కు స్వచ్ఛతా అవార్డులు వచ్చాయి. ఆస్పత్రుల కేటగిరీలో పెందుర్తి, ఇబ్రహీంపట్నం, ఆస్పరి, కొనకనమిట్ల పీహెచ్‌సీలకు అవార్డులు లభించాయి. మంగళగిరి ఇందిరానగర్, తిరుపతి, చిన్నవాడ, విశాఖ యూపీహెచ్‌సీలకు కూడా స్వచ్ఛతా అవార్డులు అందాయి. చిత్తూరు ప్రభుత్వ బాలుర హాస్టల్‌కు స్వచ్ఛతా అవార్డు లభించింది. కడపలోని బీసీ బాలుర హాస్టల్, అనకాపల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌కు అవార్డులు అందాయి. పల్నాడులోని అంబేద్కర్ గురుకులం, ఏలూరులోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, బాపట్ల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలకు స్వచ్ఛతా అవార్డులు దక్కాయి. విశాఖ ద్వారకానగర్ బస్టాండ్, చిత్తూరు ఎస్పీ కార్యాలయం, జీవీఎంసీ కార్యాలయం స్వచ్ఛతా అవార్డులను సాధించాయి. ఆలయాల కేటగిరిలో తిరుమల తిరుపతి ఆలయం, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు స్వచ్ఛతా అవార్డులు అందించారు. వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమంగా పనిచేసిన స్టార్టప్‌కు కూడా స్వచ్ఛతా అవార్డును సీఎం చంద్రబాబు అందజేశారు. స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








