ఏపీని అగ్రస్థానంలో నిలపడమే మా లక్ష్యం.. పాన్ ఐఐటీ కాన్ఫరెన్స్ బృందంతో మంత్రి లోకేశ్
దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం
ఇందుకు మీ అందరి సహకారం కావాలి
దశాబ్ద కాలంలోనే భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలం
ఈ మార్పునకు ఏపీ నాయకత్వం వహించాలని కోరుకుంటోంది
దేశం గర్వపడేలా రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతాం
విజయవాడలో పాన్-ఐఐటీ కాన్ఫరెన్స్ టీమ్ డిన్నర్ మీటింగ్ లో మంత్రి లోకేష్
విజయవాడ: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యమని, ఇందుకు మీ అందరి సహకారం కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో పాన్-ఐఐటీ(PanIIT) కాన్ఫరెన్స్ టీమ్ తో జరిగిన డిన్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు గారి గురించి మీ అందరికీ తెలుసు. ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఒక్కో వెర్షన్‌తో మరింత మెరుగుపడుతుంటాయి. అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి వెర్షన్‌తో మరింత మెరుగవుతున్నారు. ఇది ఆయన నాలుగో వెర్షన్. ప్రజాప్రభుత్వంలో 50 శాతం మంది శాసనసభ్యులు తొలిసారి ఎన్నికైనవారే. అలాగే 25 మంది మంత్రుల్లో 17 మంది తొలిసారి మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. నేను ఇప్పుడు సీనియర్ మంత్రిని. రాష్ట్రాభివృద్ధి కోసం మేమంతా కసితో, పట్టుదలతో పనిచేస్తున్నాం.
ఏపీలో అందరం కలిసి నూతన చరిత్రను సృష్టిస్తున్నాం
ఈ రోజు సీఎం చంద్రబాబు గారు.. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, అనంత్ అంబానీతో కలిసి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ మిషన్ లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగం కలిసి దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ప్రపంచంలోనే ఉద్యానవన రంగంలో భారత్‌ను నెం.1 స్థానానికి తీసుకెళ్లడమే ఈ మిషన్ లక్ష్యం. ఏపీలో హార్టికల్చర్ నుంచి స్పేస్ వరకు, డ్రోన్ల నుంచి క్వాంటమ్ టెక్నాలజీ వరకు, డేటా సెంటర్ల వరకు ఎన్నో రంగాల్లో ముందుకు సాగుతున్నాం. ఏపీలో మనం నూతన చరిత్రను సృష్టిస్తున్నాం. అంతా కలిసి మన లక్ష్యాలను కార్యరూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
దశాబ్ద కాలంలోనే భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలం
ఏపీ మీకు ఒక అద్భుతమైన వేదికను అందిస్తోంది. ఇక్కడ కొత్త ఆలోచనలు, కొత్త విధానాలతో వాటికి ఒక బెంచ్‌మార్క్‌ను సృష్టించాలనుకుంటున్నాం. పోటీతో కూడిన సమాఖ్య వ్యవస్థలో ఒక రాష్ట్రం ఒక మంచి పని చేస్తే, మిగతా రాష్ట్రాలు కూడా దానిని అనుసరిస్తాయి. అందువల్ల ఏపీ మార్గదర్శకంగా నిలవగలదని విశ్వసిస్తున్నా. యూరప్, అమెరికా అభివృద్ధి చెందిన దేశాలుగా మారడానికి 100 నుంచి 120 సంవత్సరాలు పట్టింది. దుబాయ్‌కు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలు పట్టింది. సింగపూర్ కేవలం 25 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగింది. ఇక్కడ ఉన్న మేధోశక్తి, ప్రతిభ, సంకల్పం, సానుకూల నాయకత్వాన్ని గమనిస్తే.. భారత్‌ను కేవలం 10 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలమని నేను నమ్ముతున్నా. ఒక దశాబ్దంలోనే మనం అభివృద్ధి చెందిన దేశంగా మారగలం. ఒక రాష్ట్రంగా ఏపీ ఈ మార్పునకు నాయకత్వం వహించాలని భావిస్తోంది.
దేశం గర్వపడేలా రాజధాని అమరావతిని తీర్చిదిద్దుతాం
దేశంలో ‘నమో’ అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఏపీలో ‘నమో’ అంటే ‘నాయుడు జీ, మోదీ జీ కా జోడీ. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే.. ఏపీలో మాత్రం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. మనం పనిచేసే వేగం అలాంటిది. దేశంలో ఏపీ నెం.1గా నిలవాలనేది మా లక్ష్యం. ఇందుకు మీ అందరి సహకారం కావాలి. మీ సూచనలు, ఆలోచనలు వినడానికి మేం ఎంతో ఆసక్తిగా ఉన్నాం. మేం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. నది అవతలే అమరావతి ఉంది. మీకు సమయం ఉంటే తప్పకుండా అక్కడికి వచ్చి చూడాలి. మనం షాంఘై, బీజింగ్, సింగపూర్ వంటి నగరాల గురించి మాట్లాడతాం. మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేశం, ప్రపంచం మొత్తం అమరావతి గురించి మాట్లాడే రోజు వస్తుంది. ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలనేది మా లక్ష్యం. దేశం గర్వపడేలా అమరావతిని తీర్చిదిద్దుతాం. ఒక్కసారి అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే.. ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటో స్పష్టంగా అర్థమవుతుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాన్-ఐఐటీ ఛైర్మన్ ప్రభాత్ సింగ్ తో పాటు పాన్-ఐఐటీ సభ్యులు, దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల డైరెక్టర్లు, పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.








