సిరిసిల్ల ముగిసింది.. ఇక సిద్ధిపేటపై రేవంత్ దృష్టి!
తెలంగాణలో బీఆర్ఎస్ కంచుకోటలపై కాంగ్రెస్ వ్యూహాత్మక దండయాత్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో రేవంత్ పర్యటన తర్వాత రాజకీయం వేడెక్కింది. తాజాగా మరో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు నియోజకవర్గమైన సిద్ధిపేటపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. బీఆర్ఎస్ బలమైన కోటలను ఒక్కొక్కటిగా బద్దలు కొట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఈ పర్యటనలు చేస్తున్నారు. ఈ వారంలోనే రేవంత్ రెడ్డి సిద్ధిపేటలోపర్యటించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
గత వారం సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ చర్చనీయాంశంగా మారాయి. సిరిసిల్ల వేదికగా కేటీఆర్ ఆస్తులు, విదేశీ పెట్టుబడులు, కుటుంబ సభ్యుల పేరిట ఉన్న హైటెక్ సిటీ హోటళ్ల అంశాలను సీఎం ప్రస్తావించారు. ఇవి పెను దుమారమే రేపాయి. సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, మంత్రిని చేస్తామని రేవంత్ ప్రకటించారు. అదే సమయంలో కేటీఆర్ ఆర్థిక మూలాలపై దాడి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు హరీశ్ రావు కంచుకోట సిద్ధిపేట వైపు రేవంత్ వెళ్తున్నారు.
అక్టోబర్ 5, 6, 7 తేదీలలో ఏదో ఒక రోజు సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి అధికారిక పర్యటన ఉండనుంది. ఈ పర్యటనలో సిద్ధిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. సిరిసిల్లలో అనుసరించిన దూకుడు వ్యూహాన్నే సిద్ధిపేటలోనూ కొనసాగించాలని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా హరీశ్ రావు ఆస్తులు, ఆయన రాజకీయ ఆధిపత్యంపై సిద్ధిపేట గడ్డ నుంచి సీఎం ఎలాంటి సవాల్ విసురుతారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి సిద్ధిపేట అనగానే గులాబీ పార్టీకి ఒక కోటగా పేరొందింది. ఇక్కడ బీఆర్ఎస్ ను మట్టికరిపించి, దాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సాక్షిగా బీఆర్ఎస్ నేతల భూఅక్రమాలను బయటపెట్టిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు క్షేత్ర పర్యటనల ద్వారా ప్రజల్లోకి ఆ అంశాలను బలంగా తీసుకెళ్తున్నారు.
సిరిసిల్ల సభ ద్వారా గులాబీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్ నాయకత్వం, ఇప్పుడు సిద్ధిపేట వేదికగా హరీశ్ రావును రాజకీయంగా ఇరుకున పెట్టాలని చూస్తోంది. ఈ పర్యటన కేవలం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకే పరిమితం కాదు. రాబోయే ఎన్నికలు, తదనంతర పరిణామాలకు ఒక దిక్సూచి. సిరిసిల్ల రగడ చల్లారకముందే సిద్ధిపేట కేంద్రంగా రాజకీయం వేడెక్కుతుండటంతో రాష్ట్రంలో మరోసారి పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది.








