కాంగ్రెస్ ని అమాంతం తగ్గించేస్తున్న అఖిలేష్…
యూపీ ఎన్నికలను అన్ని పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నాయి. బీజేపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుండగా, సమాజ్ వాదీ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోంది. సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇప్పటికే యూపీలో రథ యాత్రను ప్రారంభించేశారు. ఎస్సీ, ఎస్టీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
అయితే.. ఆయా పార్టీల కూటములు ఇప్పుడే సీట్ల పంపకాలపై పట్టు పడుతున్నాయి. ఇండి కూటమిలో వున్న సమాజ్ వాదీ, కాంగ్రెస్ మధ్య ఇప్పుడు సీట్ల పంచాయతే నడుస్తోంది. ఎక్కువ స్థానాలను తీసుకొని, తమ ప్రాబల్యాన్ని చాటాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ.. సమాజ్ వాదీ మాత్రం కాంగ్రెస్ డిమాండ్ చేసినన్ని సీట్లను మాత్రం ఇచ్చేందుకు ఏమాత్రం సుముఖత చూపించడం లేదు. దీంతో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది.
కనీసంలో కనీసం 150 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. కానీ.. ఇన్ని సీట్లు ఇచ్చేందుకు అఖిలేష్ రెడీగా లేరు. అందుకే ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి అఖిలేష్ డుమ్మా కొట్టిన కారణం కూడా ఇదే అంటున్నారు. కాంగ్రెస్తో సీట్ల పంపకానికి సంబంధించిన విధానాన్ని ఖరారు చేస్తూనే, సమాజ్వాదీ పార్టీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించడంపై దృష్టి సారిస్తోంది. ఈ పొత్తులో భాగంగా కాంగ్రెస్కు సుమారు 50 నుంచి 55 సీట్లు ఇచ్చేందుకే సమాజ్ వాదీ రెడీగా వుంది.
తమకు బలంగా వున్న స్థానాలను కాంగ్రెస్ కి ఇచ్చేందుకు సమాజ్ వాదీ ఏమాత్రం సుముఖంగా లేదు. ప్రాబల్యం వున్న అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేందుకు రెడీ అయ్యింది. అలాగే 2024 లోకసభ ఎన్నికలను కూడా అఖిలేష్ పరిగణనలోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఆరు లోక్సభ స్థానాలను గెలుచుకుంది. ఈ స్థానాలు 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి రాగా, కాంగ్రెస్ పోటీ చేసి ఓడిపోయిన లోక్సభ నియోజకవర్గాల పరిధిలోకి 11 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి.
అయితే.. సమాజ్ వాదీ మాత్రం అన్ని లెక్కలు వేసుకుంది. ఇప్పటికే ఓ సర్వే కూడా అఖిలేష్ చేసుకున్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. మొత్తం 350 స్థానాల్లో పోటీ చేసేందుకు అఖిలేష్ రెడీ అయ్యారు. కాంగ్రెస్ కి మాత్రం 50 నుంచి 55 సీట్లు ఇచ్చేందుకే రెడీ అయ్యారు.








