జాతిపిత అడుగుజాడల్లో లాస్ఏంజెల్స్ ప్రవాసులు.. ఘనంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి!
లాస్ఏంజెల్స్లోని భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను అత్యంత ఘనంగా నిర్వహించారు. లాస్ఏంజెల్స్లో జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాలలో ఈ మహానేతల జయంతులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.
ఉదయం పూట శాంతి స్మారక వేడుకలు…
పసిఫిక్ పాలిసేడ్స్లోని ఎస్ఆర్ఎఫ్ లేక్ ష్రైన్ వద్ద ‘సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్’ సహకారంతో ఉదయం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మహాత్మా గాంధీ అస్థికల కొంత భాగాన్ని పరమహంస యోగానంద ప్రతిష్ఠించిన మహాత్మా గాంధీ వరల్డ్ పీస్ మెమోరియల్ వద్ద ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలో భారత కాన్సులర్ జనరల్ డా.కె.జె. శ్రీనివాస మాట్లాడుతూ మహాత్మా గాంధీ చాటిన సత్యం, శాంతి, అహింస విలువలను అలాగే లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాన్ని గుర్తుచేశారు. అలాగే ప్రజాస్వామ్య విలువలు, శాంతి, మానవతా దృక్పథం విషయంలో భారత్, అమెరికా దేశాల మధ్య ఉన్న భాగస్వామ్యాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ స్వామి విశ్వానంద గిరి, మినిస్టర్-ఇన్-చార్జ్ బ్రదర్ సత్యానంద తదితరులు ప్రసంగించగా, కాన్సులర్ జనరల్ నేతృత్వంలో అతిథులు సరస్సు మార్గం గుండా మౌన ప్రదర్శనగా కోర్ట్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ వరకు వెళ్లారు.
ప్రవాస భారతీయులతో ముఖాముఖి…
సాయంత్రం వేళ సెరిటోస్లోని ‘చుగ్, ఎల్ఎల్పి – అటార్నీస్ & సీపీఏఎస్’ కార్యాలయంలో మరో వేడుకను నిర్వహించారు. అక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి కాన్సులర్ జనరల్ పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, స్థానిక ప్రవాస భారతీయ సభ్యులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. గాంధీజీ జీవితం, ఆయన ఆశయాలు నేటి తరానికి ఎంతగానో అవసరమని కమ్యూనిటీ సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సాయంత్రం సమావేశంలో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ఆసక్తికర అంశాలపై కాన్సులర్ జనరల్ చర్చించి వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రవాస భారతీయులతో నిరంతరం మమేకవుతూ, శాంతి, సేవ, సామాజిక భాగస్వామ్యం వంటి జాతీయ నాయకుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో లాస్ఏంజెల్స్లోని భారత కాన్సులేట్ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.









