Left Parties: ఆర్టీసీ ఎన్నికల్లో వింత పొత్తు!
కమ్యూనిస్టు పార్టీలు అనగానే సీపీఐ, సీపీఎం గుర్తుకొస్తాయి. ఈ రెండు పార్టీలు మెజారిటీ సందర్భాల్లో కలిసే పోటీ చేస్తుంటాయి. కలిసే పోరాటాలు చేస్తుంటాయి. అయితే తెలంగాణలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత కొరవడింది. చాలాకాలంగా ఈ రెండు పార్టీల దారులు వేర్వేరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో అయినా ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని అందరూ భావించారు. అయితే ఇప్పుడు ఆ ఎన్నికల్లో కూడా కలిసి పని చేసే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇవి కేవలం కార్మిక సంఘాల మధ్య జరిగే ఎన్నికలు మాత్రమే కాదు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక సమీకరణాలకు దారి తీస్తుంటాయి. కార్మిక సమస్యల పరిష్కారం కంటే.. రాజకీయ పార్టీల వ్యూహాలు, ఆధిపత్య పోరు ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంల మధ్య ఈ ఎన్నికలు పెద్ద సమస్య తెచ్చిపెట్టాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంతో విభేదించిన సీపీఐ.. కాంగ్రెస్ తో జతకట్టింది. కాంగ్రెస్ అండతో ఒక అసెంబ్లీ సీటును కూడా గెలుచుకుంది.
అయితే.. ఆర్టీసీ ఎన్నికల్లో సీపీఐ.. కాంగ్రెస్ నుంచి దూరం జరిగింది. దానికి బదులుగా సీపీఎం వచ్చి కాంగ్రెస్ పార్టీతో జతకడుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ వర్కర్స్ యూనియన్ (TWU), సీపీఎం అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (SWF), అశ్వథామ రెడ్డి వర్గంతో పాటు మరికొన్ని సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి కూటమిగా ఏర్పడ్డాయి. మరోవైపు.. సీపీఐ అనుబంధ ఎంప్లాయూస్ యూనియన్ (EU) మాత్రం తనదారి తానే అన్నట్టు వ్యవహరిస్తోంది. TMDU, NMU వంటి ఇతర సంఘాలతో జత కట్టింది. అసెంబ్లీలో మాటపై ఉన్న కాంగ్రెస్, సీపీఐలు… కార్మిక క్షేత్రంలో మాత్రం పరస్పరం ప్రత్యర్థులుగా నిలబడుతున్నాయి. ఇది ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ పరిణామాల వెనుక లోతైన రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులు సుమారు 39 వేల మంది ఉన్నారు. వీరి ఓట్లు ఏ రాజకీయ పార్టీకైనా, సంఘానికైనా అత్యంత కీలకం. గతంలో ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మిక సంఘాలు పోషించిన పాత్ర, ప్రభుత్వ మార్పులో వాటి ప్రభావం అందరికీ తెలిసిందే. అందుకే.. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆర్టీసీ గుర్తింపు సంఘంపై పట్టు కోల్పోవడానికి ఇష్టపడటం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ యూనియన్ గెలిచినప్పుడే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు లేదా ఇతర ఎన్నికల్లో కార్మిక వర్గం మద్దతు సులభమవుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
మరోవైపు, వామపక్షాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు ఈ ఎన్నికల్లో స్పష్టంగా బయటపడ్డాయి. సీపీఎం ఏకంగా కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగుతుండగా, సీపీఐ మాత్రం స్వతంత్రంగా లేదా ఇతర సంఘాలతో కలిసి పోటీ చేయడం వామపక్ష ఐక్యతలోని లొసుగులను ఎత్తిచూపుతోంది. ఒకప్పుడు కార్మిక ఉద్యమాలకు కంచుకోటగా ఉన్న వామపక్షాలు, నేడు తమ ఉనికిని కాపాడుకోవడానికి వేర్వేరు రాజకీయ శక్తుల పొత్తులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం కార్మిక హక్కుల పోరాటం కాకుండా, ఎవరికి వారు తమ రాజకీయ బలాన్ని నిరూపించుకునే వేదికగా మారింది. అక్టోబర్ 17న వెలువడే ఫలితాలు ఎవరి సత్తా ఏంటో తేల్చనున్నాయి.








